AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: గోవిందా.. 50 కిలోల గోల్డ్ గోవిందా.? తిరుపతిలో ఈసారి గోవిందరాజుస్వామి ఆలయంలో.!

తిరుపతి గోవిందరాజుల స్వామి విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో 50 కిలోల బంగారం మాయమయిందని దుమారం రేగింది. ఇదంతా గత ప్రభుత్వ హయంలో జరిగిందని రాద్ధాంతం మొదలైంది. మరోవైపు టీటీడీ విజిలెన్స్ ఎంక్వయిరీ అత్యంత రహస్యంగా ఉంచారు. ఆ వివరాలు ఇలా..

Tirupati: గోవిందా.. 50 కిలోల గోల్డ్ గోవిందా.? తిరుపతిలో ఈసారి గోవిందరాజుస్వామి ఆలయంలో.!
Tirupati Temple
Raju M P R
| Edited By: |

Updated on: Dec 24, 2025 | 11:39 AM

Share

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు మరో స్కామ్ అంటూ రచ్చ జరుగుతోంది. సాక్షాత్తు తిరుమల శ్రీవారికి అన్నగా భావించి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు ఇప్పుడు ఆలయ విమాన గోపురం బంగారు తాపడం వెనుక మరో స్కాం ఉందన్న అభియోగాలను వింటున్నారు. టీటీడీ ఇప్పటికే వరుస వివాదాలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే భక్తుల మనోభావాలకు సంబంధించిన మరో అంశం.. ఇప్పుడు గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురం బంగారు తాపడంగా తెర మీదికి వచ్చింది. గత ప్రభుత్వ హయంలో ఇది మరో అక్రమం అవినీతి అంటూ జనసేన గగ్గోలు పెడుతోంది. ఒక వైపు కల్తీ నెయ్యి, పరకామణి చోరీ, వస్త్రాల కొనుగోళ్లలో అవినీతి లాంటి అంశాలపై విచారణ జరుగుతుండగా.. ఇప్పుడు టీటీడీ విజిలెన్స్ విచారణ అత్యంత గొప్యంగా కొనసాగుతోంది. తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతుగా విచారణ జరుపుతోంది. 30కిపైగా విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా తెరపైకి వచ్చింది.

ఎంతో ప్రాముఖ్యం ఉన్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి 2022-23 మధ్యకాలంలో ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేసేందుకు టీటీడీ నిర్వహించింది. వంద కిలోల బంగారం కేటాయించింది. మరో 4300 కిలోల రాగితో విమాన గోపురం బంగారు తాపడం పనులను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొమ్మిది పొరలతో తాపడం చేయాలని జ్యోతి అనే మహిళ కాంట్రాక్ట్ దక్కించుకుంది. పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్ సబ్ లీజ్‌కు ఇచ్చింది. 9 పొరలతో బంగారు తాపడంపరలు చేపట్టాల్సి ఉండగా రెండు పొరలతోనే పనులు సరిపెట్టి దాదాపు సగం బంగారాన్ని మాయం చేసినట్లు ఆరోపణలున్నాయి. విమాన గోపురంపై 30కి పైగా విగ్రహాలు ధ్వంసం చేసి, ఆపై బంగారు తాపడం పనులు చేసినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి.

ఈ అంశాన్ని బయటకు అప్పటి టీటీడీ పెద్దలు చేశారన్న అభియోగాలపైనే ఇప్పుడు రచ్చ మొదలైంది. విమాన గోపురం పనులపై వచ్చిన ఫిర్యాదులపై ఇప్పుడు ఆరా తీస్తున్న టీటీడీ విజిలెన్స్ అసలు కాంట్రాక్టర్, సబ్ లీజుకు పనులు పూర్తి చేసిన వారిపై దృష్టి పెట్టింది. అన్ని అంశాలపై టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది. అప్పటి ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించడంలో నిమగ్నమైంది. దీంతోపాటు బంగారు తాపడం పనులు చేసిన కార్మికులను విచారించిరిస్తున్న టీటీడీ ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు.. ఎంత బంగారం వాడారో అన్ని అంశంపై ఆరా తీస్తోంది. విజిలెన్స్ విచారణ అంతా గోప్యంగానే సాగుతుండడంతో ఇప్పటిదాకా టీటీడీ ఈ వ్యవహారం పై స్పందించకపోగా జనసేన మాత్రం రచ్చ చేస్తుంది.

ఇక వైసీపీ హయంలో స్వామి వారి సొత్తు స్వాహా చేశారని ఆరోపిస్తున్న జనసేన.. గోవిందరాజస్వామి ఆలయ గోపురంపై బంగారు తాపడం పనుల్లో కేజీల కొద్ది బంగారం దోచేశారంటోంది. టీటీడీ 100 కిలోల బంగారం ఇస్తే.. 50 కేజీల బంగారం మాయం చేశారని ఆరోపిస్తోంది. కాంట్రాక్టర్ జ్యోతి.. ఇద్దరు సబ్‌కాంట్రాక్టర్లకు పనులు అప్పగించిందని.. అన్యమతస్తులైన సబ్‌ కాంట్రాక్టర్లు సయ్యద్ కరీం, రహంతుల్లాకు ఆ బాధ్యతలు ఎలా ఇచ్చారని నిలదీస్తోంది. అప్పట్లో నమోదైన కేసును నీరుగార్చారని.. గోపురానికి 9 లేయర్ల తాపడం చేయకుండా కేవలం 2 లేయర్లతో పనులు పూర్తి చేశారంటోంది. గోపురంపై ఉన్న పురాతన 32 దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారని.. ఈ కుంభకోణంలో వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిల పాత్ర ఉందని ఆరోపిస్తోంది. టీటీడీ విజిలెన్స్ విచారణలో నిజాలు బయటకు వచ్చాయని.. బంగారం బదులు గోల్డ్ కలర్ పెయింట్ కొట్టారని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపిస్తున్నారు. బంగారు తాపడం చేశామన్న 50 కిలోల బంగారం నిజమైనదేనా అన్న అనుమానం కూడా ఉందని పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. బంగారు కుంభకోణంపై కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు జనసేన నేత కిరణ్ రాయల్.