AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కొత్త చట్టాల అమలులో సరికొత్త అధ్యాయం.. ఆంధ్ర రాష్ట్రంలోనే తొలి తీర్పు.. ఏంటో తెలుసా..

ప్రకాశం జిల్లాలోని కనిగిరి కోర్టు, దొంగతనం కేసులో నిందితుడికి సామాజిక సేవా శిక్ష (కమ్యూనిటీ సర్వీస్) విధించింది. ఇది నూతన నేర న్యాయ చట్టాల అమలు తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనే తొలి తీర్పు. నిందితుడు కనిగిరిలోని ప్రధాన కూడళ్లను శుభ్రపరచాల్సి ఉంటుంది. ఈ తీర్పు నూతన చట్టాల ప్రభావాన్ని చూపుతుంది.

Andhra Pradesh: కొత్త చట్టాల అమలులో సరికొత్త అధ్యాయం.. ఆంధ్ర రాష్ట్రంలోనే తొలి తీర్పు.. ఏంటో తెలుసా..
Ap News
Fairoz Baig
| Edited By: |

Updated on: Nov 01, 2024 | 7:53 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలిసారిగా ప్రకాశం జిల్లాలోని కనిగిరి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్ట్ జడ్జి కె .భరత్ చంద్ర శుక్రవారం దొంగతనం కేసులో సామాజిక సేవా శిక్ష (కమ్యూనిటీ సర్వీస్) ను విధిస్తూ తీర్పునిచ్చారు. నూతన నేర న్యాయ చట్టాలు అమలులోకి వచ్చిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి తీర్పుగా వెలువడింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రకాశంజిల్లా కనిగిరికి చెందిన పోల అంకయ్య నవంబర్ 2 వ తేదీ నుంచి డిసెంబర్ 31, 2024 వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు కనిగిరి ప్రధాన కూడళ్లను, వీధులను శుభ్రపరిచే పనుల్లో పాల్గొనవలసి ఉంటుంది. ఈ పనిని కనిగిరి మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో చేయాలని న్యాయమూర్తి భరత్‌ చంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నిందితుడికి, కనిగిరి మున్సిపల్ కమిషనర్, పోలీసులకు ప్రత్యేక ఆదేశాలను జారీ చేశారు.

2024 అక్టోబర్‌ 13వ తేదిన ప్రకాశం జిల్లా కనిగిరి దొరువు బజార్ లోని అయ్యప్ప స్వామి ఆలయం ప్రాంగణంలో చోరీ జరిగింది. భక్తులు పూజలో ఉండగా సాయంత్రం 4:30 గంటల సమయంలో నిందితుడు అంకయ్య ఆలయంలోకి ప్రవేశించి 3 ఇత్తడి కలశాలను చోరీ చేశాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే భక్తులు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు అంకయ్యను అదుపులోకి తీసుకుని, చోరీ చేసిన 3 ఇత్తడి కలశాలను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేసిన కనిగిరి ఎస్ఐ టి. శ్రీరామ్ నిందితుడి పై బి.ఎన్.ఎస్ (భారతీయ న్యాయ సంహిత) చట్టం సెక్షన్ 303 (2), 324(3) కింద కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టుకు శుక్రవారం హాజరుపరచగా కనిగిరి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్ట్ జడ్జి కె .భరత్ చంద్ర ఈ తీర్పును వెలువరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..