Andhra Pradesh: సుబ్బులు ఎంతకు తెగించింది భయ్యా.. ప్రియుడి కోసం ఏం చేసిందో తెలిస్తే..
తాళి కట్టిన భర్తను కాదని పరాయి వ్యక్తి వ్యామోహంలో పడింది.. తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కనికరం లేకుండా ప్రాణాలు తీయించింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఒళ్లు గగుర్పొడిచే రీతిలో సాగిన ఈ కిరాతక హత్య వెనుక భార్య ఆడిన దొంగ నాటకాలను పోలీసులు కేవలం 24 గంటల్లోనే బట్టబయలు చేశారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వివాహేతర సంబంధాల మోజులో పడి పవిత్రమైన బంధాలను తుంగలో తొక్కుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కట్టుకున్నవాడే సర్వస్వం అనుకోవాల్సిన భార్య, పరాయి వ్యక్తి వ్యామోహంలో పడి భర్తను అత్యంత కిరాతకంగా అంతమొందించింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తీవ్ర కలకలం రేపిన ఈ హత్య కేసును పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. భార్యతో పాటు ఆమె ప్రియుడు, సహకరించిన మరో నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆళ్లగడ్డ పట్టణంలోని నాయి బ్రాహ్మణ కాలనీకి చెందిన ఆంజనేయులుకు, రుద్రవరం మండలం లింగందిన్నె వాసి అయిన సుబ్బులుతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కాపురం సజావుగా సాగుతున్న సమయంలో సుబ్బులుకు చాగలమర్రి మండలం తోడేళ్లపల్లె గ్రామానికి చెందిన గురుప్రసాద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆంజనేయులు పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. పద్ధతి మార్చుకోవాలని గట్టిగా నిలదీశాడు.
భర్త అడ్డు తొలగించుకునేందుకు స్కెచ్..
భర్త నిలదీస్తుండటంతో తమ సంబంధానికి అతడే పెద్ద అడ్డంకిగా మారాడని సుబ్బులు భావించింది. ఎలాగైనా అతడిని శాశ్వతంగా తప్పించాలని నిర్ణయించుకుని, ప్రియుడు గురుప్రసాద్‌తో కలిసి హత్యకు పక్కా పథకం రచించింది. ఇందులో భాగంగా గురుప్రసాద్ తన స్నేహితుడైన షరీఫ్‌ను కూడా కలుపుకున్నాడు. పథకం ప్రకారం ఆదివారం రాత్రి ఆంజనేయులు వద్దకు వెళ్లిన నిందితులు, సరదాగా మద్యం తాగుదామంటూ నమ్మబలికారు. అతడిని బైక్‌పై ఎక్కించుకుని పాలసాగరం రోడ్డులోని నిర్మానుష్య మొక్కజొన్న తోటల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఆంజనేయులుకు విపరీతంగా మద్యం తాగించి, అతడు మత్తులోకి జారుకున్న తర్వాత ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పక్కనే ఉన్న భారీ బండరాళ్లతో తలపై బలంగా బాది ఘటనా స్థలంలోనే ప్రాణాలు తీశారు. అనంతరం ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి పరారయ్యారు. మరుసటి రోజు ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
భర్త చనిపోయాడని తెలియగానే సుబ్బులు ఏమీ తెలియనట్లు కన్నీరుమున్నీరవుతూ నాటకానికి తెరతీసింది. ఆదివారం రాత్రి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి తన భర్తను బయటకు తీసుకెళ్లారని, తెల్లారేసరికి ఎవరో చంపేశారని నమ్మబలికే ప్రయత్నం చేసింది. అయితే ఆమె మాటల్లోని పొంతన లేకపోవడాన్ని గమనించిన పోలీసులు లోతుగా విచారించారు. తమదైన శైలిలో ప్రశ్నించడంతో సుబ్బులు అసలు నిజాన్ని కక్కేసింది. ప్రియుడు గురుప్రసాద్, అతడి మిత్రుడు షరీఫ్‌లతో కలిసే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అంగీకరించింది.
నేరం రుజువు కావడంతో సుబ్బులు, గురుప్రసాద్, షరీఫ్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదైన ఒక్క రోజులోనే చాకచక్యంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులను పట్టుకున్న సీఐ నాగరాజు రావు, ఎస్సై చిన్న పీరయ్యలను డీఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. తల్లి జైలుపాలు కావడం, తండ్రి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ ఇద్దరు పసిబిడ్డలు అనాథలుగా మారడం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.
