AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంటిచూపును పెంచే సూపర్ యాంటీఆక్సిడెంట్ కూర.. ముఖంపై ముడతలు కూడా తగ్గుతాయ్..

చుక్కకూర రుచితో పాటు విటమిన్‌ సి, విటమిన్‌ ఏ, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలను అందించే ఆకుకూర. ఇవి కంటి, చర్మం, రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యానికి తోడ్పడతాయి. అయితే చుక్కకూరలో ఆక్సలేట్లు ఉండటంతో కిడ్నీ స్టోన్లు ఉన్నవారు లేదా వాటికి గురయ్యే అవకాశం ఉన్నవారు పరిమితి పాటించి వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

కంటిచూపును పెంచే సూపర్ యాంటీఆక్సిడెంట్ కూర.. ముఖంపై ముడతలు కూడా తగ్గుతాయ్..
Chukka Kura Benefits
Shaik Madar Saheb
|

Updated on: Sep 22, 2026 | 10:58 AM

Share

చుక్కకూర, మన భారతీయ వంటకాల్లో తరచుగా ఉపయోగించే ఒక ఆకుకూర.. పుల్లగా ఉండే ఈ కూర కేవలం రుచిని పెంచడమే కాకుండా, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తుంది. పలు రకాల విటమిన్లు, మినరల్స్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు చుక్కకూరలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని అనేక విధాలుగా కాపాడతాయి. చుక్కకూరలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.. అందుకే ఈ ఆకులు పుల్లగా ఉంటాయి. విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది.. తద్వారా శరీరం వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, కొలాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. కొలాజెన్ చర్మానికి సహజసిద్ధమైన సాగే గుణాన్ని అందిస్తుంది, దీనివల్ల ముఖంపై ముడతలు తగ్గి, వృద్ధాప్య ఛాయలు మందగిస్తాయి, మనిషి యవ్వనంగా కనిపిస్తారు.

విటమిన్ ఎ కూడా చుక్కకూరలో పుష్కలంగా లభిస్తుంది. ఇది కంటిచూపును మెరుగుపరచడానికి, రాత్రిపూట చూపును పెంపొందించడానికి అత్యవసరం. రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ ఎ కూడా పాలు పంచుకుంటుంది, చర్మ కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

హిమోగ్లోబిన్ ఉత్పత్తికి..

శరీరానికి ఐరన్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చుక్కకూరలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి దోహదపడుతుంది, తద్వారా రక్తంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. దీనివల్ల అలసట, నీరసం తగ్గుతాయి, శరీరం శక్తివంతంగా ఉంటుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి చుక్కకూర ఒక అద్భుతమైన ఆహారం, ఇది రక్తం వృద్ధి చెందడానికి సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యం..

మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు చుక్కకూరలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తపోటును (బీపీ) నియంత్రణలో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి, ముఖ్యంగా హై బీపీ ఉన్నవారికి మేలు చేస్తాయి. ఈ మినరల్స్ కండరాలు, నాడులు సక్రమంగా పనిచేసేలా చూస్తాయి. చాలామందిని బాధించే రాత్రిపూట కాలి పిక్కలు పట్టుకుపోయే సమస్యను నివారించడంలో ఇవి తోడ్పడతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడటానికి కూడా ఇవి ఎంతగానో సహాయపడతాయి. కాల్షియం ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది, బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలను నివారిస్తుంది.

చుక్కకూరలో పాలీఫినోలిక్ యాసిడ్లు, ఫ్లేవనాయిడ్లు, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులను తగ్గించడంలో, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. దీని ఫలితంగా గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి శరీరం సురక్షితంగా ఉండటానికి అవకాశం ఉంది.

ఎలాగైనా తినొచ్చు..

చుక్కకూరలో అనేక ఔషధ గుణాలు ఉన్నందున.. కూరగా లేదా జ్యూస్ లా తయారు చేసి కూడా తాగవచ్చు. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి, శరీరం డీటాక్స్ అవుతుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగాలు రాకుండా చూసుకోవచ్చు.

కిడ్నీల్లో రాళ్లు ఉంటే.. దూరంగా ఉండటమే బెటర్..

అయితే, చుక్కకూర ప్రయోజనాలతో పాటు ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. చుక్కకూరలో ఆక్సాలిక్ యాసిడ్ అనే రసాయనం ఉంటుంది. అధిక మొత్తంలో ఆక్సాలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే కిడ్నీలో స్టోన్లు ఉన్నవారు లేదా స్టోన్లు ఏర్పడే అవకాశం ఉన్నవారు చుక్కకూరను తినకపోవడమే మంచిది. ఆరోగ్యకరమైన వ్యక్తులు మితంగా తీసుకోవడం వల్ల ప్రయోజనాలను పొందవచ్చు. ఎటువంటి సందేహాలు ఉన్నా వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us