AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: చిక్కిందండి సరైన పులస.. ఎంత ధర పలికిందో తెలుసా..?

యానాం గౌతమీ గోదావరిలో లభించిన పులస చేప వేలంలో రికార్డు ధర పలికింది. కోటిపల్లికి చెందిన మత్స్యకారుడు మల్లాడి సత్యనారాయణ రూ.26 వేలకు పులసను దక్కించుకోగా.. మరో రూ.వెయ్యి అదనంగా వేసుకుని రూ.27 వేలకే విక్రయించారు. ఈ ఏడాది యానాంలో పులస చేపకు లభించిన అత్యధిక ధర ఇదే.

Andhra: చిక్కిందండి సరైన పులస.. ఎంత ధర పలికిందో తెలుసా..?
Yanam Pulasa Fish
Ram Naramaneni
|

Updated on: Sep 22, 2026 | 10:55 AM

Share

పులస చేప అంటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాంసాహార ప్రియులకు ప్రత్యేకమైన క్రేజ్. గోదావరిలో అరుదుగా లభించే ఈ చేపకు ఎప్పుడూ డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. తాజాగా యానాంలో లభించిన ఓ పులస చేప వేలంలో రికార్డు ధర పలికింది. ఒక్క చేపను ఏకంగా రూ.26 వేలకు కొనుగోలు చేయగా.. ఆ తర్వాత రూ.27 వేలకే విక్రయించినట్లు మత్స్యకారుడు తెలిపారు. ఈ ఏడాది యానాంలో పులస చేపకు లభించిన అత్యధిక ధర ఇదేనని చెబుతున్నారు. యానాం గౌతమీ గోదావరిలో మంగళవారం లభించిన పులస చేపను వేలం వేశారు. వేలం పాటలో రూ.26 వేల ధర పలకగా.. కోటిపల్లికి చెందిన మత్స్యకారుడు మల్లాడి సత్యనారాయణ ఆ చేపను దక్కించుకున్నారు. ఈ ఏడాది యానాంలో పులస చేపకు లభించిన అత్యధిక ధరగా ఇది రికార్డుగా నిలిచింది.

గత పది రోజులుగా గౌతమీ గోదావరిలో సుమారు ఏడు పులస చేపలు మాత్రమే మత్స్యకారుల వలకు చిక్కినట్లు సమాచారం. వీటిలో ఒక్కో చేప రూ.14 వేల నుంచి రూ.22 వేల వరకు ధర పలికింది. తాజాగా దొరికిన పులస చేప మాత్రం ఏకంగా రూ.26 వేల ధర పలకడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. వేలంలో రూ.26 వేలకు చేపను కొనుగోలు చేసిన మల్లాడి సత్యనారాయణ.. మరో రూ.వెయ్యి అదనంగా వేసుకుని మొత్తం రూ.27 వేలకే విక్రయించినట్లు తెలిపారు. పులస చేపకు ఉన్న డిమాండ్ కారణంగానే ఈ స్థాయిలో ధర పలుకుతోందని మత్స్యకారులు చెబుతున్నారు.

గౌతమీ గోదావరిలో పులస చేపలు అరుదుగా లభిస్తుండటంతో ఈ ఏడాది వాటికి భారీ డిమాండ్ ఏర్పడింది. సాధారణంగా పులస చేప దొరకడమే అరుదు కాగా.. లభించిన చేపలకు వేలంలో భారీ ధరలు పలుకుతున్నాయి. దీంతో మత్స్యకారులకు పులస చేపలు మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి.

యానాం మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పులస చేపకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గోదావరి ప్రాంతంలో పులస వంటకానికి ఉన్న ప్రత్యేకత, రుచిపై ఉన్న నమ్మకం కారణంగా ఈ చేపకు మార్కెట్‌లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. తాజాగా ఒక్క పులస చేప రూ.26 వేల ధర పలకడం మరోసారి దాని క్రేజ్‌ను చాటిచెప్పింది. పులస చేప సంతానోత్పత్తి కోసం వర్షాకాలంలో సముద్రం నుండి గోదావరి నది ప్రవాహానికి ఎదురీదుతూ వస్తుంది. అందుకే దానికి అంత రుచి అని చెబుతారు.

Follow Us