రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 24 గంట్లోనే ఖాతాల్లోకి నగదు! మంత్రి భరోసా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతులు పండించిన.. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతులు అస్సలు దిగులు పడాల్సిన అవసరమే లేదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. బుధవారం ఉయ్యూరులో అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి నాదేండ్ల ఈ వ్యాఖ్యలు చేశారు.

బుధవారం ఉదయం ఉయ్యూరు మండలంలో మంత్రి నాదెండ్ల పర్యటించారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వైస్ చైర్మన్, ఎండి ఎస్ డిల్లీరావు, జిల్లా కలెక్టర్ డీ తదితర అధికారులతో కలిసి మండలంలోని గండిగుంట–2 రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి ధాన్యం సేకరణ ప్రక్రియను పరిశీలించారు. కేంద్రంలో ధాన్యం కొనుగోలు సాంకేతిక సిబ్బందితో మాట్లాడి అందుబాటులో ఉన్న గోనె సంచులు, రవాణా వాహనాలు, ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన సతీష్ కుమార్ పొలంలో పండించిన ఎంటియు 1262 రకం ధాన్యం తేమ శాతాన్ని మంత్రి సమక్షంలో పరీక్షించారు.. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 శాతం ఉండాల్సిన తేమ.. 15.9 శాతం వచ్చింది. అంతకుమించి తేమశాతం ఉన్న ధాన్యాన్ని రైతుకు సమ్మతమైతే ఒక శాతానికి ఒక కేజీ చొప్పున మినహాయింపు చేస్తున్నట్లు వివరించారు. అక్కడికి చేరుకున్న రైతులతో మంత్రి ముఖాముఖి మాట్లాడి ధాన్యం సేకరణలో వారికున్న సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ధాన్యం సేకరణ పారదర్శకంగా చేపడుతూ రైతులకు అండగా ఉన్నామని అన్నారు. రైతు సేవ కేంద్రాల (ఆర్ఎస్కే) ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ మద్దతు ధర ఇచ్చి 24 గంటల్లోపే రైతు ఖాతాలకు నగదు జమ చేస్తున్న సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే నేటికి 2 వేల శాతంతో అధికంగా ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వాతావరణ మార్పులకు రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా ఆర్ఎస్కే ల ద్వారా విక్రయించి మద్దతు ధర పొందాలని మంత్రి కోరారు. జిల్లాలో ఎక్కడా కూడా గోనె సంచుల కొరత, రవాణా వాహనాల ఇబ్బందులు లేకుండా గత సంవత్సరపు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 6.52 కోట్ల గోనె సంచులు ఆర్ఎస్కే ల ద్వారా రైతుల కల్లాల వద్దకే చేరుస్తున్నామన్నారు. రైతులకు గత సంవత్సరం 50 శాతం సబ్సిడీతో టార్పాలిన్లు అందించామని, అయితే ప్రస్తుతం పూర్తిగా ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో ఈ నెలాఖరుకల్లా లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, డిసెంబరులో 7.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమును కొనుగోలు చేయనున్నామని తెలిపారు. జిల్లాలో 99 శాతం ఈ–పంట పూర్తి చేశామని, కౌలు రైతులకు గంటల వ్యవధిలోనే ధాన్యం కొనుగోలు నగదు జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వాతావరణ మార్పుల సమయంలో ప్రభుత్వ సూచనలను పాటిస్తూ పంటను సురక్షితంగా కాపాడుకునేందుకు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 190 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, వాటి ద్వారా నిన్న మంగళవారం వరకు 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఆర్ఎస్కే లలో నాణ్యమైన గోనె సంచులు, రవాణా వాహనాలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి సమస్యలు ఇబ్బందులు ఉన్నా ఆర్ఎస్కే లలోని సిబ్బందిని సంప్రదించి సహాయం పొందాలని రైతులకు సూచించారు. వరి కోత యంత్రం మళ్ళీ రాదనే ఆందోళనలో, పరిపక్వానికి రాని వరి పంటను ముందుగానే కోసి నష్టపోవద్దని, అవసరమైనప్పుడు వరి కోత యంత్రాన్ని పంపించి కోత కోయిస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
