
రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన పలు ధాన్యం సేకరణ కేంద్రాలు, గోదాములు మరియు రైస్ మిల్లులను తనిఖీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, సుమారు 6 లక్షల మంది రైతులకు రూ. 9,300 కోట్లు కేవలం 24 గంటల వ్యవధిలోనే చెల్లించామని మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన రూ. 1,674 కోట్ల ధాన్యం బకాయిలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే పూర్తిగా చెల్లించిందని మంత్రి నాదేండ్ల గుర్తుచేశారు. గార మండలం రామచంద్రాపురంలో రైతులతో ముఖాముఖి మాట్లాడగా, కొందరికి కేవలం 4 గంటల్లోనే డబ్బులు జమ అయ్యాయని రైతులు తెలపడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తరుగు, తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని మిల్లర్లను ఆదేశించారు.
శ్రీకాకుళం జిల్లాలో 6.50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గానూ ఇప్పటికే 5 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయిందని, రైతులకు రూ. 1,200 కోట్లు అందజేశామని మంత్రి నాదేండ్ల వివరించారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా 34 వేల పాఠశాలలు, 4వేల సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యాన్ని సరఫరా చేస్తున్నామని గుర్తుచేశారు. ఎమ్మెల్యే గొండు శంకర్ కృషితో ఈ ప్రాంత సమస్యలు పరిష్కారమవుతున్నాయని కొనియాడారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.