Andhra Pradesh: నీ రాజకీయాలు తాడిపత్రిలో చేసుకో.. జేసీకి టీడీపీ నేతల స్ట్రాంగ్ వార్నింగ్..
Andhra Pradesh: టీడీపీలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా టీడీపీలోని పలువురు నేతలను లక్ష్యంగా చేసుకుని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Andhra Pradesh: టీడీపీలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా టీడీపీలోని పలువురు నేతలను లక్ష్యంగా చేసుకుని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తీవ్రంగా స్పందించారు. జేసీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘నీ రాజకీయాలు తాడిపత్రిలో చేసుకో.. అనంతపురంలో చేయాలని చూస్తే తస్మాజాగ్రత్త.. నువ్ బెదిరింపులు, దౌర్జన్యాలు చేస్తే ఇక్కడ గాజులు తొడుక్కుని ఎవరూ లేరు..’’ అంటూ తీవ్ర స్వరంతో వార్నింగ్ ఇచ్చారు.
అనంతపురంలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన రాయలసీమ సదస్సులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కొందరు నేతలను ఉద్దేశించి.. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్‌పై అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ‘‘మీ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అసలు మీరొచ్చిన తరువాతనే అనంతపురం జిల్లా టీడీపీలో గ్రూప్ తగాదాలు ఎక్కువయ్యాయి’’ అంటూ ప్రభాకర్ చౌదరి ధ్వజమెత్తారు. కార్యకర్తలను రక్షించుకోవాలని తమకు నీతులు చెప్పొద్దని, ముందు తాడిపత్రిలో మీ వలన నష్టపోయిన వందలాది కార్యకర్తల గురించి చూసుకో అంటూ జేసీకి హితవు చెప్పారు. అంతే కాదు.. ‘‘మీరేవో తప్పుడు పనులు చేసి ఇబ్బంది పడితే మేము మీ వెంట రావాలా.. అసలు మీరే జిల్లాలో పెద్ద సమస్యగా మారిపోయారు..’’ అంటూ ప్రభాకర్ చౌదరి కుండబద్దలు కొట్టారు.
ఇకపోతే.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ కూడా అంతే స్థాయిలో ఫైర్ అయ్యారు. పార్టీని భ్రష్టు పట్టించే కార్యక్రమాలు మానుకోవాలని హితవుచెప్పారు. ఇష్టముంటే పార్టీలో కొనసాగాలని లేకపోతే దూరంగా ఉండాలని హితవు పలికారు. వ్యక్తిగత అవసరాల కోసం చంద్రబాబు వద్దకు వచ్చి.. తెలుగుదేశం పార్టీలో చేరి.. ఆపై పార్టీని భ్రష్టు పట్టించారంటూ ధ్వజమెత్తారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు చేశారని, ఈ విషయం మీ కుటుంబం మొత్తానికి తెలుసునని దుయ్యబట్టారు. జేసీ కుటుంబం వల్లే జిల్లాలో పార్టీ తీవ్రంగా దెబ్బతిన్నదని జితేంద్ర వ్యాఖ్యానించారు. అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని.. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో రాయలసీమకు నీటి విషయంలో జరుగుతున్న అన్యాయంపై చర్చించి కార్యాచరణ రూపొందించడం కోసం నాలుగు జిల్లాల నాయకులతో ఈ సమావేశం ఏర్పాటు చేశారని అన్నారు. అంతేగాని కాలువ శ్రీనివాస్ వైసీపీ నాయకులతో లాలూచీ పడ్డారని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని జితేంద్ర ప్రశ్నించారు. ఇకనైనా జేసీ తన పద్ధతి మార్చుకోవాలని జితేంద్ర హెచ్చరించారు. గత ఎన్నికలలో గ్రూప్ లు కట్టి పార్టీ నీ దెబ్బతీశారని ఆయన ఆరోపించారు.
Also read:
Sai Dharam Tej Accident: నిలకడగా సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం.. అపోలోలో కొనసాగుతున్న చికిత్స
Living Rock: ఈ రాయిని కోస్తే రక్తం చిమ్ముతోంది.. అసలు విషయం తెలిస్తే షాక్ తింటారు