Andhra Pradesh: టీడీపీ అత్యాచార దొంగలతో “సంకల్ప దీక్షలు” చేస్తారా?.. విజయవాడ ఘటనపై రోజా ఫైర్..

Andhra Pradesh: విజయవాడలో మైనర్ బాలిక ఆత్మహత్యపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా స్పందించారు. బాలికపై లైంగిక..

Andhra Pradesh: టీడీపీ అత్యాచార దొంగలతో సంకల్ప దీక్షలు చేస్తారా?.. విజయవాడ ఘటనపై రోజా ఫైర్..
Follow us

|

Updated on: Jan 30, 2022 | 8:37 PM

Andhra Pradesh: విజయవాడలో మైనర్ బాలిక ఆత్మహత్యపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా స్పందించారు. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన టీడీపీ నేతను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆదివారం నాడు ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఆమె.. బాధ్యుడైన టీడీపీ నేతపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడకు చెందిన టీడీపీ నాయకుడు వినోద్‌ జైన్‌ వేధింపులతో భవానీపురానికి చెందిన 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన వింటుంటే చాలా బాధేస్తోందన్నారు. ‘‘60ఏళ్ల వ్యక్తి, ఒక ప్రజా ప్రతినిధిగా పోటీ చేసిన వ్యక్తి పద్నాలుగేళ్ల బిడ్డను ఓ తండ్రిలా చూడాలి కానీ, ఇలా లైంగికంగా వేధించడం ఎంతవరకు సమంజసం.’’ అని ప్రశ్నించారు.

ఇలాంటివాళ్లకి కచ్చితంగా బుద్ధి చెప్పేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియచేయాలని మహిళా లోకానికి ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ల వరకూ వారిపై అత్యాచారాలు జరిగాయని ఆరోపించారు. మహిళా వ్యతిరేకి అయిన చంద్రబాబు వల్ల, టీడీపీ నాయకులు అంతా ఏవిధంగా మహిళలను హింసించారు, వేధించారు, కాల్‌మనీ, సెక్స్‌రాకెట్‌ పేరుతో ఎంతోమందిని వ్యభిచార కూపంలోకి దించారో కళ్లారా చూశామని అన్నారు. అలాగే వనజాక్షిలాంటి సిన్సియర్‌ అధికారిణిపై ఎలా దాడి చేశారో చూశామన్నారు. అలాగే చదువుల తల్లి రిషితేశ్వరిని ఎలా పొట‍్టన పెట్టుకున్నారో చూశామంటూ చంద్రబాబు పాలనా కాలంలో చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ ఎమ్మెల్యే రోజా గుర్తు చేశారు. చంద్రబాబు పాలనా కాలంలో జరిగిన అరాచకాలపై ప్రశ్నిస్తే.. అసెంబ్లీ రూల్స్‌కి విరుద్ధంగా తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని, రాష్ట్ర ప్రజలందరూ ఈ దారుణ చర్యను చూశారని అన్నారు.

ఇలాంటి దొంగలు… నారీ సంకల్ప దీక్ష చేస్తున్నామంటున్నారంటూ టీడీపీ నేతలపై ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. ఏ మొహం పెట్టి ఆ దీక్షలు చేస్తారని ఆమె ప్రశ్నించారు. టీడీపీ నేతలకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే వేధింపులకు గురై ప్రాణాలు కోల్పోయిన బాలిక ఇంటి ముందు కూర్చుని సంకల్ప దీక్షలు చేయండని, అప్పుడు తెలుస్తుంది ఎవరు దొంగలని? అన్నారు.

ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మహిళల భద్రత కోసం దిశా పోలీస్‌ స్టేషన్లు తీసుకువచ్చారని సీఎం జగన్ పాలనా విధానాలను కొనియాడారు. దిశ యాప్‌ తీసుకువచ్చి దానిద్వారా ఫిర్యాదు చేసిన అయిదు నిమిషాల్లోనే అక్కడకు పోలీసులు చేరుకుని బాధితులకు రక్షణ కల్పించిన దాఖలాలు అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. 14 ఏళ్ల బాలిక ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోయి ఆత్మహత్యకు పాల్పడిందని విజయవాడ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. అదే దిశ యాప్‌ద్వారా ఫిర్యాదు చేసినా ఇవాళ ప్రాణాలతో ఉండేదన్నారు.

‘‘మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మహిళలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసి, తప్పు చేసినవాళ్లకు శిక్ష పడేలా చేయాలి కానీ, మీలో మీరే కుమిలిపోయి, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి, ప్రాణాలు తీసుకుంటే మీ కుటుంబం ఎంత కుంగిపోతుందో దయచేసి ఆలోచించండి.’’ అంటూ మహిళలకు విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే రోజా.

దొంగలే దొంగ.. దొంగ అన్నట్లుగా.. తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. టీడీపీ మహిళల వ్యతిరేక పార్టీ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అన్నారు. టీడీపీ హయాంలో మహిళలపై ఎలా దాడులు చేశారో అందరికీ తెలుసునని అన్నారు. మొన్నటికి మొన్న లోకేష్‌ పీఏ మహిళలను లైంగికంగా వేధించారంటూ టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద దీక్షలు చేయడం అందరికీ తెలిసిందేనన్నారు.

టీడీపీ వాళ్లు చేసిన తప్పులను ఒకవైపు సమర్థించుకుంటూ.. మరోవైపు చంద్రబాబు నాయుడుని కాపాడుకుంటూ.. సీఎం జగన్‌‌పై బుదర చల్లాలని దీక్షలు చేసేవారిందరికీ గట్టిగా బుద్ధి చెప్పేవిధంగా అందరూ సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే రోజా.

‘‘విజయవాడ బాలిక రాసిన సూసైడ్‌ నోట్‌లో వినోద్‌ జైన్‌ ఏవిధంగా ఆమెను వేధించాడో తెలుస్తోంది. అది చదువుతుంటే చాలా బాధేస్తోంది. ఆమె ఎవరికీ చెప్పుకోలేక ఎంతో వేదనకు గురై ప్రాణాలు తీసుకుంది. ఆ అమ్మాయి చివరి కోరిక అయిన వినోద్‌ జైన్‌ను కఠినంగా శిక్షించాలని కోరుకుంది. ఆమె చివరి కోరికను ప్రభుత్వం నెరవేర్చాలి. పోలీసులు ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా తప్పు చేసినవాడిని కఠినంగా శిక్షించాలి. జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు జరగకుండా మహిళకు భద్రత ఇచ్చే విషయంలో ఆయన వందశాతం నిబద్ధతతో ఉన్నారు.’’ అని అన్నారు రోజా.

‘‘ఇలాంటి వారు చేసే పనులకు తక్షణమే శిక్షించేలా సెక్షన్లు నమోదు చేసి, పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా నేరస్తులను శిక్షించే విషయంలో ముఖ్యమంత్రి జగన్ చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. ఇలా మరో బాలిక బలి కాకూడదు. తెలుగుదేశం పార్టీలో బరితెగించినవారికి బుద్ధి వచ్చేవిధంగా ఈరోజు నుంచి ర్యాలీలు చేసి మహిళలను చైతన్యపరచాలి. దిశ పోలీస్‌ స్టేషన్‌, దిశ యాప్‌ తో పాటు ప్రతి సచివాలయంలో ఓ మహిళా కానిస్టేబుల్‌ ఉండటం వల్ల మహిళలు తమ సమస్యలను వారితో చెప్పుకునేందుకు అవకాశం ఉంది. ఆపదలోనూ, కష్టంలో ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం.’’ అని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.

Also read:

Australian Open 2022: దుమ్మురేపిన స్పెయిన్ బుల్.. రికార్డు సృష్టించిన రాఫెల్ నాదల్‌..

NHPC JE Recruitment 2022: ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు గుడ్‌న్యూస్.. NHPCలో రిక్రూట్‌మెంట్.. ఫిబ్రవరి 21 లోపు దరఖాస్తు చేసుకోండి..

Hrdik Pndya: బయో బబుల్‌లో జీవించడం కష్టం.. అయినా తప్పదు..