NTR Health University: ప్రభుత్వ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మారుస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది ఏపీ సర్కార్. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీని వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీగా మారుస్తూ బిల్లును రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బిల్లును ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి రజని.. రూపాయి డాక్టర్‌గా వైఎస్ఆర్ పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ తీసుకువచ్చి పేదలకు దేవుడిగా మారారని కీర్తించారు. హెల్త్ వర్శిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి రజని. ఇదే సమయంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై రగడ చేస్తున్న టీడీపీ నేతలకు, ముఖ్యంగా చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి రజని. ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ పేరు మార్చేస్తామని చంద్రబాబే అన్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ గురించి చంద్రబాబు ఏం మాట్లాడారో అందరికీ తెలుసునని అన్నారు.
కాగా, ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. స్పీకర్ పోడియం దగ్గర తోపులాట జరిగింది. పేరు మార్పును వ్యతిరేకిస్తూ తీవ్ర ఆందోళన చేశారు. బిల్లు పేపర్లు చించేసి స్పీకర్‌పైకి విసిరేశారు. దీంతో టీడీపీ సభ్యుల్ని సభ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్. ఆ తర్వాత కూడా సభలో గందరగోళం నెలకొంది. మార్షల్స్ సాయంతో టీడీపీ సభ్యుల్ని బయటకు పంపారు. ఆ సమయంలో మార్షల్స్‌తో వాగ్వాదానికి దిగారు టీడీపీ సభ్యులు. వారి తీరును తీవ్రంగా తప్పుబట్టారు స్పీకర్. ఇకపోతే అసెంబ్లీ బయట ఎన్టీఆర్ వర్సిటీ సవరణ బిల్లు కాపీలు తగులబెట్టారు టీడీపీ ఎమ్మెల్యేలు. బిల్లు వెనక్కి తీసుకునేవరకూ పోరాటం కోనసాగుతుందన్నారు.