Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. ప్రతీ ఏడాది నేరుగా అకౌంట్లోకి రూ.2,400.. రాష్ట్రంలోని ప్రతీఒక్కరికీ వర్తింపు..
గ్యాస్ కొరత వేళ ఏపీ ప్రభుత్వం కొత్త పథకం ప్రారంభించింది. ప్రజలకు ఉపయోగపడేలా కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ నెల నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ఈ పథకం ద్వారా ప్రతీ సంవత్సరం రూ.2,400 పొందవచ్చు. రాష్ట్రంలోని అందరికీ ఈ పథకం వర్తిస్తుంది.

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అందించింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ సిలిండర్లను వదిలేసి పైప్ లైన్ గ్యాస్‌లోకి ప్రజలు మారాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇందులో భాగంగా ప్రజలు పీఎన్‌జీలోకి మారేలా ప్రోత్సహించేందుకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. అదేంటంటే.. PNG వాడితే సంవత్సరానికి రూ.2,400 సబ్సిడీ ప్రజలకు ఇవ్వనుంది. PNG వినియోగాన్ని పెంచేందుకు ఏడాదికి రూ.2,400 సబ్సిడీని DBT రూపంలో నేరుగా వినియోగదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనుంది. ఈ విషయాన్ని సీఎస్ సాయిప్రసాద్ సెక్రటేరియట్‌లో జరిగిన SLUCC సమావేశంలో వెల్లడించారు.
ప్రతీ ఏడాది అకౌంట్లోకి రూ.2,400
LPGపై ప్రజలు ఆధారపడడాన్ని తగ్గించే చర్యలు ప్రభుత్వం చేపట్టింది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అనుమతులను వేగవంతం చేసింది. ప్రతి జిల్లాకు 10,000 PNG కనెక్షన్ల లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. గృహ, వాణిజ్య, పరిశ్రమలకూ దీనిని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. PNG అందుబాటులో ఉన్న ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఏపీ పీఎన్‌జీ సబ్సిడీ పథకం పేరుతో సబ్సిడీని అందించనుంది. రూ.2,400 సబ్సిడీని విడతల వారీగా అకౌంట్లలో జమ చేయనుంది. ప్రతీ రెండు నెలలకు ఒకసారి రూ.400 చొప్పున విడుదల చేయనుంది. సీఎన్‌జీ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఏపీ సీజీడీ రైట్ ఆఫ్ వే రూల్స్-2026ను ప్రవేశపెట్టింది. ఈ నెల 23వ తేదీ నుంచి పాలసీని అమల్లోకి తెచ్చింది. ఈ పాలసీ ద్వారా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు వేగంగా అనుమతులు జారీ చేయడంతో పాటు నిబంధనలను సరళీకృతం చేయనుంది. 24 గంటల్లోనే పీఎన్జీ అనుమతులు, సింగిల్ విండో విధానం, జిల్లా స్థాయిలో కమిటీలే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
గ్యాస్ కొరత వేళ ప్రభుత్వం అలర్ట్
గ్యాస్ కొరత వేళ ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. కొరతను తగ్గించే చర్యలు చేపడుతోంది. సీఎం చంద్రబాబు తరచూ గ్యాస్ కొరత, ఇంధన సంక్షోభంపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు. సరిపడ నిల్వలు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని అధికారులను ఆదేశించారు. అటు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా అధికారులతో తరచూ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని, ప్రజలు భయపడవద్దని సూచిస్తున్నారు. భయపడి అవసరం లేకపోయినా గ్యాస్ బుకింగ్ చేసుకోవద్దని చెబుతున్నారు. అటు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
