గుంటూరు, సెప్టెంబర్ 15: కొంతమంది అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మోసగాళ్లు అందిన కాడికి దండుకుంటున్నారు. కొత్త కొత్త మోసాలు చేస్తున్నారు. పోలీసులు ఎంత అవగాహాన కల్పించిన ప్రజల్లో మాత్రం మార్పు రావటం లేదు. ఇటువంటి ఘటనే గుంటూరులో చోటు చేసుకుంది. కుక్కర్‌లో ఉడకబెట్టి బంగారు ఆభరణాలను మెరుగుపరుస్తామని చెప్పి ఓ దొంగళ ముఠా నగలు కాజేసింది.
గుంటూరు నగరంలోని పండరీపురం ఐదో లైన్ లోని రమేష్ ఇంటి వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇంటిలో రమేష్ ఒక్కరే ఉన్నట్లు గుర్తించారు. చిన్నగా ఇంటి తలుపులు తట్టి లోపలకి వెళ్లారు. వెండి, రాగి ఆభరణాలకు ఇంటి వద్దే మెరుగుపడతామని చెప్పారు. మీ కళ్ల ముందే మెరుగుపడతామని ఛార్జీలు కూడా పెద్దగా ఎక్కువ ఇవ్వనసరం లేదన్నారు. దీంతో రమేష్ వెండి, రాగి వస్తువులను వారికి అందించారు. కొద్దిసేపు అక్కడ మెరుగుపట్టిన యువకులు తళతళ మెరిసే రాగి, వెండి వస్తువులను తిరిగి రమేష్ కు అందించారు.
అంతటితో ఊరుకోకుండా బంగారు ఆభరణాలు కూడా తీసుకొస్తే మెరుగుపట్టి ఇస్తామన్నారు. దీంతో నమ్మకం కుదిరిన రమేష్ 25 సవర్ల బంగారు ఆభరణాలను తీసుకొచ్చి ఆ ఇద్దరి యువకులకు ఇచ్చారు. కుక్కర్ తీసుకు రావాలని చెప్పిన యువకులు రమేష్ కళ్ల ముందే బంగారు ఆభరణాలను కుక్కర్ లో వేశారు. అనంతరం కొద్దీగా పసుపు తీసుకురావాలని చెప్పడంతో రమేష్ ఇంటిలోకి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన యువకులు కుక్కర్ లోని బంగారు ఆభరణాలను తమ బ్యాగ్ లో వేసుకున్నారు. పసుపు తీసుకొచ్చిన రమేష్ కళ్ళ ముందే కుక్కర్ లో కొద్దీగా పసుపు వేశారు. ఒక పదినిమిషాల తర్వాత కుక్కర్ తెరిచి బంగారు ఆభరణాలు తీసుకోవాలన్నారు.
ఆ మాట చెప్పి అక్కడ నుండి ఆ ఇద్దరు యువకులు ఉడాయించారు. అయితే పదినిమిషాల తర్వాత కుక్కర్ ఓపెన్ చేయగా అందులో బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో రమేష్ పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇంద్ర సినిమాలో గంగలో ముంచితే బంగారం రెండింతలు అవుతుందని ఓ ముఠా మోసం చేసిన విధంగానే మెరుగు పేరుతో ముఠా మోసం చేయడాన్ని పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.