హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) వీడియో వ్యవహారంపై టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) మరోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తప్పుదారి పట్టించేందుకు ఫేక్ వీడియో అని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ఉన్మాదంతో ఇష్టానుసారం అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అరాచకాలు తట్టుకోలేక వైసీపీ నేతలు టీడీపీ (TDP) లోకి చేరుతున్నారని చంద్రబాబు చెప్పారు. కుల మతాలకు అతీతంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. అందరూ ఒక్కటైతేనే మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించారు. చేస్తున్న తప్పులను కప్పి పుచ్చుకునేందుకు అధికార ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోందని వెల్లడించారు. ప్రశ్నిస్తే కులముద్ర వేస్తున్నారని, అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. విదేశీ విద్యకు అంబేడ్కర్పేరును తొలగించి తన పేరు పెట్టుకునేంత గొప్పవాడా జగన్ అని నిలదీశారు. అన్ని కులాలు నావే అనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు.
కుప్పంలో కూడా తన కులం వాళ్లు పెద్దగా లేరు. చేసిన మంచే నన్ను గెలిపించింది. ప్రజావేదికతో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. పోలవరం ప్రాజెక్టును నట్టేట ముంచారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి కారణం వైసీపీ ప్రభుత్వమేనని పీపీఏ స్పష్టంగా చెప్పింది. ముందు తెలుగుదేశంపై నిందలు వేశారు. తర్వాత నివేదిక వచ్చాక కేంద్రాన్నే తప్పు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుడు పనుల వల్ల కాఫర్ డ్యాంల మధ్యలో నీరు చేరి డయాఫ్రం వాల్ దెబ్బతింది. టీచర్లపై ఈ ప్రభుత్వం కక్ష కట్టింది. అందుకే ఫేస్ రికగ్నైజింగ్ అటెండెన్స్ ను తీసుకువచ్చింది. ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయకుండా పాఠశాలలను విలీనం చేసేస్తున్నారు. పేద విద్యార్థులకు స్కూళ్లను దూరం చేశారు.
– నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
అమ్మ ఒడి ఇచ్చిన డబ్బులను రాష్ట్రంలో అక్రమంగా అమ్ముతున్న మద్యానికి ఖర్చు చేసే పరిస్థితులను రాష్ట్రంలో తీసుకువచ్చారని చంద్రబాబు వైసీపీ పాలనపై మండిపడ్డారు. రాష్ట్రంలో మనిషి ప్రాణం చులకనైపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు నచ్చని వాళ్లను ఇష్టం వచ్చినట్టు చంపేస్తున్నారని, అరటి తోటలు తగలేస్తే, ఎంపీ బట్టలు ఊడదీసుకుని తిరిగితే కేంద్రంలో మంత్రి అయిపోతారన్నట్లు వైసీపీ నేతలు అనుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..