Andhra Pradesh: ఎమ్మిగనూరులో శ్రీ నీలకంఠుడి జాతర.. మాసాంతం సంబరం ఆరంభం! ఏ రోజున ఏయే కార్యక్రమాలు ఉంటాయంటే
నీలకంఠేశ్వర స్వామి.. ఈ పేరు వింటేనే లక్షలాది జనం పులకించిపోతారు.. పరవశిస్తారు. అలాంటి నీలకంఠేశ్వర స్వామి జాతర రానే వచ్చింది. ఇంకేముంది ఎమ్మిగనూరు ప్రాంతం జనసంద్రంగా మారింది. భక్తి పారవత్యంతో మునిగి తేలుతోంది. ఎమ్మిగనూరు ఇలవేల్పు శ్రీ నీలకంఠుడి జాతర ఉత్సవం అంటే మాసాంతం వరకు సంబరమే సంబరం. ఉత్సవానికి నెలరోజుల ముందు, ఉత్సవం తర్వాత నెలరోజులు యువతను ఉత్సాహపరిచే క్రీడల సమరాలు.. రైతన్నలకు ఆహ్లాదం అందించే వృషభరాజుల బల..
కర్నూలు, జనవరి 24: నీలకంఠేశ్వర స్వామి.. ఈ పేరు వింటేనే లక్షలాది జనం పులకించిపోతారు.. పరవశిస్తారు. అలాంటి నీలకంఠేశ్వర స్వామి జాతర రానే వచ్చింది. ఇంకేముంది ఎమ్మిగనూరు ప్రాంతం జనసంద్రంగా మారింది. భక్తి పారవత్యంతో మునిగి తేలుతోంది. ఎమ్మిగనూరు ఇలవేల్పు శ్రీ నీలకంఠుడి జాతర ఉత్సవం అంటే మాసాంతం వరకు సంబరమే సంబరం. ఉత్సవానికి నెలరోజుల ముందు, ఉత్సవం తర్వాత నెలరోజులు యువతను ఉత్సాహపరిచే క్రీడల సమరాలు.. రైతన్నలకు ఆహ్లాదం అందించే వృషభరాజుల బల ప్రదర్శనతో రైతు సంబరాలు.. పౌరాణిక నాటకాలకు పెట్టింది పేరు ఎమ్మిగనూరు జాతర. ఇక జానపద గేయాలతో దుమ్మురేపుతామంటున్న రెలారేరేల పాటలు దివేతపురిలో శ్రీ స్వాముల జాతర అంటే ఆడపడచుల ఆనందమే ఆనందం పాతజ్ఞాపకాలు నెమరవేస్తూ స్నేహితుల కలయికలో చట్టా పట్టాలు వేసుకుని జాతరలో కలయ తిరగడం, వారి ఆనందాలకు అవధులు లేకుండా పోతాయి. మతసామరస్యానికి ప్రత్యేకంగా ఈ జాతర నిలుస్తుంది. నెల రోజులపాటు అక్కడ వ్యాపారాలు కొనసాగుతాయి.
కళ్యాణం ప్రభావలి..
ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో 25 వ తేదీ రాత్రి శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం 26 వ తేదీ ఉత్సవమూర్తులను ప్రభావళిలో ఊరేగింపు చేపడుతారు.27 వ తేదీ సాయంత్రం మహారథోత్సవం నిర్వహిస్తారు. 27 వ తేదీ శనివారం సాయంత్రం మాచాని కుటుంబీకులు ఉత్సావ విగ్రహాలను మేళ తాళాలతో నాలుగు గంటలకు రత ప్రాంగణానికి తీసుకువచ్చి వేద పండితుల మంత్రోచ్ఛారణలతో రతంగ హోమం కన్నుల విందుగా చేపడుతారు. అనంతరం గడిగే వారి కుటుంబం యాగం కు చేరుకోగానే పూజలు చేపట్టి ఉత్సవ మూర్తులను రథంపై ఆసీనులను చేసి తండోపతండాలుగా తరలివచ్చిన జనహోరు హర హర ధ్వనుల నడుమ రథోత్సవం కనువిందు చేస్తుంది. శివపార్వతుల దర్శనంతో భక్తులు పునీతులు అవుతారు.
జాతర ప్రత్యేకత..
మహారథోత్సవం ముగిసిన అనంతరం తేరుబజారు ప్రాంతం షాపింగ్ మాల్ గా మారిపోతుంది. మట్టి గాజుల నుంచి గృహోపకరణాల దాకా జాతరలో దొరకని వస్తువంటూ ఉండదు. నవదంపతుల కొత్త కాపురానికి అవసరమైన సామగ్రిని జాతరలోనే కొనుక్కోవడం ఓ ఆచారం. ఒంగోలు గిత్తలు, దేశవాళీ పశువులు అమ్మకానికి వస్తాయి. బండ్లు, నాగళ్లు తదితర వ్యవసాయ సామగ్రి కూడా లభిస్తుంది. గయోపాఖ్యానం, కురుక్షేత్రం తదితర పౌరాణిక నాటకాల ప్రదర్శన ఉంటుంది. రాష్ట్ర స్థాయి ఎద్దుల బలప్రదర్శనలు ఉంటాయి. భోజన ప్రియులకైతే కడ్డీలతో కాల్చిన మాంసం నోరూరిస్తుంటుంది. జాతర సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.