విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచన చేయండి… ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం వైఎస్‌ జగన్‌‌

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం లేఖ రాశారు. స్టీల్‌ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలన్నారు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచన చేయండి... ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం వైఎస్‌ జగన్‌‌
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 06, 2021 | 9:57 PM

YS Jagan Letter to PM Modi : విశాఖ భగ్గుమంది. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారన్న సమాచారంతో యావత్ ఆంధ్రప్రదేశ్ ఏకమైంది. ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు వారి వెంట నడుస్తామన్నారు. బీజేపీ మినహా ముఖ్య పార్టీలన్నీ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నారు. ఇవాళ రెండో రోజు విశాఖ తీరంలో ఉక్కు సంకల్పం కొనసాగింది.

ఇదిలావుంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం లేఖ రాశారు.’విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలన్నారు. ప్లాంటును బలోపేతం చేయడానికి మార్గాల్ని అన్వేషించాలన్నారు. విశాఖ ఉక్కు ద్వారా సుమారు 20వేలమంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారు. విశాఖ ఉక్కు – ఆంధ్రు హక్కు నినాద వేదికగా ప్రజల పోరాట ఫలితంగా స్టీల్‌ఫ్యాక్టరీ వచ్చింది. దశాబ్దం కాలంపాటు ప్రజలు పోరాటం చేశారు. నాటి ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 2002–2015 మధ్య వైజాగ్‌స్టీల్‌ మంచి పనితీరు కనపరిచింది. ప్లాంటు పరిధిలో 19,700 ఎకరాల విలువైన భూములున్నాయి.ఈ భూముల విలువే దాదాపు రూ.లక్ష కోట్లు ఉంటుంది. ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్లాంటుకు కష్టాలు వచ్చాయని సీఎం జగన్.. ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

విశాఖ స్టీల్‌ప్లాంటుకు సొంతంగా గనులు లేవని లేఖలో తెలిపిన సీఎం జగన్.. పెట్టుబడుల ఉపసంహరణకు బదులు అండగా నిలబడ్డం ద్వారా ప్లాంటును మళ్లీ ప్రగతిబాటలోకి తీసుకెళ్లవచ్చని సూచించారు. 7.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యం ఉన్నప్పటికీ 6.3 మిలియన్నులు మాత్రమే ఏడాదికి ఉత్పత్తి చేస్తున్నారని వెల్లడించారు. డిసెంబర్‌ 2020లో రూ.200 కోట్ల లాభం కూడా అర్జించిందన్న సీఎం జగన్ … వచ్చే రెండేళ్లలో ఇదే పరిస్థితి కొనసాగితే… ప్లాంటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అలాగే, బ్యాంకులనుంచి తెచ్చుకున్న రుణాల మొత్తాన్ని వాటా రూపంలోకి మార్చితే ఊరట కలుగుతుంది. వడ్డీరేట్లు కూడా తగ్గిస్తే ప్లాంటుపై భారం తగ్గుతుంది. స్టాక్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలను పరిశీలించాలి. దీనివల్ల ఆర్థిక పునర్‌నిర్మాణం జరుగుతుందని సీఎం లేఖలో తెలిపారు.

బైలడిల్లా గనుల నుంచి మార్కెట్‌ ఖరీదుకు ముడి ఖనిజాన్ని ప్లాంటు కొనుగోలు చేస్తోంది. దాదాపు టన్ను ముడి ఖనిజాన్ని రూ. 5,260 చొప్పున కొనుగోలు చేస్తోంది. దీనివల్ల వైజాగ్‌స్టీల్స్‌కు టన్నుకు అదనంగా రూ.3,472లు చొప్పున భారం పడుతోంది. సెయిల్‌కు సొంతంగా గనులు ఉన్నాయి. దాదాపు 200 ఏళ్లకు సరిపడా నిల్వలు సెయిల్‌కు ఉన్నాయి. వైజాగ్‌ స్టీల్స్‌కు సొంతంగా గనులు కేటాయించడం ద్వారా పోటీ పరిశ్రమలతో సమాన స్థాయికి తీసుకుపోవచ్చని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సెంటిమెంట్‌తో కూడుకున్న ఈ విశాఖ ప్రైవేటీకరణపై పునరాలోచన చేయాలని ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Cm Jagan LetterDO Lr No 6 – VIzag Steel Plant – Reconsideration

Read Also…  కృష్ణా నది జలాలపై తేలని పంచాయితీ.. ఏళ్లు గడుస్తున్నా కొలిక్కిరాని సమస్యలు.. పోస్ట్‌మెన్‌గా మారిన కేఆర్ఎంబీ..!