AP News: 3 గంటల పాటు బాబు, పవన్ భేటీ.. కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటు
సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశం ముగిసింది. సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో దాదాపు స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఇరు పార్టీల నేతలకు నచ్చజెప్పాక మంచి రోజు చూసుకుని స్థానాలను ప్రకటించే యోచనలో చంద్రబాబు, పవన్ ఉన్నట్టు తెలుస్తోంది.
ఏపీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చిన టీడీపీ, జనసేనలు.. అభ్యర్ధుల ఎంపికపై దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో రెండు పార్టీల అధినేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో ఇరుపార్టీలు..దాదాపు స్పష్టతకు వచ్చాయి.
ఇప్పటికే మూడుసార్లు సమావేశమైన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై విడతలవారీగా చర్చించారు. ఇక నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేసిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్.. ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపికపై విడివిడిగా కసరత్తు చేశారు. తాజాగా ఉండవల్లిలో భేటీ అయిన ఇద్దరు అధినేతలు..కీలక అంశాలపై చర్చించారు. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు..టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులకు ఇరు పార్టీల అధినేతలు సర్ది చెప్పనున్నారు.
మండపేట, అరకు స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే స్పష్టత నిచ్చిన చంద్రబాబు.. ఆయా స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులను కూడా ప్రకటించారు. దానికి పోటీగా..రాజానగరం, రాజోలు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు పవన్ కల్యాణ్. దీంతో మిగిలిన సీట్లపై స్పష్టత రావాల్సి ఉంది. కొందరు నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నేతలకు ఇప్పటికే చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. పొత్తులో సీటు సర్దుబాటు కాని నేతలకు..పార్టీ, ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే సిట్టింగ్ స్థానాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలకే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. దీంతో పట్టు, విడుపులకు సిద్ధంగా ఉన్నట్టు సిగ్నల్ ఇచ్చారు చంద్రబాబు.
అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస జాబితాలు ప్రకటిస్తుండటంతో టీడీపీ-జనసేన నేతలపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బీజేపీతో పొత్తు అంశం ఎటూ తేలకపోవడం వల్లే సీట్ల ప్రకటన ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది. తాను ఇప్పటికీ ఎన్డీఏలోనే ఉన్నానని పవన్ కల్యాణ్ చెబుతుండగా. .అటు బీజేపీ కూడా జనసేన తమ భాగస్వామ్య పార్టీ అని బీజేపీ చెబుతోంది. కానీ టీడీపీతో కలిసి పోటీ చేసే అంశంపై మాత్రం..బీజేపీ స్పష్టత నివ్వడం లేదు. ఒకవేళ బీజేపీ ఒంటరిపోరుకు దిగితే ఏం చేయాలన్నదానిపై కూడా టీడీపీ, జనసేన అధినేతలు చర్చించినట్టు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..