ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మూడు రాజధానుల వ్యవహారం రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారుతోంది. పరిపాలన రాజధానిగా వైజాగ్ ఏర్పాటు తథ్యమని అధికార పార్టీ నేతలు కుండబద్ధలు కొడుతున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మూడూ రాజధానులను ఏర్పాటు చేసి తీరుతామని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడామని తెగేసి చెబుతున్నారు. ఈ క్రమంలో అమరావతి రైతులు చేపడుతున్న పాదయాత్రపై ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మూడు రాజధానులతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) కు వచ్చిన ప్లాబ్లమ్ ఏమిటో తనకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశారన్న తమ్మినేని.. అభివృద్ధి అంతా ఒకే చోట జరగకూడదనే రాష్ట్రమంతటా అభివృద్ధి జరగాలనే కాంక్షతో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఉద్రిక్తతను రెచ్చగొట్టడానికే పాదయాత్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకే రాజధాని ఉండటంతో విభజన సమయంలో నష్టపోయాం. అన్ని రంగాల్లోనూ ఎంతో నష్టపోయాం. మరోసారి వేర్పాటువాదంతో రాష్ట్రం నష్టపోకూడదు. మూడు రాజధానులతోనే రాష్ట్రమంతటా అభివృద్ధి సాధ్యమవుతుంది. నాలుగేళ్ల పంట నష్టం ఎగ్గొట్టింది చంద్రబాబే. ఈ అంశంపై మాట్లాడే హక్కు స్పీకర్‌గా నాకుంది. గత ప్రభుత్వంలో పధకాలు కాగితాలకే పరిమితమయ్యాయి. కులమతాలకు అతీతంగా సీఎం జగన్ అన్ని వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పాలన చూడలేదు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు వైఎస్సార్ కల్యాణమస్తు ఎంతో భరోసా ఇస్తుంది.
– తమ్మినేని సీతారాం, ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి
మరోవైపు.. అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు చేపట్టిన రాజధాని రైతుల మహాపాదయాత్రకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. రాజకీయ నాయకులు వేల మందితో పాదయాత్ర చేయొచ్చు కానీ, 600 మంది రైతుల చేయకూడదా అని పోలీసులను ధర్మాసనం ప్రశ్నించింది. పరిమిత ఆంక్షలతో పాదయాత్ర కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. దరఖాస్తు పరిశీలించి అనుమతులు ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..