Andhra News: వాలీబాల్‌ కోర్ట్‌లో మొదలైన గొడవ.. ఇంటికొచ్చేసరికే..

ఈ మధ్య చిన్న చిన్న గొడవలే ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నాయి. కొందరు వ్యక్తులు క్షణికావేశంలో బంధాలు, బంధుత్వాలను మరిచి విచక్షణారహితంగా హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే పార్వతీపురం మన్యం జిల్లాలో వెలుగు చూసింది. చిన్నపాటి మనస్పర్ధలతో సమీప బంధువులే ఒక 19 ఏళ్ల యువకుడిని అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Andhra News: వాలీబాల్‌ కోర్ట్‌లో మొదలైన గొడవ.. ఇంటికొచ్చేసరికే..
Andhra Crime

Edited By: Anand T

Updated on: Aug 31, 2025 | 9:39 PM

రోజురోజుకూ మానవసంబంధాలు మంటగలుస్తున్నాయి. క్షణికావేశంలో కొందరు వ్యక్తులు బంధాలు, బంధుత్వాలను మరిచి విచక్షణారహితంగా హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే పార్వతీపురం మన్యం జిల్లాలో వెలుగు చూసింది. చిన్నపాటి మనస్పర్ధలతో సమీప బంధువులే ఒక 19 ఏళ్ల యువకుడిని అతి కిరాతకంగా హత్య చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మక్కువ మండలం లోవరకండి అనే గ్రామంలో సాగరపు ఆదినారాయణ సాగరపు దమయంతి సమీప బంధువులు. ప్రక్కప్రక్క ఇళ్ళలోనే నివాసం ఉంటున్నారు. సాగరపు శివందొర అలియాస్ ఆదినారాయణ పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య హేమలతతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ ప్రక్క ఇంట్లోనే సాగరపు దాళందొర, అతని భార్య దమయంతి తన ఇద్దరు కుమారులు వెంకటరమణ, కార్తీక్‌లతో నివసిస్తున్నారు.

శివందొర తన ఇంటి దగ్గర మొక్కలు, బీరకాయ పందిళ్లు పెంచుకుంటుండగా వాటిలోకి దమయంతికి చెందిన ఆవులు వస్తున్నాయన్న కారణంగా గత కొన్ని రోజులుగా ఇరు కుటుంబాల మధ్య తరుచూ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 28న దమయంతి మేనళ్లుళ్లు కిషోర్, మహేష్‌లు వినాయకచవితి సందర్భంగా జగన్నాథపురం నుంచి లోవరకండికి వచ్చారు. పండుగ కావడంతో దమయంతి కుమారుడు కార్తీక్ వారి ఇంటికి వచ్చిన బంధువులతో కలిసి గ్రామశివారుకెళ్లి వాలీబాల్ ఆడుతున్నారు. ఆ సమయంలోనే శివందొర కూడా అక్కడకు వెళ్లి నేను కూడా మీతో ఆడుతానని.. బెట్టింగ్ పెట్టుకొని ఆడదాం అని అడిగాడు. అందుకు కార్తీక్ అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని పెనుగులాటకు దారితీసింది. దీంతో శివందొరకు స్వల్పగాయాలయ్యాయి.

అయితే విషయం తెలుసుకున్న శివందొర భార్య హేమలత ప్రక్క ఇంటిలో ఉన్న దమయంతిపై దుర్భాషలు ఆడుతూ గొడవకు దిగింది. అలా దమయంతి, హేమలత మధ్య గొడవ మరింత ముదరడంతో స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడికి వచ్చిన కార్తీక్ వారి ఇద్దరి మధ్య నిలబడి గొడవను ఆపమని కోరాడు. దీంతో శివందొర పట్టరాని కోపంతో మహిళల మధ్య గొడవలో నీకేం పని అంటూ తన వద్ద ఉన్న ఆయుధంతో ఒక్కసారిగా కార్తీక్ పై దాడి చేశాడు. ఆ దాడిలో కార్తీక్‌కి తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో కార్తిక్ కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ కార్తిక్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. కార్తీక్ మృతితో దమయంతి కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. చిన్నపాటి మనస్పర్ధలకే యువకుడి హత్యకు దారి తీయడం జిల్లాలో సంచలనంగా మారింది.

మరిన్ని అంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.