Andhra: న్యాయం చెప్పే జడ్జి మాత్రమే కాదు.. సాయం చేసే మంచి మనిషి కూడా..
ప్రమాదంలో గాయపడిన గోవు.. నడవలేకపోతున్న స్థితిని చూసి ఆ న్యాయమూర్తి చలించిపోయారు. వెంటనే దానికి చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. అంతేనా ఏ రోజుకు ఆ రోజు దాని ఆరోగ్య పరిస్థితి వాకబు చేయడమే కాకుండా.. ఏకంగా వెటర్నరీ ఆస్పత్రికి వెళ్లి దాని పరిస్థితిని తెలుసుకున్నారు. ఇంతకీ ఎవరా న్యాయమూర్తి.

ఆయన హైకోర్టు న్యాయమూర్తి… పేరు రామకృష్ణ ప్రసాద్… ఈ నెల పద్నాలుగో తేదిన కుటుంబ సమేతంగా కారులో గుంటూరు వస్తున్నారు. ఆ సమయంలో ఏటూకూరు వద్ద ఒక గోవు రోడ్డు ప్రమాదానికి గురై గాయాలతో బాధపడుతూ కనిపించింది. కారులో ప్రయాణిస్తున్న రామకృష్ణ ప్రసాద్ వెంటనే కారును ఆపి గోవు వద్దకు వెళ్లారు. గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఆవు ఎడమకాలు పూర్తిగా విరిగిపోయింది. వెంటనే ఆయన ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌ను అప్రమత్తం చేశారు. ఆవును చికిత్న నిమిత్తం గుంటూరు వెటర్నరీ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో కానిస్టేబుల్స్ హుటాహుటిన ఆవును గుంటూరులోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పశువైద్యులకు ఈ సమాచారం తెలియడంతో అప్రమత్తమయ్యారు. ఆవుకు వైద్యం అందించారు. అయితే న్యాయమూర్తి తన పని అయిపోయిందని వెళ్లిపోలేదు. ఆసుపత్రిలో ఆవుకు ఏ విధంగా చికిత్స అందుతుందో చూసేందుకు ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రి వైద్యులతో ఆవు పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
పశుసంవర్ఢక శాఖ జిల్లా అధికారి నరసింహరావు ఆధ్వర్యంలో ప్రముఖ సర్జన్ నాగేశ్వరావు ఆవు కాలుకు ఆపరేషన్ చేసి కృతిమ కాలు ఏర్పాటు చేసి అది కోలుకునేలా చికిత్స చేశారు. ఈ విషయం తెలుసుకున్న జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ ఆవుకు అందుతున్న వైద్యాన్ని పరిశీలించడమే కాకుండా ఆవు వద్దకు వెళ్లి ప్రత్యక్షంగా చూసి వెళ్లారు. ఆ తర్వాత ఆదివారం మరోసారి ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆవు ఇన్ పేషెంట్ వార్డులో చికిత్స పొందుతుంది. ఆవు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఆవు వద్దకు వెళ్లి అరటి పండ్లు తినిపించి వెళ్లారు. న్యాయమూర్తి అంతలా ఆవు పట్ల ప్రేమను ప్రదర్శించడంతో వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ప్రయాణీకులు గాయపడితే వెంటనే స్పందించి ఆసుపత్రులకు తరలిస్తున్న రాజకీయ నేతల్ని చూస్తున్నాం. అయితే ఆవు గాయపడిన అంతే బాధ్యతగా స్పందించి వెంటనే ఆసుపత్రిక తరలించడమే కాకుండా వైద్యం అందుతున్న తీరుగా ప్రత్యక్షంగా పరిశీలించిన జస్టిస్ పట్ల పలువురు అభినందనలు కురిపిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
