Macharala: గుడి వద్ద ఓ ముక్క.. పక్కన పొలంలో మరో ముక్క.. మాములు రాయి అనుకుంటే పొరపాటే..
శాసనాలు చరిత్రకు ఆధారాలు. నాటి పాలనకు తార్కాణాలు. పురాతన గుళ్లను పునర్నిర్మాణం చేస్తుండగా లేదా ఏదైనా ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా.. నిధి, నిక్షేపాలు, శాసనాలు బయటపడిన దాఖలాలు ఉన్నాయి. ఒక శాసనం బయపడితే అప్పటి చారిత్ర విశేషాలు విస్పష్టంగా అర్థమవుతాయి. దీనితో పరిశోధన చేయడం వీలవుతుంది. తాజాగా మాచర్ల జిల్లాలో మరొక అరుదైన శాసనం వెలుగు చూసింది.

మాచర్లలో రుద్రమ దేవి కాలం నాటి శాసనం వెలుగు చూసింది. అయితే రాతిపై చెక్కిన ఈ శాసనం రెండు ముక్కలైంది. ఒక ముక్క చింతల రామలింగేశ్వర స్వామి గేటు వద్ద ఉండగా మరొక ముక్క పొలం గట్టు వెంట పడి ఉంది. అయితే ఈ రెండు ముక్కలు ఒకే శాసనమని వాటిని పరిశోధించిన చరిత్రకారుడు పావులూరి సతీష్ బాబు చెప్పారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆలయ సిబ్బందిపై ఉందని తెలిపారు.
ఈ శాసనంలో శాలివాహన శకం 1210 సర్వధారి వైశాఖ శు 15న ఏర్పాటు చేసినట్లు ఉంది. క్రీశ 1288 ఏప్రియల్ 18 న చెక్కిన ఈ శాసనంలో కాకతీయ రుద్రదేవ మహరాజు అనగా.. రుద్రమదేవి సేవకుడు బొల్నాయిని కుమారుడైన మల్లిఖార్జున నాయకుడు… పల్లినాటిలోని అంటే పల్నాడులోని… మహాదేవచెర్ల అనగా… ఈనాటి మాచర్లలోని రామనాథ దేవర అంగరంగ భోగాలకు… శ్రీ పర్వత మలినాథదేవర సాక్షిగా మెట్ట, మాగాణి భూములను దానం ఇచ్చినట్లుగా ఉంది. ఈ శాసనం నకలను 1942లో పురావస్తు శాఖాధికారులు సేకరించారని సతీష్ బాబు చెప్పారు. ఆ తర్వాత కాలంలో ఈ శాసనాన్ని పరిరక్షించడంలో విఫలమవ్వడంతో రెండు ముక్కలైందని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ఈ శాసనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.
రెండు ముక్కలను ఆలయంలోకి చేర్చి అక్కడ ఒక పీఠికపై ఏర్పాటు చేస్తే ఆలయ చరిత్ర భవిష్యత్తు తరాలకు అందించిన వారమవుతామన్నారు. పల్నాడులో అనేక చారిత్రిక ఆనవాళ్లు కనుమరుగై పోతున్నాయని ఇప్పటికైనా స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు స్పందించి వాటిని కాపాడుకోవాలని సూచించారు. సతీష్ బాబుతో పాటు ఉప్పుతోళ్ల రమేష్, ఓరుగంటి చెన్నకేశవరావులు శాసనాన్ని పరిశీలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
