ఈ పాపం ఎవరిదీ.. ప్రభుత్వానిదా..? ప్రజలదా..?

గోదావరి బోటు ప్రమాదం ఎన్నో జీవితాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ప్రభుత్వ అధికారుల్లో చలనం లేదు. పాపికొండలు ప్రమాదానికి కారకులెవరు..? అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది..? అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా..? అవగాహన లేని డ్రైవర్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు..? ప్రమాదానికి ఏ శాఖది బాధ్యత..? ఎవర్ని శిక్షించాలి..? దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది..? మిస్సైన వారి మృతదేహాలను ఎలా బయటకు తీస్తారు..? ప్రమాదం జరిగి […]

ఈ పాపం ఎవరిదీ.. ప్రభుత్వానిదా..? ప్రజలదా..?

గోదావరి బోటు ప్రమాదం ఎన్నో జీవితాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ప్రభుత్వ అధికారుల్లో చలనం లేదు. పాపికొండలు ప్రమాదానికి కారకులెవరు..? అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది..? అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా..? అవగాహన లేని డ్రైవర్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు..? ప్రమాదానికి ఏ శాఖది బాధ్యత..? ఎవర్ని శిక్షించాలి..? దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది..? మిస్సైన వారి మృతదేహాలను ఎలా బయటకు తీస్తారు..? ప్రమాదం జరిగి 24 గంటలవుతోంది దీనిపై ప్రభుత్వం ఏం చేయబోతోంది..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాదు ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే స్పందించి.. బాధితులకు నష్టపరిహారం అందించి చేతులు దులుపుకోవడం ప్రభుత్వాలకు అలవాటైపోయింది.

గోదావరిలో ఘోర ప్రమాదం జరిగింది. గోదారి అలలను పలకరిస్తూ.. ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తూ.. పాపికొండలు టూర్ వెళుతున్నారు. పడవలో ఆటలు, పాటలు.. ఒకటే సందడి ఇంతలోనే ఏమైందో తెలియదు ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు బోటు ఊగిపోయింది. ఏం జరిగిందో అర్థమయ్యే లోపే పైకి కిందికి కదిలిపోతూ బోటు మునిగిపోయింది. అయితే, ప్రమాద సమయంలో మొత్తం 61 మంది పర్యాటకులు ఉన్నారు. 26 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కాగా మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన వారే ఉన్నారు. గల్లంతైన వారి కోసం రెండు ఎన్డీఆర్ఎఫ్, మూడు ఎస్డీఆర్ఎఫ్, 6 అగ్నిమాపక, 2 నేవీ గజఈతగాళ్ళ బృందాలు, రెండు నేవీ హెలికాప్టర్లు, ఒక ఓఎన్జీసీ హెలికాపర్‌తో గాలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

1964లో ఇదే ప్రదేశంలో ఉదయ్ భాస్కర్ అనే పడవ మునిగి 60 మంది మృతి చెందారు. ఆ తర్వాత ఝాన్సీ రాణి అనే పడవ మునిగి 8 మంది మృతి చెందారు. ఇక సరిగ్గా ఏడాది క్రితం కూడా ఇలాగే ప్రమాదం జరిగింది. అప్పుడు 22 నిండు ప్రాణాలు బలయ్యాయి. ఆ ప్రమాదం ఇంకా కళ్ల ముందు కదులుతూనే ఉంది. అంతలోనే మరో ఘోర ప్రమాదం జరిగింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టెక్నీలజీనీ డెవలప్ చేయలేదు. అసలు ఏ రూటులో వెళ్లాలో కూడా రూట్ మాప్ లేదు. అనుభవం లేని డ్రైవర్లకు అనుమతి ఇచ్చారు. అయితే బోటు 315 అడుగుల లోతులో మునిపోయిందని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తెలిపాయి. కాగా, ఎంత ప్రయత్నించినా 60 అడుగుల వరకు మాత్రమే వెళ్లే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్ నుంచి కూడా ఒక ప్రత్యేక బృందం వచ్చిందని, సైడ్ స్కాన్ సోనార్, ఇతర ఆధునాతన పరికరాలతో ఈ బృందం చర్యలు చేపట్టిందని చెబుతున్నారు. మరి మిసైన మృతదేహాలను వీరు వెలికి తీయగలుగుతారా..? క్రేన్‌లు తీసుకువచ్చినా ఎలా తెస్తారు. సేఫ్టీ ప్రికాషన్స్ కూడా లేవు. అసలు అనుభవం లేని ప్రైవేట్ డ్రైవర్లకు అనుమతి ఇచ్చారు. అంతేకాదు అనుమతులు లేనప్పుడు చెక్ పోస్టుల వద్ద అధికారులు ఎలా అనుమతి ఇస్తున్నారు అనేది ప్రశ్నగా మారింది. దీనిబట్టి టూరిజం శాఖ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అనేది కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది.

ఈ ప్రమాదం పై సీఎం వైఎస్ జగన్ దిగ్భాంతిని వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి యుద్ధప్రాతిపదికన రక్షణ, సహాయక చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు ఈ దుర్ఘటనపై తనకు నివేదిక ఇవ్వాలని, తక్షణమే అన్ని బోటు సర్వీసులను రద్దు చేయాలని ఆదేశించారు. అన్ని బోట్ల లైసెన్సులను తనిఖీ చేయాలని, ఆయా బోట్లలో పనిచేస్తున్న సిబ్బందికి తగిన నైపుణ్యం ఉందా లేదా అనే విషయాలన్నీ పరిశీలించి తనకు నివేదిక సమర్పించాలని అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరి రూ.10 లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. అయితే నష్టపరిహారం చెల్లిస్తే.. చనిపోయిన వారు తిరిగి వస్తారా..? ఎన్ని ప్రమాదాలు జరిగినా పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటే సరిపోతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అమాయకులైన పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడానికి అధికారుల అలసత్వం, పర్యాటక శాఖ నిర్లక్ష్యమే కారణం అని తెలుస్తోంది. లైఫ్ జాకెట్లు ధరించకపోవడం, సామర్థ్యానికి మించి ఎక్కువ మందిని ఎక్కించుకోవడమే ప్రయాణికుల ప్రాణాలు తీసింది. అంతేకాదు బోటు డ్రైవర్‌ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ప్రమాదం నుంచి బయటపడినవాళ్లు చెబుతున్నారు. తాము పదేపదే లైఫ్‌ జాకెట్లు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని అంటున్నారు. కాగా, ప్రమాదం జరిగే సమయంలో.. బోటు దిగువ అంతస్థులోని ఏసీ గదుల్లో కొంతమంది పర్యాటకులు ఉన్నారు. బోటును వెలికితీస్తే వారి అచూకీ తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రమాదం జరిగి 24 గంటలు పూర్తవుతోంది. వెలికితీయాల్సినవారు 40 మందికి పైగా ఉన్నారు. వారిని ఎలా బయటకు తీస్తారు. అయితే వారు బతికే ఉన్నారా..? చనిపోయి ఉన్నారా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఒకవేళ మృతదేహాలను బయటికి తీసినా వారి వివరాలు ఎలా గుర్తిస్తారు. అసలు 315 అడుగుల లోతులో అంటే చనిపోయి శవాలై ఉన్నా.. జంతువులు తినేసే అవకాశం ఉంది. కుళ్లిపోయి కూడా ఉండొచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో పడవ ప్రమాదాలు జరుగుతున్నా మనలో కానీ, ప్రభుత్వంలో కానీ కదలిక రావడం లేదు ఎన్ని ప్రమాదాలు జరిగినా అప్పటికప్పుడు కంగారుపడటం బాధపడటం తప్ప ప్రమాదమే జరగకుండా చేపట్టాల్సిన చర్యలను మాత్రం అందరం నిర్లక్ష్యం చేస్తున్నాం. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే గోదావరి నదిలో పడవ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఇక ముందైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా..? లేక తూతూమంత్రగా ఈ నాలుగు రోజులపాటు హడావుడి చేసి చేతులు దులుపుకుంటుందా చూడాలి మరి.

Click on your DTH Provider to Add TV9 Telugu