విజయవాడ, సెప్టెంబర్ 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన విదేశీ పర్యటనను ముగించుకుని గన్నవరం ఎయిర్‌పోర్ట్ ద్వారా స్వరాష్ట్రానికి చేరుకున్నారు. సెప్టెంబర్ 2న తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఆయన.. ఆ తర్వాత తన పిల్లలకు కలిసేందుకు లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనను ముగించుకుని మంగళవారం ఉదయం 6 గంటలకు సీఎం జగన్ ప్రత్యేక విమానం గన్నవరం విమనాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. విదేశీ పర్యటనను ముగించుకుని ఏపీకి తిరిగొస్తున్న సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఈ మేరకు ఏపీ మంత్రులు జోగి రమేష్, విశ్వరూప్, ఎమ్మెల్యేలు వంశీ, విష్ణు, పార్థసారథి, కైలే అనిల్, వెల్లంపల్లి శ్రీనివాస్.. అలాగే మంత్రి నందిగామ సురేష్, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహార్ రెడ్డి తదితరులు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు.
అలా విజయవాడ చేరుకున్న సీఎం జగన్ గన్నవరం నుంచి రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. విదేశీ పర్యటన ముగిసిన వెంటనే సీఎం వైయస్ జగన్ రేపు ఢిల్లీ పర్యటకు వెళ్లనున్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెడతారని ప్రచారం, చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో హై-టెన్షన్ నెలకొన్న ఈ తరుణంలో సిఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహాగానాలు చెలరేగుతున్న వేళ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. లండన్ పర్యటనను ముగించుకొని వచ్చిన వెంటనే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..