Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada TDP : ఓడిన టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి-బుద్ధా ఫోన్ వాయిస్ లీక్, బెజవాడలో మునిగిపోతోన్న నావలా టీడీపీ.!

Vijayawada TDP : విజయవాడలో టీడీపీ పరిస్థితి మునిగిపోతోన్న నావలా తయారయ్యింది. గ్రూపు తగాదాలు, సామాజికవర్గ నినాదాలతో టీడీపీలో ..

Vijayawada TDP : ఓడిన టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి-బుద్ధా ఫోన్ వాయిస్ లీక్,  బెజవాడలో మునిగిపోతోన్న నావలా టీడీపీ.!
Vijayawada Politics
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 18, 2021 | 5:28 PM

Vijayawada TDP : విజయవాడలో టీడీపీ పరిస్థితి మునిగిపోతోన్న నావలా తయారయ్యింది. గ్రూపు తగాదాలు, సామాజికవర్గ నినాదాలతో టీడీపీలో అలజడి కొనసాగుతుంది. కేశినేని నాని వర్సెస్ మిగిలిన నాయకులుగా తయారయ్యింది టీడీపీ పరిస్థితి. నిన్న మొన్నటి వరకు టీడీపీ కంచుకోటగా భావించిన విజయవాడ నగరం ఇప్పటికే వైసీపీ చేతిలోకి వెళ్ళింది. పరిణామాలు ఇదే తరహాలో కొనసాగితే ఇక పార్టీ తిరిగి పుంజుకోవడం కష్టంగా కనిపిస్తుంది. కేవలం చంద్రబాబు జోక్యం చేసుకుంటే తప్ప, టీడీపీలో పరిస్థితి మెరుగు పడేలా లేదని సగటు నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీకి విజయవాడ చాలా ప్రతిష్టాత్మకం అనే చెప్పాలి. కేవలం విజయవాడ తమ ఆధీనంలో ఉంటుందనే అక్కడ రాజధాని పెడుతున్నారని గతంలో ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. కానీ ఇప్పుడు విజయవాడలో టీడీపీ పరిస్థితి దయనీయంగా తయారయ్యింది. గ్రూపు తగాదాలు, కుల నినాదాలతో కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం చతికల పడింది తెలుగుదేశం. ఏకంగా పార్టీ అధినాయకుడు ప్రచారం చేసినా అనేక కారణాలతో టీడీపీ విజయవాడ పీఠాన్ని కోల్పోయింది.

పర్లేదు కలిసి పనిచేస్తున్నారు.. అని అనుకునే లోపే టీడీపీ లో వర్గపోరు ఒక్కసారిగా మళ్లీ బయటపడింది. కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు పై నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరుకున్నారు టీడీపీ నాయకులు. కేశినేని నానికి వ్యతిరేకంగా బోండా ఉమ, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా లాంటి నాయకులు బహిరంగ విమర్శలకు దిగారు. టీడీపీ చాలా డిసిప్లైన్డ్ పార్టీ అని ఒకపక్క చెపుతూనే మరోపక్క బహిరంగ విమర్శలతో పార్టీ ప్రతిష్టను దిగజార్చడంలో అందరు భాగస్వామ్యులు అయ్యారు. అనేక మంది ఎమ్మెల్యేలు ఓడిపోయినా తాను ఎంపీగా గెలిచాను అని ఎంపీ కేశినేని నాని ఎన్నికల ప్రచార సమయంలో అన్నారు. అయితే పార్టీలో అందరూ ఈ విషయాన్నీ గుర్తు పెట్టుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే కేశినేని నాని పై బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

కేశినేని శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రచారం చేసుకున్నప్పుడు వివాదం మరింత ముదిరింది. ఒకే ఇంట్లో రెండు పదవులా..? అంటూ మరోసారి మరో వర్గం పెదవి విరిచింది. అంతే కాదు సిటీలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు కాగా, మేయర్ కూడా కమ్మ సామాజికవర్గానికి ఇస్తారా అంటూ నేతలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఈ వర్గపోరుతోనే ఎన్నికలు ఓడిపోతాం అని గ్రహించిన టీడీపీ అధిష్టానం వెంటనే రంగంలోకి దిగి తగిన హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కేశినేని శ్వేత విజయం కోసం కృషి చేస్తాం అని బోండా ఉమా, బుద్ధా వెంకన్న ప్రకటించారు.

కానీ ఎన్నికల ఫలితాలతో కథ అడ్డం తిరిగింది. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియా వేదికగా తెలుగు తమ్ముళ్లు ఒకరిని ఒకరు ఆడిపోసుకుంటున్నారు. కేశినేని నాని వర్గం వారు సోషల్ మీడియాలో టీడీపీ ఓటమికి బోండా ఉమా, బుద్దా వెంకన్న కారణం అనేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టగా, దానికి కౌంటరుగా బోండా, బుద్ధా వర్గీయులు కేశినేని నానిపై మండిపడుతున్నారు. ఇదే కాకుండా ఓడిన ఒక టీడీపీ కార్పోరేటర్ అభ్యర్థి, బుద్ధా వెంకన్న మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీక్ అయ్యింది. ఇలా సోషల్ మీడియాలో అనుచరుల ఫైట్ స్టార్ట్ అయ్యింది.

బెజవాడలోని టీడీపీ నేతలందరూ కలిసి వారి ప్రత్యర్థుల పై పోరాటం చేసేందుకు సమయం దొరకట్లేదు. ఎందుకంటే ఉన్న సమయం అంతా సొంత పార్టీలోని వేరే వర్గం నాయకులను విమర్శించేందుకు సరిపోతుంది. ఇలానే పరిస్థితి కొనసాగితే టీడీపీ ఈ ప్రాంతాల్లో పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు.