ముందు జిల్లాలా..? ఎన్నికలా..?.. డైలామాలో ఏపీ ప్రభుత్వం

| Edited By: Srinu

Jun 06, 2019 | 4:21 PM

ఏపీలో పంచాయితీ ఎన్నికల గడువు ముగిసి దాదాపు పది నెలలైంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆలోచించి, వాటిని వాయిదా వేసింది. మరోవైపు ఏపీలో కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం మొదట పంచాయతీ ఎన్నికలు.. ఆ తర్వాత మండలపరిషత్‌, జిల్లా పరిషత్‌.. అనంతరం మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ అధికారులు ఇప్పటికే పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించి ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. అయితే […]

ముందు జిల్లాలా..? ఎన్నికలా..?.. డైలామాలో ఏపీ ప్రభుత్వం
Follow us on

ఏపీలో పంచాయితీ ఎన్నికల గడువు ముగిసి దాదాపు పది నెలలైంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆలోచించి, వాటిని వాయిదా వేసింది. మరోవైపు ఏపీలో కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం మొదట పంచాయతీ ఎన్నికలు.. ఆ తర్వాత మండలపరిషత్‌, జిల్లా పరిషత్‌.. అనంతరం మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ అధికారులు ఇప్పటికే పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించి ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. అయితే పంచాయితీ ఎన్నికలు నిర్వహించే విషయంలో ఏ ఇబ్బందులు లేవు గానీ.. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వం డైలామాలో ఉంది.

అదేంటంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాను చేస్తామని వైసీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దాని ప్రకారం మరో 12 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే వాటి ఏర్పాటుకు ముందే జిల్లాపరిషత్‌ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే జిల్లాల ఏర్పాటు పూర్తికాకుండా పరిషత్‌ ఎన్నికలు నిర్వహిస్తే పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇదే పరిస్థితి గతంలో తెలంగాణలో ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ప్రకారం స్థానిక పాలన జరగాలంటే పరిషత్‌ ఎన్నికలు వాయిదా వేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ రోజున మొదలుపెట్టినా.. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు ఆరు నెలల సమయం పడుతుంది. దీనివల్ల ఎన్నికలు మరింత ఆలస్యమవుతాయని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేసుకోవడమా లేక జిల్లాల ఆలోచన ప్రస్తుతానికి విరమించుకోవడమా అనేది కొత్త ప్రభుత్వం తేల్చుకోవాల్సి ఉంటుంది.