అమరావతి రైతుల పాదయాత్ర అడ్డంకులు.. నిరసనల మధ్య సాగుతోంది. వారి పాదయాత్రకు దీటుగా విశాఖ గర్జన పేరుతో జేఏసీ మీటింగ్ సక్సెస్‌తో ఆ కష్టాలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఓ వైపు వైసీపీ నేతల గర్జన, మరోవైపు పోలీసు ఆంక్షల మధ్య పాదయాత్ర అతికష్టంగా సాగుతోంది. ఇప్పటికే 35 రోజులుగా సాగుతున్న యాత్ర.. రేపు రాజమండ్రిలోకి అడుగుపెట్టబోతోంది. రాజమండ్రి రైల్‌కమ్ రోడ్ బ్రిడ్జిపై యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పాదయాత్ర చేసి తీరుతామంటున్నారు రైతులు. ధర్నాలైనా.. నిరసనలైనా.. తమ బలాన్ని నిరూపించుకునేందుకు పార్టీలు రాజమండ్రి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిని ఎంచుకుంటాయి. తమకు ప్రజల్లో ఉన్న ఆదరణ చూపేందుకు తహతహలాడుతుంటాయి. అదో సెంటిమెంట్‌గానూ ఫీల్ అవుతుంటాయ్. అమరావతి రైతులు కూడా తమ బలాన్ని చూపాలని ప్లాన్ చేశారు. కానీ వారి వ్యూహాలకు పోలీసులు అడ్డుకట్టవేశారు. రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి పై యాత్రకు అనుమతి నిరాకరించారు. మరమ్మతుల పేరుతో వారంపాటు రాకపోకలు నిలిపివేశారు. దీంతో యాత్ర కొనసాగింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
2003 మే 23న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా బ్రిడ్జిపై పాదయాత్ర చేశారు. లక్షలాదిగా జనం నుంచి వస్తున్న ఆదరణను అధికారపక్షానికి చెప్పకనే చెప్పారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో 2018 జూన్ 12న ప్రస్తుత సీఎం జగన్ సైతం ఇదే బ్రిడ్జిపై పాదయాత్ర చేశారు. ఆయన యాత్రకు వైఎస్‌కు మించిన ఆదరణ లభించింది. అదే అధికారంలోకి రావడానికి కారణమైనట్లు స్థానికులు చెబుతుంటారు. అయితే ఆ సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు వారి పాదయాత్రలకు ఎక్కడా అవాంతరాలు సృష్టించలేదు. ప్రభుత్వ అనుమతితో గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. నాడులేని.. ఆంక్షలు నేడు ఎందుకంటున్నాయి విపక్షాలు. పాదయాత్రతో సీఎంగా గెలిచిన జగన్.. అమరావతి రైతులపై కక్షసాధిస్తున్నారని మండిపడ్డాయి. గతంలో పవన్ యాత్రకు కూడా అనుమతి నిరాకరించిన విషయాన్ని గుర్తుచేశారు టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి. ఇలాంటి కుట్రలకు భయపడేది లేదని తేల్చిచెబుతున్నారు.
మొత్తంగా రేపు జరగబోయే అమరావతి రైతుల పాదయాత్ర ఏపీలో హాట్‌టాపిక్‌గా మారింది. షెడ్యూల్ ప్రకారం కొవ్వూరు మీదుగా రాజమండ్రి బ్రిడ్జి పై నుంచి రాజమండ్రి చేరుకోవాల్సి ఉంది. రైతుల పాదయాత్రకు ప్రభుత్వం ఊహించిని ట్విస్ట్ ఇవ్వడంతో.. రాజధాని అంశం రసవత్తరంగా మారింది. బ్రిడ్జిపై రాకపోకల నిలిపివేతలో దురుద్దేశం లేదంటోంది సర్కారు. 30 కోట్ల నిధులతో మరమ్మతుల కోసమే అనుమతివ్వలేదంటున్నారు వైసీపీ నేతలు. ఈ అంశంపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. యాత్రకు ప్రత్యామ్నాయ మార్గం చూపినట్లు చెప్పారు. మొత్తంగా రేపటి అమరావతి రైతుల పాదయాత్ర ఎటు నుంచి సాగుతుంది? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది మాత్రం ఉత్కంఠగా మారింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..