ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని.. మూడు రాజధానులు వద్దు, అమరావతి మాత్రమే ముద్దు అంటూ అమరావతి రైతులు ఉద్యమం మొదలు పెట్టారు. అమరావతి రైతుల ఉద్యమం 1200 రోజులు పూర్తి అవ్వటంతో శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి చేరుకున్నారు అమరావతి రైతులు. గతంలో అమరావతి రైతులు చేపట్టిన అమరావతి టు అరసవిల్లి పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం వరకు వచ్చి అక్టోబర్ 23 తో ఆగిపోయింది. అయితే తర్వాత కూడా పాదయాత్రను కొనసాగించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఎలాగైనా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించాలని అమరావతి రైతులు భావించారు. దీంతో శనివారం నేరుగా అమరావతి నుంచి బయలుదేరి బస్సులు, కారులలో అరసవల్లికి చేరుకున్నారు.
శనివారం అర్ధరాత్రి వరకు రైతులు వస్తూ ఉన్నారు. ఇలా వచ్చిన అమరావతి రైతులకు స్థానిక టిడిపి నాయకులు అరసవల్లి లోని పలు ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ లో రాత్రికి బస ఏర్పాటు చేశారు. శనివారం అర్ధరాత్రి బస్సులలో అరసవిల్లికి చేరుకున్న అమరావతి రైతులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రైతులతో పాటు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథం కూడా అరసవల్లికి చేరుకుంది. ఆదివారం ఉదయం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు అమరావతి రైతులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..