Kesineni Nani: వ్యవసాయ ఎగుమతులకు కేంద్రంగా బెజవాడ.. సౌకర్యాలు కల్పించండి.. లోక్‌సభలో ఎంపీ కేశినేని నాని
MP Kesineni Nani comments In Lok Sabha: బెజవాడ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కేంద్రంగా మారిందని.. వీటికోసం అంతర్జాతీయ విమానాశ్రయంలో సదుపాయాలు కల్పించాలని
MP Kesineni Nani comments In Lok Sabha: బెజవాడ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కేంద్రంగా మారిందని.. వీటికోసం అంతర్జాతీయ విమానాశ్రయంలో సదుపాయాలు కల్పించాలని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి సదుపాయాలను పెంచితే రైతులకు లాభం చేకూరుతుందని నాని పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి సదుపాయాలపై లోక్‌సభ జీరో అవర్లో ఎంపీ కేశినేని నాని ప్రస్తావించారు. ఈ మేరకు కేశినేని నాని మాట్లాడుతూ.. దక్షిణ భారత దేశంలో రెండు ప్రధాన నదులైన గోదావరి, కృష్ణా ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహిస్తున్నాయని తెలిపారు. ఈ నదుల కారణంగా పరీవాహక ప్రాంతంలో సారవంతమైన భూముల్లో వ్యవసాయ ఉత్పత్తుల సామర్థ్యం కొన్ని శతాబ్దాలుగా పెరుగుతోందన్నారు. దీంతో విజయవాడ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కేంద్రంగా మారిందన్నారు. గుంటూరు మిర్చి, నూజివీడు మామిడి, పసుపు, పొగాకు, ఈ మధ్య మంచినీటి మత్స్య సంపద కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యం మరింత పెరిగిందని తెలిపారు.
ఈ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు మరింత సదుపాయాలు కల్పించేలా ‘అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (అపెడా)’ చర్యలు చేపట్టాలని కోరారు. వారణాసి విమానాశ్రయం తరహాలో విజయవాడ విమానాశ్రయంలో కోల్డ్ స్టోరేజి, కస్టమ్స్ క్లియరెన్స్, ఫైటోశానిటరీ క్లియరెన్స్ వంటి సదుపాయాలు కల్పించాలని కేంద్రాన్ని కోరారు. గతంతో పోలిస్తే.. ఇటీవల ఏపీలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరిగాయన్నారు. 2020-21లో అత్యధికంగా పరిమాణంలో 52 లక్షల మెట్రిక్ టన్నులు, విలువలో రూ. 13,700 కోట్ల మేర ఎగుమతులు జరిగాయన్నారు.
అయితే విజయవాడ ప్రాంత వ్యవసాయ ఉత్పత్తులను సమీపంలోని ఏదైనా పోర్టు లేదా విశాఖపట్నం ఎయిర్‌పోర్టు ద్వారా ఎగుమతి చేయాల్సి వస్తోందని వివరించారు. ఈ పరిస్థితుల్లో విజయవాడ ఎయిర్‌పోర్టులో తగిన సదుపాయాలు కల్పిస్తే వ్యవసాయ ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాకుండా వేగవంతంగా వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి చేరుకోడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని.. దీనికనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రైతులకు మేలు జరుగుతుందని కేశినేని నాని తెలిపారు.
Also Read: