
విశాఖపట్నం, ఆగస్ట్ 29: స్కూల్లో పిల్లలు ఓ పట్టాన మాట వినరన్న సంగతి తెలిసిందే. అయితే వీరికి పాఠాలు చెప్పే టీచర్లు నయానో.. భయానో.. దారికి తీసుకువస్తారు. కొందరు మొండి పిల్లలు బెత్తం పట్టందే లొంగరు. పిల్లలు మరీ మొండికేస్తే.. టీచర్లు చిన్నపాటి శిక్షలు కూడా విధిస్తారు. ఇదంతా షరా మామూలే. అయితే ఓ టీచర్ మాత్రం.. ఓ విద్యార్ధి మాట వినలేట్లేదని ఏకంగా పిల్లాడి చేయి విరగ్గొట్టేశాడు. ఈ షాకింగ్ ఘటన విశాఖపట్నంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..
విశాఖపట్నం నగరంలోని మధురవాడ ఆదిత్యనగర్‌లో ఉన్న శ్రీ తనుష్ ప్రైవేట్ స్కూల్‌లో మధురవాడకు చెందిన నరేష్ (13) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం (ఆగస్ట్ 26) క్లాసులో ఇద్దరు విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. విద్యార్ధులిద్దరూ కొట్టుకోవడం ప్రారంభించడంతో ఆగ్రహించిన సోషల్ టీచర్ మోహన్ దారుణంగా ప్రవర్తించారు. నరేష్‌ను కొట్టి, షర్ట్ పట్టుకుని గట్టిగా తోశాడు. దీంతో విద్యార్థి నరేష్ ఇనుప బెంచీపై పడిపోయాడు. దీంతో బాలుడి చెయ్యి విరిగింది. అంతటితో సదరు టీచర్ మోహన్ ఆగకుండా.. అక్కడే మోకాళ్లపై నరేష్‌ను కూర్చోబెట్టాడు.
ఇంటికి వెళ్లి విద్యార్థి తల్లిదండ్రులకు జరిగిన సంగతి చెప్పారు. దీంతో వారు పిల్లాడిని తీసుకుని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా పరీక్షించిన వైద్యులు నరేష్ చేయి విరిగినట్లు తెలిపారు. వైద్యం చేయించి నరేష్‌ను ఇంటికి తీసుకొచ్చారు. బుధవారం వినాయక చవితి కావడంతో స్కూల్‌కు సెలవు ఇచ్చారు. గురువారం పాఠశాలకు చేరుకున్న తండ్రి ఆదినారాయణ ఇతర కుటుంబ సభ్యులు స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు. టీచర్ మోహన్ పరారీలో ఉన్నాడు. తమ బిడ్డకు న్యాయం చేయకపోతే ఊరుకునేది లేదంటూ డిమాండ్ చేశారు. స్కూల్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలికి మండల విద్యాశాఖ అధికారి అనురాధ, పీఎంపాలెం పోలీసుస్టేషన్ ఎస్‌ఐ సునీత చేరుకుని విచారణ చేట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.