ప్రియురాలిపై మోజుతో భార్యను కడతేర్చిన సైకో మొగుడు..! సూసైడ్ డ్రామాతో దొరికిపోయాడు..
బంధార్లపల్లికి చెందిన విజయ్ శేఖర్ రెడ్డి పీలేరులో ఒక ప్రైవేట్ పాల ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం వెంగంపల్లికి చెందిన హిందూజను 2020 జనవరి 30న పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే విజయ్ శేఖర్ రెడ్డి పనిచేసే పాల ఫ్యాక్టరీలోనే..

అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిపై మోజుతో కట్టుకున్న భార్యను హత్య చేశాడో సైకో మొగుడు. పీలేరులోని బందార్లపల్లిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బంధార్లపల్లికి చెందిన విజయ్ శేఖర్ రెడ్డి పీలేరులో ఒక ప్రైవేట్ పాల ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం వెంగంపల్లికి చెందిన హిందూజను 2020 జనవరి 30న పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే విజయ్ శేఖర్ రెడ్డి పనిచేసే పాల ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్న పలమనేరుకు చెందిన మాధవితో స్నేహం కుదిరింది. అదే విజయ్ శేఖర్‌రెడ్డి కుటుంబానికి శాపంగా మారింది. మాధవితో సన్నిహితంగా ఉన్న విజయ శేఖర్ రెడ్డి.. అనతి కాలంలోనే వీరి స్నేహం ప్రేమగా మారింది. ఇలా కంటిన్యూ అయిన ప్రేమాయణం కాస్తా హంతకున్ని చేసింది.
ప్రియురాలు మాధవిని విజయ శేఖర్ రెడ్డి తరచూ నేరుగా ఇంటికే తీసుకొని రావడంతో కుటుంబంలో తరచూ గొడవలు జరగడం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే విజయ శేఖర్ రెడ్డికి భార్య హిందూజతో విభేదాలు వచ్చాయి. అమ్మ, అమ్మమ్మ, అక్క ఇలా అందరి సపోర్టు ఉండటంతో మాధవితో విజయ శేఖర్ రెడ్డి చట్టాపట్టాలు వేసుకొని తిరగడం ఎక్కువైంది. కళ్ళేదుటే భర్త విజయ శేఖర్ రెడ్డి మాధవితో కలిసి ఉండడం జీర్ణించుకోలేక పోయిన హిందూజ.. భర్త ఆగడాలు శృతి మించి పోతున్నా పుట్టింటి వాళ్లకు ప్రశ్నించే స్తోమత లేకపోవడంతో అత్తింటిలోనే నలిగిపోయింది. ఈ నేపథ్యంలోనే గత నెల 29న భర్త విజయ శేఖర్ రెడ్డిని నిలదీసింది. విజయ్ శేఖర్ రెడ్డి భార్య హిందుజను ఇక కడ తేర్చాలని ప్లాన్ చేశాడు. విజయ శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో హిందూజ గొంతు నిలిమి ప్రాణం తీశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసాడు. కొత్తపల్లి చెరువు సమీపంలో ఉన్న బావిలో హిందూజ డెడ్ బాడీని పడేశాడు.
బావిలో డెడ్ బాడీని గంట పాటు ఉంచి రక్తపు మరకలు, హిందూజ శరీరంపై ఉన్న దుస్తులను మార్చి తిరిగి డెడ్ బాడీని ఇంటికి తరలించాడు. ఫ్రీజర్ బాక్స్ లో భద్రపరిచి నిద్రలోనే హిందూజ మరణించిందని బెంగళూరులో ఉన్న అత్తమామలకు సమాచారం ఇచ్చాడు. విజయ్ శేఖర్ రెడ్డి వాలకంపై అనుమానం వచ్చిన హిందూజ తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిలదీయగా అసలు నిజం బయటపడింది. హిందూజాను హత్య చేసి సహజ మరణంగా నమ్మించే నాటకం ఆడిన విజయ శేఖర్ రెడ్డి అసలు రంగు బయటపడడంతో పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో మరికొన్ని విషయాలు బయట పెట్టారు. 4 రోజుల క్రితం బంధారవాండ్లపల్లిలో జరిగిన హిందూజ హత్య కేసు మిస్టరీని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. గత నెల 29న నమోదైన హిందూజ కేసును సీరియస్‌గా తీసుకున్న అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం రాయచోటి డీఎస్పీ కృష్ణ మోహన్ నేతృత్వంలో కేసును ఛేదించింది. భర్త విజయ శేఖర్ రెడ్డినే అసలు హంతకుడని పోలీసులు తేల్చారు. హంతకుడు విజయ శేఖర్ రెడ్డితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యలో ప్రియురాలు మాధవి పాత్ర కీలకంగా ఉన్నట్లు భావిస్తున్నారు. మాధవి పరారీలో ఉండగా విజయ శేఖర్ రెడ్డితోపాటు అతని తల్లి శాంతమ్మ, అమ్మమ్మ అమ్మణమ్మ, అక్క సునందను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.