Andhra Pradesh: వామ్మో.. ఆ ఎత్తు ఏందీ సామీ.. తిరుమల కొండ మీద ఆమెను చూసి అవాక్కైన భక్తులు..
శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుల దృష్టిని ఓ మహిళ ఆకర్షించింది. ఏకంగా ఏడు అడుగుల ఎత్తు ఉన్న ఆమెను చూసి క్యూలైన్లలో అంతా ఆశ్చర్యపోయారు. ఆమె మరెవరో కాదు, శ్రీలంక నెట్‌బాల్ స్టార్ తర్జిని శివలింగం. శ్రీవారి దర్శనం తర్వాత బయటకు వచ్చిన ఆమెను భక్తులు వీడియోలు, ఫొటోలు తీయడానికి ఎగబడ్డారు.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం వేలాది మంది తిరుమలకు వస్తుంటారు. సోమవారం కూడా వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. అయితే అందరిచూపు మాత్రం ఓ మహిళ పైకే వెళ్లింది. దానికి కారణం ఆమె ఎత్తు. అవును..ఆమె అసాధారణ ఎత్తు కారణంగా ఆలయ ప్రాంగణంలో ఈమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి, ఆయన భక్త బృందంతో పాటు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఈ మహిళ ఎత్తు దాదాపు ఏడు అడుగులు ఉండటం విశేషం.
అవాక్కైన భక్తులు
శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఇంత ఎత్తైన మహిళను చూసి భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. క్యూ లైన్లలో స్వామి దర్శనం కోసం వెళ్తున్న ఆమెను భక్తులు తదేకంగా చూస్తూ ఉండిపోయారు. ఆమె ఎవరో తెలియకపోయినా, ఆమె ఎత్తు గురించే చర్చించుకోవడం కనిపించింది. ఆమె శ్రీలంకకు చెందిన ప్రముఖ నెట్‌బాల్ మాజీ క్రీడాకారిణి తర్జిని శివలింగం. తర్జిని శివలింగం స్వామి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ఆలయం బయటకు రాగా.. భక్తులు ఆమెను వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. భక్తుల మధ్య అంత ఎత్తున తర్జినిని చూసి అవాక్కవడం అక్కడున్న వారి వంతు అయ్యింది.
