Andhra: గుడి మరమ్మత్తులు చేస్తుండగా కనిపించిన ఈ రాయి.. పెద్ద గుట్టు విప్పింది…
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం హనుమంతరాయునిపల్లెలోని వీరాంజనేయస్వామి ఆలయంలో ఐదువందల ఏళ్ల నాటి తెలుగు శాసనం బయటపడింది. ఆలయ మరమ్మత్తుల సమయంలో వెలుగుచూసిన ఈ శిలాశాసనం ద్వారా, అప్పట్లో ఈ ప్రాంతాన్ని ‘కొమరవెల్లి’గా పిలిచేవారని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ...

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం హనుమంతరాయునిపల్లి గ్రామంలో వెలసిన వీరాంజనేయస్వామి దేవాలయంలో పురాతన తెలుగు శాసనం వెలుగుచూసింది. ఇటీవల గుడి మరమ్మత్తు పనులు చేస్తుండగా.. కొమరోలు ఆవిర్భావానికి సంబంధించిన శాసనాన్ని గుర్తించారు. ఐదువందల ఏళ్ల క్రితం కొమరవెల్లిగా పిలుచుకునే పట్టణమే నేడు కొమరోలుగా మారిందని తెలుస్తోంది. ఈ విషయాలను తెలియచేసే 15వ శతాబ్దానికి చెందిన శిలాశాసనం ఆలయ ఆవరణలో లభ్యమైంది.
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం హనుమంతరాయుని పల్లి సమీపంలోని ప్రాచీన దేవాలయంలో 15వ శతాబ్దం నాటి శిలా శాసనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ శిలా శాసనాల ఆధారంగా శ్రీరాముడు, సీతాదేవి అరణ్యవాసం చేసేటప్పుడు కొద్ది రోజులపాటు ఈ ఆలయ ప్రాంగణంలో విడిది చేసినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయని ఆలయ అర్చకులు చెబుతున్నారు. సీతమ్మవారు స్నానమాచరించేందుకు రాములవారు ఆలయ సమీపంలో ఒక బావిని తవ్వించారని ఆ బావికి సీతమ్మ బావిగా నామకరణం చేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో సీతమ్మ వారి పాదాలు ముద్రలు కూడా ఉన్నాయని, ఆలయంలో అమ్మవారు, వినాయకుడు, హనుమంతుడు, వీరభద్రుడు, నాగేంద్రుడు విగ్రహాలు 15వ శతాబ్దం నాటివని అర్చకులు చెబుతున్నారు.
హనుమంతరాయునిపల్లె గ్రామం ప్రస్తుతం కొమరోలు మండలంలో ఉంది… ఇప్పుడు కొమరోలుగా పిలుచుకునే పట్టణం ఐదువందల ఏళ్ళకు పూర్వం కొమరవెల్లిగా పిలుచుకునేవారని శాసనాల్లో ఉంది. హనుమంతరాయునిపల్లి చుట్టుపక్కల ఉన్న 16 గ్రామాలు సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో దామర్ల రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. అలాగే ఆలయం తూర్పు భాగాన ఒక పెద్ద చెరువును తవ్వించారు… ఇది మండలంలోని అతిపెద్ద చెరువులలో ఒకటిగా ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
