Andhra Pradesh: ఏనుగుల దాడిలో ఇద్దరు దుర్మరణం.. అటు మన్యం జిల్లాలో మాత్రం..
గజరాజుల దండయాత్ర ఆగడం లేదు. మనుషుల మీద దాడులు చేస్తున్నాయి ఏనుగులు. గజరాజుల దాడిలో ఓ మహిళ మృతి చెందింది. మల్లనూరు, పైపాలెం, కూసూరులో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.

ఏపీ, తమిళనాడు సరిహద్దులో ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. అడవిలోనుంచి జనారణ్యంలోకొచ్చి పడ్డాయి ఏనుగులు. ఒక్కసారిగా గ్రామాల్లోకి ప్రవేశించి ఏనుగులు.. అలజడి సృష్టిస్తున్నాయి. కుప్పం సరిహద్దుల్లో తిష్ట వేశాయి గజరాజులు..ఘీంకరిస్తూ జనావాసాల్లోకి దూసుకొచ్చి.. భయపెడుతున్నాయి. సప్పానికుంటలో ఏనుగు దాడిలో ఐదు రోజుల క్రితం ఓ రైతు మృతి చెందగా.. ఇవాళ ఉషా అనే మహిళ చనిపోయింది. కూలి పని కోసం బెంగళూరు వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు వెళ్తున్న మహిళలపై దాడి చేశాయి రెండు ఏనుగులు. తెల్లవారు జామున 5.30 గంటల సమయంలో బెంగళూరుకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు చేరుకున్న మహిళలుపైకి ఒక్కసారిగా దూసుకువచ్చాయి ఏనుగులు. దీంతో మహిళంలో పరుగులు తీశారు. ఉష మాత్రం ఏనుగులకు చిక్కింది. తమిళనాడు అటవీ ప్రాంతం నుంచి గురువారం రాత్రి ఏపీ సరిహద్దు గ్రామాల్లో చొరబడ్డాయి ఏనుగులు. రంగంలోకి దిగిన అటవీశాఖ ఆ ఏనుగులను అడవిలోకి పంపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
మన్యం జిల్లాలో నాలుగు ఏనుగులు మృతి
మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం కాట్రగడ సమీపంలో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. అవి విద్యుత్ షాక్ తో మృతి చెందాయంటున్న గ్రామస్తులు చెబుతున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీస్, అటవీశాఖ అధికారులు.. ఏనుగుల మృతిపై దర్యాప్తు చేస్తున్నారు. ఒరిస్సా నుండి చొరబడి గత కొన్ని నెలలుగా భామిని మండలంలో ఏనుగుల గుంపు తిష్ట వేసినట్లు చెబుతున్నారు. స్థానికంగా పంటలను నష్ట పరుస్తూ, అప్పుడప్పుడు మనుషులుపైన, పశువుల పైన దాడులకు దిగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
