Andhra: అయ్యో.. అయ్యప్పా.. మాల విరమణ చేసి వస్తుంటే ఎంత ఘోరం జరిగిపోయింది..
ఇటీవలి కాలంలో రోడ్లపై అతి వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, ప్రమాదకర మలుపులు, అధ్వాన్న రహదారులు… ఇలా ఎన్నో కారణాలతో ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. ఇంటి నుంచి బయలుదేరినవారు సురక్షితంగా తిరిగి వస్తారా అన్న ఆందోళన కుటుంబాల్ని వెంటాడుతోంది. తాజాగా అయ్యప్ప మాల విరమణకు కారులో వెళ్లిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన భక్తులు..

ఇటీవల వివిధ ప్రాంతాలలో జరుగుతోన్న రోడ్డు ప్రమాదాలు అందరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. తీర్థ యాత్రలు, విద్య, ఉద్యోగం, ఉపాధి, శుభకార్యాల నిమిత్తం దూర ప్రాంతాలకు ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారు ఎందరో. వాతావరణ, భౌగోళిక పరిస్థితులు, అధ్వాన్నంగా ఉన్న రహదారులు, అతి వేగం, నిర్లక్యపు డ్రైవింగ్ కారణంగా నిత్యం ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్ళినవారు తిరిగి ఇంటికి చేరే వరకు కుటుంబ సభ్యులు బిక్కుబిక్కు మంటూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో విషాదం నెలకొంది. బుధవారం ఉదయం తమిళనాడులోని రామనాథపురం మెడికల్ కాలేజ్ సమీపం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జిల్లాలోని పలాస మండలానికి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందగా.. మరో నలుగురు అయ్యప్ప భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు పలాస మండలం వీర రామచంద్రపురం గ్రామానికి చెందిన పైడిరాజు (25),పెదంచల గ్రామానికి చెందిన ఇల్లాల నవీన్(26) గా గుర్తించారు. అయ్యప్ప మాలధారణలో పలాస మండలం నుంచి ఆరుగురు అయ్యప్ప భక్తులు కారులో కేరళలోని అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లారు. అక్కడ మాల విరమణ చేసి మార్గమధ్యంలో కొన్ని ప్రముఖ ఆలయాలను దర్శించుకొని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు రామనాథపురం వద్ద టెంపో ట్రావెల్‌ను ఢీకుంది. ప్రమాద తీవ్రతకు కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది. దీంతో తమిళనాడు రాష్ట్ర రెస్క్యూ బృందం కారులో ఇరుక్కున్నవారిని జాగ్రత్తగా బయటకు తీసి అంబులెన్స్ లో హాస్పిటల్‌కి తరలించారు. ప్రమాదంపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు పైడిరాజు, నవీన్‌ల మృతితో వారి స్వగ్రామాలు అయిన వీర రామచంద్రపురం,పెదంచల గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి మరణవార్త విని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
