AP News: అక్కడ.. పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక… ఇరవై ఏళ్ళలో మొదటిసారి…
మిచౌంగ్ విరుచుకుపడుతోంది. బీభత్సం సృష్టిస్తోంది. అవును.. మిచౌంగ్ తుఫాన్ తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో రోడ్లపై కార్లు కొట్టుకుపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో ప్రాంతాలు జల దిగ్బంధంలో విలవిల్లాడుతున్నాయి.
మిచౌంగ్ తుఫాన్ ముంచుకొస్తుంది. ఆదివారం తెల్లవారుజామున బాపట్ల వద్ద తీరం దాట వచ్చని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బాపట్ల జిల్లాలోని రేపల్లే, బాపట్ల, చీరాల నియోజకవర్గాల్లో సముద్ర తీర ప్రాంతం ఉండగా నిజాంపట్నంలో మినీ హార్బర్ ఉంది. “మిచౌంగ్ తుఫాన్” ప్రమాదం ఉండటంతో నిజాంపట్నం హార్బర్ లోనే 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 10వ నెంబర్ ప్రమాద సూచిక అతి తీవ్రమైన వాతావరణం, భారీ గాలులు, భారీ వర్షం ఉంటుందని చెబుతుంది. దీంతో రేపల్లె నియోజకవర్గంలో ఆందోళన వ్యక్తం అవుతుంది. నిజాంపట్నం తీర ప్రాంతానికి తుఫాను తాకే ప్రమాదం ఉందని పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
గడిచిన 20 సంవత్సరాల్లో నిజాంపట్నం హార్బర్ లో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే మొదటిసారి. ఈ పదో నెంబర్ ప్రమాద హెచ్చరికతో నిజాంపట్నం తీరప్రాంత గ్రామాలు ముప్పుకి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో సముద్రం అలలు ఉప్పెన గ్రామాల్లోకి పొంచి వచ్చే ప్రమాదం కూడా ఉందని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసర ప్రయాణాలు మాత్రమే చేయాలని సూచించారు. ఇళ్ళలోనుండి బయటకు రావద్దంటున్నారు. చెట్లు పడిపోవడం, రోడ్లు కోతకు గురవడం, విద్యుత్ కు అంతరాయం కలగడం జరుగవచ్చంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం వరకూ అధికారులతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.