తాలిబన్లతో అమెరికా శాంతి జపం.. ఇండియాకూ ఆహ్వానం
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లతో అమెరికా శాంతి ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ సందర్భంగా శనివారం ఖతర్ రాజధాని దోహాలో జరిగే ఒప్పంద కార్యక్రమానికి.. ఖతర్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు అక్కడి భారత రాయబారి పి.కుమారన్ హాజరు కానున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లతో అమెరికా శాంతి ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ సందర్భంగా శనివారం ఖతర్ రాజధాని దోహాలో జరిగే ఒప్పంద కార్యక్రమానికి.. ఖతర్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు అక్కడి భారత రాయబారి పి.కుమారన్ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి ముందే శుక్రవారం విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా.. కాబూల్ వెళ్లి ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనికి ప్రధాని మోదీ రాసిన ఓ లేఖను అందజేశారు. నవంబరు 9 న జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో.. ఆఫ్ఘన్ లో అమెరికా తన సైనిక దళాలను పెద్ద ఎత్తున మోహరించింది. 2001 నుంచి తాలిబన్లకు, అమెరికన్ సైనికులకు మధ్య జరిగిన పోరులో 2 వేల మందికి పైగా యూఎస్ సోల్జర్స్ మరణించారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పటికైనా శాంతి నెలకొనాలని అమెరికా, ఇండియా కూడా భావిస్తున్నాయి.
తాలిబన్లతో అమెరికా కుదుర్చుకునే ఒప్పంద కార్యక్రమానికి ఇండియా ‘అబ్జర్వర్’ గా హాజరు కాబోతోంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఆఫ్ఘన్ నుంచి వేలాది అమెరికన్ సైనికులనుఉపసంహరిస్తారు. అలాగే తాలిబన్లు, రాజకీయ, సివిల్ సొసైటీ బృందాలు ఆఫ్ఘన్ ప్రభుత్వంతో లాంఛనప్రాయ చర్చలు జరిపేలా సానుకూల వాతావరణం సృష్టిస్తారు.
అమెరికా, తాలిబన్ల మధ్య కుదిరే ఒప్పంద కార్యక్రమానికి ఇండియా అధికారికంగా హాజరు కానుండడం ఇదే మొదటిసారి. ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి నెలకొనేలా చూడడంలో ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఉగ్రవాదులైన తాలిబన్లతో యుఎస్ ఇలా అగ్రిమెంట్ కుదుర్చుకోవడం ఏమిటో అర్థం కావడంలేదని విదేశాంగశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సహజంగా ఈ విధమైన వైఖరి మన విధానానికే విరుధ్ధమని ఈ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
అయితే శాంతి డీల్ పై తాను ప్రధాని మోదీతో చర్చించానని, దీనిపై సంబంధింత వర్గాలన్నీ సంతోషంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ విషయంలో ఇండియా జోక్యం చేసుకోవాలని భావిస్తున్నానని ఆయన ఇటీవల ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. ఏమైనా … ఆప్ఘనిస్తాన్ లో శాంతి నెలకొనేలా చూడడంలో భారత ప్రభుత్వ కృషి ఏమోగానీ మొదట శాంతి నెలకొనాల్సింది ఢిల్లీ నగరంలో అని విమర్శకులు పేర్కొంటున్నారు. ఢిల్లీ అల్లర్లలో 40 మందికి పైగా మృతి చెంది 200 మందికి పైగా గాయపడితే ఇక్కడ శాంతి, సామరస్యాలను పునరుధ్ధరించేందుకు అటు కేంద్రం గానీ, ఇది ఢిల్లీ ప్రభుత్వం గానీ పెద్దగా చర్యలు తీసుకోని విషయాన్ని వీరు ప్రస్తావిస్తున్నారు.