అమెరికాలో ఇంకా కోవిడ్ ముప్పు ఉన్నట్టే..ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధ్యక్షుడు జోబైడెన్ హెచ్చరిక
అమెరికా లో ఇంకా కోవిడ్ ముప్పు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోని ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధ్యక్షుడు జోబైడెన్ హెచ్చరించారు. ముప్పు పూర్తిగా తొలగిపోలేదన్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిన్న కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది..
అమెరికా లో ఇంకా కోవిడ్ ముప్పు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోని ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధ్యక్షుడు జోబైడెన్ హెచ్చరించారు. ముప్పు పూర్తిగా తొలగిపోలేదన్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిన్న కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. పాతవాటిని సవరించింది. సుమారు 20 లక్షలమందికి పైగా ఫెడరల్ వర్కర్లు, ప్రజలు మాస్కులు ధరించాలని బైడెన్ సూచించారు. రెండు డోసులూ వ్యాక్సిన్ తీసుకున్నా ఇది అనివార్యమని ఆయన పేర్కొన్నారు. దాదాపు నెల రోజులుగా నిలిచిపోయిన వ్యాక్సినేషన్ డ్రైవ్ ని గురువారం నుంచి తిరిగి యుద్ధ ప్రాతిపదికన చేబడుతున్నట్టు ఆయన వెల్లడించారు. అనేక రాష్ట్రాల్లో డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆయన అంగీకరించారు. అమెరికా అంటువ్యాధుల నివారణా విభాగం డైరెక్టర్ రోచెల్లీ నిన్న నూతన గైడ్ లైన్స్ ని ప్రకటిస్తూ.. ఆంక్షలను సడలించినంత మాత్రాన ఈ మహమ్మారి పూర్తిగా తొలగిపోలేదని, భౌతిక దూరం పాటింపు, మాస్కుల ధారణ తప్పనిసరి అని వివరించారు. డెల్టా ట్రాన్స్ మిషన్ అన్నది ఇదివరకటికన్నా వేగం పెరిగిందని ఆయన చెప్పారు. గతంలో మాదిరే ప్రజలు ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలకు సహకరించాలని ఆయన కోరారు.
దాదాపు నెలన్నర రోజుల క్రితం అమెరికాలో మాస్కులు తప్పనిసరి కాదంటూ బైడెన్ ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది. దాంతో దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కానీ డెల్టా వేరియంట్ కారణంగా మళ్ళీ కోవిడ్ కేసులు పెరగడంతో ఈ తాజా నిబంధనలను ప్రవేశపెట్టారు. లాస్ ఏంజెలిస్ లో ఉద్యోగులంతా తాము వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఆధారాలు చూపాలని, లేదా రెగ్యులర్ గా కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేశారు. అలాగే స్కూళ్ళు, కాలేజీలు తెరిచినప్పటికీ విద్యార్థులు, టీచర్లు, స్టాఫ్ అంతా కోవిడ్ ప్రొటొకాల్స్ పాటించాల్సిందేనని కూడా ఈ గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : కన్నడిగులకు కొత్త సీఎం..మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )
బీటెక్ విద్యార్థులకు శుభవార్త..ఐటీ రంగంలో పుంజుకుంటున్న ఉద్యోగ అవకాశాలు..:B Tech Students video.