భూగోళంవైపు దూసుకొస్తున్న భారీ అస్టరాయిడ్
ఇంకా కొన్ని గంటలే మిగిలి వుంది. భారీ అస్టరాయిడ్ భూగ్రహంవైపు దూసుకొస్తోంది.కొద్దిరోజుల కిందటే ఓ గ్రహశకలం భూమికి అతి సమీపం నుంచి అనంత విశ్వంలోకి వెళ్లిపోయింది. దాని ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకునేలోపే మరో భారీ అస్టరాయిడ్ భూగోళంవైపు అతివేగంగా దూసుకొస్తోంది.
భారీ అస్టరాయిడ్ మరికొన్ని గంటల్లో భూకక్ష్యలోకి ప్రవేశించబోతోంది. దాని ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై అమెరికా అంతరిక్ష ప్రయోగాల సంస్థ నాసా అధ్యయనం చేస్తోంది. రేపు మధ్యాహ్నం అస్టరాయిడ్ భూకక్ష్యలోకి ప్రవేశించడం ఖాయంగా కనిపిస్తోందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.
భూమి వైపు దూసుకొస్తోన్న ఈ గ్రహశకలానికి 2020 ఆర్‌కే 2గా నాసా శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. సెకెనుకు 6.68 కిలోమీటర్ల వేగంతో ఈ గ్రహశకలం భూమి వైపు వస్తోందని తెలిపారు. భూకక్ష్యలోనికి ప్రవేశించడానికి సమీపించే కొద్దీ దాని వేగం మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని అంచనా వేస్తున్నారు. దీని పరిమాణం బోయింగ్ 747 కంటే పెద్దదిగా ఉందని చెబుతున్నారు. ఈ గ్రహశకలం 80 మీటర్ల వెడల్పు, సుమారు 81 మీటర్ల డయా, 118 నుంచి 256 అడుగుల పొడవు ఉందని నిర్ధారించారు.
ఈ గ్రహశకలం భూమిని ఢీ కొట్టే అవకాశాలు దాదాపుగా లేవని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఢీ కొట్టడానికి గల అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం భూమికి 38,30,238 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్పేస్ రాక.. మరింత వేగాన్ని పుంజుకునే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దాని వేగం సెకెనుకు 6.68 కిలోమీటర్లుగా నమోదైనట్లు తెలిపారు. భూమిని ఢీ కొట్టే అవకాశాలు లేనప్పటికీ.. భూకక్ష్యలోకి ప్రవేశించడమో లేదా అతి సమీపం నుంచి వెళ్లిపోవడమో జరుగుతుందని అన్నారు.
రేపు మధ్యాహ్నం 1.12 నిమిషాలకు ఈ గ్రహశకలం భూమికి అత్యంత సమీపానికి చేరుకుంటుంది. అదే వేగంతో దూసుకెళ్తుంది. ఇక మళ్లీ ఈ గ్రహశకలం పునర్దర్శనం 2027 ఆగస్టులో లభిస్తుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీన్ని సాధారణ కంటితో చూడలేమని వెల్లడించారు. గ్రహశకలాల మీద ఉండే ఉష్ణోగ్రత, అవి దేనితో తయారయ్యాయనే అంశాలపై అధ్యయనం చేయడానికి ఇది ఉపకరిస్తుందని వారు తెలిపారు. మార్స్, జుపిటర్ గ్రహాల మధ్య ఈ అస్టరాయిడ్లు పెద్ద సంఖ్యలో తిరుగాడుతుంటాయని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.