America Suffers: కరోనా కరాళనృత్యానికి అగ్రరాజ్యం విలవిల.. ప్రపంచ దేశాలకు అమెరికానే ఓ గుణపాఠం

ఏ కోణంలో చూసినా, ఏ రంగంలో చూసినా అమెరికాను అగ్ర రాజ్యంగానే పేర్కొంటూ వస్తున్నాం. కానీ కరోనా...

America Suffers: కరోనా కరాళనృత్యానికి అగ్రరాజ్యం విలవిల.. ప్రపంచ దేశాలకు అమెరికానే ఓ గుణపాఠం
America

AMERICA SUFFERS FROM CORONAVIRUS A LESSON TO THE WORLD: ఏ కోణంలో చూసినా, ఏ రంగంలో చూసినా అమెరికాను అగ్ర రాజ్యంగానే పేర్కొంటూ వస్తున్నాం. కానీ కరోనా ఎంటరయ్యాక సీన్ మారింది. కరోనాను డీల్ చేయలేక అమెరికా అతలాకుతలం అవుతోంది. వైద్య రంగంలో ఏనాడో ఎవ్వరూ సాధించలేని అభివృద్ధిని సాధించిన అమెరికా కరోనా వైరస్ విస్తరించకుండా చూసుకోవడంలో వైఫల్యం చెందిందనే చెప్పాలి. చైనా, రష్యాల తర్వాత అమెరికా కరోనా వ్యాక్సిన్‌ని కనుగొంది. 2020 నవంబర్ నెలాఖరులోనే పంపిణీని ప్రారంభించింది. కానీ అమెరికా జనాభా (సుమారు 33 కోట్లు)కు పూర్తి స్థాయిలో రెండు డోసులను 14 నెలలు పూర్తయినా కంప్లీట్ చేయలేకపోయింది. అమెరికా కంటే రెండు నెలల తర్వాత వ్యాక్సినేషన్ ప్రారంభించిన భారత్.. ఏడాది కూడా పూర్తి కాకుండానే 150 కోట్ల డోసులను పంపిణీ చేసేసింది. దాదాపు 7 దేశాలకు భారత్ కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. అమెరికా తమ జనాభా 33 కోట్లకు రెండు డోసులు ఇవ్వాలంటే కేవలం 66 కోట్ల డోసులను పంపిణీ చేస్తే సరిపోయేది. కానీ 14 నెలల కాలంలో ఆ పని పూర్తి చేయలేకపోయిన అమెరికా ఇపుడు థర్డ్ వేవ్ ముంచెత్తడంతో కరోనా చేతిలో కకావికలమవుతోంది.

అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభిస్తుంది. గతేడాది ఆ దేశంలో సెకండ్‌ విధ్వంసం తెలిసిందే. లక్షలాది మందికి కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కూడా అమెరికాపై పగబట్టింది. రోజురోజుకు విస్తరిస్తుంది. రోజుకు లక్షల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రులు నిండిపోతున్నాయి. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న వారు సైతం ఆక్సిజన్‌ బెడ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో మళ్లీ ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతుంది. అమెరికాలో నిత్యం రికార్డుస్థాయిలో కోవిడ్‌ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా సోమవారం (జనవరి 10న) ఒక్కరోజే అమెరికాలో 11 లక్షల కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అంతకుముందు జనవరి 3న ఒకేరోజు 10 లక్షల కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆస్పత్రుల్లో చేరికలు కూడా భారీగా నమోదయ్యాయి. ఒకేరోజు లక్షా 35వేల మంది ఆస్పత్రుల్లో చేరినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రోజువారీ కేసుల్లో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ ఈ తరహా కేసులు నమోదు కాలేదు.

వాషింగ్టన్ డీసీ, విస్కాన్‌సిన్‌, వర్జీనియా, డెలావేర్‌, ఇలినోయిస్‌, మేరీల్యాండ్‌, మిస్సౌరి, పెన్సిల్వేనియాతోపాటు పలు రాష్ట్రాల్లో ఆస్పత్రి చేరికలు అధికంగా ఉన్నాయి. వైరస్‌ తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ఇన్‌ఫెక్షన్‌లు పెరిగితే వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నర్సులు, వైద్య సిబ్బందికి వైరస్‌ సోకినా స్వల్ప లక్షణాలు ఉన్నవారిని విధుల్లోకి వచ్చేలా పలు ఆస్పత్రులు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం ఇక్కడ పరిస్థితికి అద్దం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఇప్పటికే భారీ స్థాయిలో రోగులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఆస్పత్రుల పాలవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గతేడాది జనవరి 14న అక్కడ రికార్డు స్థాయిలో ఒక లక్షా 42 వేల 273 మంది ఆసుపత్రుల్లో చేరగా.. తాజాగా సోమవారం (జనవరి 10న) ఒమిక్రాన్‌, ఇతర వేరియంట్లు సోకి లక్షా 41 వేల 385 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సంఖ్య ఒకటి రెండు రోజుల్లో 2021 రికార్డు స్థాయి సంఖ్యను దాటేస్తుందని నిపుణులు అంచనావేస్తున్నారు.

అమెరికాలో ఒమిక్రాన్‌ ప్రభావం నిపుణుల అంచనాలకు తగ్గట్టుగానే వేగంగా వ్యాపిస్తుంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య మరికొన్ని వారాల్లోనే మూడు లక్షలకు చేరుకోవచ్చు. కొలొరాడో, ఒరిగాన్‌‌, లూసియానా, మేరీల్యాండ్‌, వర్జీనియాల్లో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అమెరికాలో కేసుల తాకిడి బీభత్సంగా ఉంది. కరోనా వైరస్‌ బారిన పడే ఆసుపత్రి సిబ్బంది సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఫలితంగా వైద్య సిబ్బంది సంఖ్య తక్కువగా.. చికిత్సకు వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది తీవ్ర కొరత ఏర్పడింది. ఈ విషయాన్ని అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీస్‌ ధ్రువీకరించింది. ఇప్పటికే దాదాపు 12 వందల ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఏర్పడింది. మరో 100 ఆసుపత్రుల్లో రానున్న వారం రోజుల్లో సిబ్బంది కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఒమిక్రాన్‌ కారణంగా భారీ సంఖ్యలో వైద్య సిబ్బంది కరోనా బారిన పుడుతున్నారు. దీంతో కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ కీలక నిర్ణయం తీసుకొంది. సార్స్‌కోవ్-2 పాజిటివ్‌గా నిర్ధారణ అయినా.. ఎలాంటి లక్షణాలు లేకపోతే.. సిబ్బంది ఎన్‌-95 మాస్కులు ధరించి విధులకు హాజరుకావాలని సూచించింది. ఈ ఆదేశాలు జనవరి 8వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ తాత్కాలికంగా అమల్లో ఉంటాయని పేర్కొంది. కరోనా రోగి కాంటాక్ట్‌లోకి వెళ్లిన వైద్యసిబ్బంది కూడా లక్షణాలు లేకపోతే ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండా ఎన్‌-95 మాస్కులు ధరించి విధులకు హాజరుకావాలని తెలిపింది. దీనిపై కాలిఫోర్నియా నర్సెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు తీవ్రంగా స్పందించారు. వైరస్‌ సోకిన వైద్య సిబ్బంది విధుల్లోకి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధికారులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

వ్యాక్సిన్లు తీసుకోని వారిలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతోపాటు కొత్తగా బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్లు కూడా నమోదవుతున్నాయి. ఈ సారి వచ్చే కేసుల సంఖ్య ప్రకారం అతి తక్కువ శాతం ఆసుపత్రుల్లో చేరినా.. ఐసీయూ పడకలు దొరకని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్‌తోపాటు.. ఈ కష్టకాలంలో ఫేక్‌న్యూస్‌ మహమ్మారి కూడా ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఒమిక్రాన్‌ సహజ టీకా అంటూ భారీగా ప్రచారం జరగడం కూడా వైరస్‌ వ్యాప్తిని పెంచుతోంది. ఇటువంటి ప్రచారాలు ప్రజల్లో నిర్లక్ష్యాన్ని పెంచుతున్నాయి. దీనికి తోడు వ్యాక్సిన్లపై అర్థం లేని అనుమానాలను సృష్టించడం నష్టదాయకంగా మారుతోంది. అమెరికాలో వైరస్‌ తీవ్రతకు ప్రధాన కారణం వ్యాక్సిన్లు తీసుకోని వ్యక్తులేనని అక్కడి నిపుణులు నెత్తీనోరు బాదుకొంటున్నారు. భారత్‌లో దిల్లీ ప్రభుత్వం జనవరి 5 నుంచి 9 వరకు నమోదైన మరణాలపై నిర్వహించిన సర్వేలో కీలక విషయం తేలింది. ఈ సమయంలో మరణించిన మొత్తం 46 మందిలో 35 మంది టీకా తీసుకోని వారేనని తేలింది. అంటే టీకా తీసుకోని వారిలో 76శాతం అధిక మరణాలు నమోదవుతున్నాయి. అమెరికాలో నివసించే వారిలో కొన్ని దేశాల వారు మినహాయిస్తే మిగిలిన వారంతా సోషల్ లైఫ్‌గా బాగా కోరుకుంటారు. అందుకే కరోనా రిస్ట్రిక్షన్స్‌ని పాటించేందుకు వారు మొగ్గు చూపలేదు. మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి అంటే.. అది వారంతా తమ వ్యక్తిగత జీవన విధానంపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందని భావించారు. తమ స్వేచ్ఛా స్వాతంత్రాలను ప్రభుత్వం హరిస్తోందని ఆందోళనలు నిర్వహించారు. అదేసమయంలో చాలా మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు ఇష్టపడలేదు. ఈకారణాల వల్లే అమెరికాలో ఇపుడు కరోనా కరాళ నృత్యం కొనసాగుతోంది. అమెరికాను ఓ గుణపాఠంగా భావించాల్సిన పరిస్థితి ఇపుడు ప్రపంచ దేశాల ముంగిట కనిపిస్తోంది. పాండమిక్ దశ నుంచి ఎండమిక్ దశకు కరోనా చేరితేగానీ కరోనా ఓ సాధారణ వైరస్‌గా మారితే గానీ ప్రపంచం ఓ మహా ఉపద్రవం నుంచి గట్టెక్కని పరిస్థితి కనిపిస్తోంది.

Click on your DTH Provider to Add TV9 Telugu