యెమెన్‌లో మారణహోమం.. ప్రధాని లక్ష్యంగా బాంబుల దాడి.. వరుస పేలుళ్లలో 26 మంది మృతి, 50 మందికి గాయాలు..

యెమెన్‌లోని ఆదెన్ విమానాశ్రయంలో దుండగులు మారణహోమానికి తెగబడ్డారు. వరుస బాంబు దాడి తీవ్ర విషాదాన్ని నింపింది.

యెమెన్‌లో మారణహోమం.. ప్రధాని లక్ష్యంగా బాంబుల దాడి.. వరుస పేలుళ్లలో 26 మంది మృతి, 50 మందికి గాయాలు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 31, 2020 | 6:30 AM

యెమెన్‌లోని ఆదెన్ విమానాశ్రయంలో దుండగులు మారణహోమానికి తెగబడ్డారు. వరుస బాంబు దాడి తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ దేశ ప్రధాన మంత్రి, నూతన మంత్రివర్గాన్ని లక్ష్యంగా చేసుకొని జరిపిన బాంబు దాడిలె 26 మంది ప్రాణాలను కోల్పోయారు. దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని యెమెన్ అధికారులు తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ దాడి నుంచి ప్రధాని సహా నూతన మంత్రివర్గం సురక్షితంగా బయటపడ్డారని యెమెన్ అధికారులు వెల్లడించారు.

నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ పెద్దలకు ఘనంగా స్వాగతం పలకడానికి అధికారులు, ప్రజలు ఎయిర్‌పోర్టులో పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇంతలోనే ప్రధాని మోయిన్ అబ్దుల్ మాలిక్, 10 మంది మంత్రులతో వచ్చిన ప్రత్యేక విమానం అక్కడ ల్యాండ్ అయింది. విమానం నుంచి వారు కిందికి దిగుతుండగా.. ఇంతలో భారీ శబ్దంతో బాంబు పేలింది. రన్‌వేకు సమీపంలో ఓ పక్కన పార్క్ చేసిన కారును ఒక్కసారిగా పేల్చివేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, రాకెట్ బాంబు దాడికి పాల్పడినట్లు కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ బాంబు దాడిలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. పేలుడు అనంతరం కొంత మంది ప్రాణ భయంతో ప్రవేశమార్గం వైపు పరుగులు తీశారు. ఇంతలో అక్కడ మరో బాంబ్ పేల్చారు. బాంబు పేలుడుకు సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇరాన్‌కు అనుకూలంగా పనిచేస్తున్న హుతి రెబెల్స్ ఈ పేలుళ్లకు పాల్పడ్డట్లు అధికారులు భావిస్తున్నారు. యెమెన్‌లో గత కొన్నెళ్లుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈ అంతర్యుద్ధంలో ఇప్పటివరకు 10 వేల మందికి పైగా సామాన్యులు బలయ్యారు. సుదీర్ఘ కాలంగా నెలకొన్న అస్థిరత్వానికి చెక్ పెడుతూ డిసెంబర్ 18న కొన్ని వేర్పాటువాద సంస్థలు, ప్రభుత్వం కలిసి ఫ్రంట్ ఏర్పాటు చేశాయి. పవర్ షేరింగ్ కేబినెట్‌ను ఏర్పాటు చేశాయి. ఈ పరిణామం పట్ల యెమెన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా తాజా దాడి జరిగింది.

బాంబు దాడిని ఐక్యరాజ్య సమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు, వివిధ దేశాధినేతలు ఖండించారు. ‘ఇదొక మూర్ఖమైన చర్య’ అని యెమెన్ నూతన ప్రభుత్వ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇలాంటి దాడులతో తమ ముందున్న పవిత్ర కార్యాన్ని అడ్డుకోలేరని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.