World Music Day 2022: సంగీతం ఈ మూడక్షరాల పదానికి ఉన్న శక్తి మాటల్లో వర్ణించలేనిది. రాగం.. తానం.. పల్లవి ఈ మూడు సంగీత సరస్వతికి ప్రాణాధారాలు, సరిగమపదనిసలే సప్తస్వరాలై సంగీత ప్రపంచానికి మూలాధారాలగా నిలుస్తున్నాయి. కాలాన్ని సైతం మరపించి.. మానసిక ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి సంగీతానికి మాత్రమే సొంతం అనడంలో అతిశయోక్తి లేదు. ఏ సంగీతానికైనా శాస్త్రీయ సంగీతమే ప్రాణం, మూలం. మనిషిని కదిలించి.. కరిగించే మహత్తర శక్తి సంగీతానిది. ఆనందం.. ఆవేశం.. వినోదం.. విషాదం.. సమయం సందర్భం ఏదైనా దానికి గళమిచ్చేది సంగీతం. బలమిచ్చేది సంగీతం. అందుకే పాట లేని ప్రపంచాన్ని ఊహించలేం. అందుకే ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ సంగీత దినోత్సవాలన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారు.
మొట్టమొదటిసారిగా మ్యూజిక్ డే ఫ్రాన్స్‌లో..
మొట్టమొదటి సారిగా మ్యూజిక్ డే ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది. దీనిని 1982వ సంవత్సరం జూన్ 21 నుండి కొనసాగిస్తూ వస్తున్నారు. ఆ రోజును ‘మ్యూజిక్ డే లేదా అంతర్జాతీయ సంగీత దినోత్సవం’ గా ప్రపంచ దేశాలు జరుపుకుంటున్నాయి. భారత దేశం సంగీత దేశం. మనదేశంలో సంగీతం రాజుల కాలం నుండి ఉన్నది. అప్పట్లో స్వయంగా కొంతమంది సంగీత విద్వాంసులు కావడంతో సంగీతకళకు ఎనలేని ఆదరణ లభించేది. రాజుల తరువాత సంగీత విద్వాంసులు పెద్ద పెద్ద ఆలయాల్లో కచేరీలు ఇచ్చేవారు. ఇండియాలో శాస్త్రీయ సంగీతానికి మక్కువ ఎక్కువ. దీంతో పాటు పాశ్చాత్య సంగీతాలైన పాప్, రాక్ మరియు వెస్ట్రన్ మ్యూజిక్ లను నేటి యువతరం ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సంగీతం ఏదైనా ఇవన్నీ సంగీత ప్రియులను మైమరిపిస్తాయి అనటంలో సందేశం లేదు.
సంగీతంలో మనసును రంజింపచేసే మహత్తు ఉంది. చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు.. ఆఖరికి పశువులు, జంతువులు సైతం సంగీతానికి ముగ్దులవ్వక మానరు. సంగీతంలో ఉండే రాగం వల్ల మనసు ఆహ్లాదం చెంది, కొత్త ప్రపంచంలో విహరింపచేసే శక్తి సంగీతానికి ఉంది. సంగీతంలో రోజు రోజుకు ఎన్నో కొత్త ప్రక్రియలు వస్తున్నా సంగీతం అనే కళకు బలం చేకూరుస్తున్నాయే తప్ప మరే విధమైన ఇబ్బందిని కలిగించటం లేదు. సంగీతంలో సరిగమపదనిస.. అనే ఏడు స్వరాలే కీలకం, అక్కడ నుండే అనేక జనక రకాలు, వాటినుండి పుట్టిన అనేక జన్యరాగాలు ఉండనే ఉన్నాయి. ఇలా ఆ ఏడు స్వరాల నుండే సంగీతం అనే కళ గొప్పగా అవతరించి మన ముందుకు వచ్చింది. ఎవరు సంగీతం నేర్చుకున్నా ఇక్కడ నుండి ప్రారంభం జరగాలి. ప్రస్తుతం అమలులో ఉన్న రాగాలన్నీ ఇక్కడ నుండి పుట్టినవే.
త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలకు, అన్నమయ్య జాజిరి పాటలకు, భక్తరామదాసు భజన సాంప్రదాయానికి, కబీర్‌దాసు రామచరిత్ మానస్‌కు, ముత్తుస్వామిదీక్షితులు నవవర్ణకీర్తనలకు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆధునిక సంగీత కీర్తనలకు, ఎంఎస్ సుబ్బలక్ష్మీకర్ణాటక సంగీత రాగాలకు ఇంకా అనేకమంది లబ్దప్రతిష్టులైన సంగీత ప్రముఖులకు అంతర్జాతీయ కీర్తిని సంపాదించి పెట్టిన సంగీతంతో వారు కూడా బహుముఖంగా కీర్తింపబడ్డారు. వీరి భక్తిమార్గానికి సంగీతం ఆలంబన నిలిచింది. చక్కటి పదకూర్పుతో సంగీతాన్ని భక్తి మార్గానికి ఉపయోగించారు. త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షిత్తులు, శ్యామశాస్త్రిలను సంగీత త్రిమూర్తులు అంటారు. వీరి రచనలు ఒకరొది ద్రాక్షపాకం, ఇంకొకరిది కదిలీపాకం, మరోకరి నారీకేళపాకంలా ఉంటాయని ప్రతీతి. ఇంత గొప్పగా ఉంది కాబట్టే భారతీయ శాస్త్రీయ సంగీతం ప్రపంచ సంగీతానికే తలమానికంగా నిలబడింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి