AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్‌ను మించిన ముప్పు.. ముంచుకొస్తున్న మరో మహమ్మారి! వణుకుపుట్టించే విషయం చెప్పిన WHO

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరో మహమ్మారి తప్పనిసరిగా వస్తుందని హెచ్చరించింది. కోవిడ్-19 తో ప్రపంచం అనుభవించిన నష్టాన్ని గుర్తుచేస్తూ, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘ్యాబ్రియేసస్ రాబోయే ముప్పును ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మహమ్మారి ఒప్పందంపై ఏకాభిప్రాయం అవసరమని ఆయన అన్నారు.

కోవిడ్‌ను మించిన ముప్పు.. ముంచుకొస్తున్న మరో మహమ్మారి! వణుకుపుట్టించే విషయం చెప్పిన WHO
Covid 19
SN Pasha
|

Updated on: Apr 09, 2025 | 1:48 PM

Share

ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ఇది తప్పదని, ఎప్పుడైనా సంభవించవచ్చని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘ్యాబ్రియేసస్ వెల్లడించారు. కాబట్టి, సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. జెనీవాలో జరిగిన డబ్ల్యూహెచ్‌వో పాండమిక్ అగ్రిమెంట్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టెడ్రోస్ మాట్లాడుతూ.. కోవిడ్-19 మహమ్మారి ప్రపంచానికి కలిగించిన నష్టాన్ని గుర్తు చేశారు. పరిస్థితులు చక్కబడే వరకు మరో మహమ్మారి ఆగదని ఆయన అన్నారు. అది 20 ఏళ్ల తర్వాత లేదా రేపే రావచ్చు అని చెప్పారు. కానీ, కచ్చితంగా వస్తుందని, దానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇది సిద్ధాంతపరమైన ప్రమాదం కాదని, ఒక ఎపిడెమియోలాజికల్ కచ్చితత్వమని ట్రెడోస్ అన్నారు. కోవిడ్ వల్ల చాలా మంది చనిపోయారని, అలాగే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. కొవిడ్-19 మహమ్మారి సృష్టించిన విలయాన్ని అందరం చూశాం. అధికారికంగా 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ.. వాస్తవానికి ఆ సంఖ్య 2 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నాం. ప్రాణ నష్టంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 10 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నష్టాన్ని కలిగించింది.. 1918 నాటి ఫ్లూ మహమ్మారి 50 మిలియన్ల మందిని పొట్టనబెట్టుకుంది.. కరోనాతో పోల్చితే ఇది రెండింతలు అధికం’ అని టెడ్రోస్ అన్నారు.

మహమ్మారి ఒప్పందంపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి లక్ష్యం కోసం కలిసిరావాలనే బలమైన సంకేతం ప్రపంచానికి అవసరం.. ఈ ఒప్పందం ఏ దేశపు సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించదు. ఇది జాతీయ సార్వభౌమాధికారాన్ని, అంతర్జాతీయ చర్యను బలపరుస్తుంది’ అని టెడ్రోస్ హామీ ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా ఉంటే, మహమ్మారిని ఎదుర్కోవచ్చని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ పేర్కొన్నారు. రాబోయే ముప్పును ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.