AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కంటే డేంజరస్ వైరస్‌.. ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న ఎబోలా.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..

ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలో నమోదైన బుందిబుగ్యో ఎబోలా వైరస్ కేసులు, మరణాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే వందల సంఖ్యలో అనుమానిత కేసులు, 80కు పైగా మరణాలు నమోదయ్యాయని WHO వెల్లడించింది. ఈ వైరస్‌కు ఇప్పటివరకు నిర్దిష్టమైన వ్యాక్సిన్ లేదా చికిత్స లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

కరోనా కంటే డేంజరస్ వైరస్‌.. ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న ఎబోలా.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..
Ebola outbreak
Shaik Madar Saheb
|

Updated on: May 17, 2026 | 7:05 PM

Share

సముద్రంలో ఓ షిప్‌ని గిరాటేసి హంటా వైరస్‌ వెంటాడుతుంటే.. ఇంకోవైపు ఆఫ్రికా దేశాన్ని ఎబోలా షేక్ చేస్తోంది. ప్రాణాంతక వైరస్ జెట్‌స్పీడ్‌తో విస్తరిస్తోంది. ఇప్పటికే ఆ వైరస్ బారిన పడి 88 మంది చనిపోయారు.. 336మందికి వైరస్ సోకిందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌ ప్రకటించింది. తక్కువ సమయంలో ఎక్కువ మరణాలు, కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో.. ఉగాండాలో ఎబోలా వైరస్ అంతకంతకు విస్తరిస్తోంది. వైరస్ ఏకంగా రెండు ఆఫ్రికన్ రాజధానులకు చేరడం.. పైగా ఈ వైరస్‌కి ఎలాంటి చికిత్స లేకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని జారీచేసింది. సరిహద్దులు దాటి వైరస్ వ్యాపించడం.. మరణాల వెనుక స్పష్టమైన కారణాలు తెలియకపోవడం.. అధికారిక గణాంకాల కంటే వాస్తవంగా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో WHO ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ వైరస్.. అరుదైన బుందిబుగ్యో ఎబోలా వైరస్‌ రకానికి చెందింది. మానవ చరిత్రలో ఈ స్ట్రెయిన్ కారణంగా 2007లో ఉగాండా.. 2012లో తూర్పుకాంగోలో అంటువ్యాధులు వచ్చాయి. ఈ రెండు సందర్భాల్లో నమోదైన మొత్తం కేసుల కంటే ఈ ఒక్క ఏడాదిలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో చరిత్రలోనే అతి పెద్ద బుందిబుగ్యో ఎబోలా వ్యాప్తిగా రికార్డుల్లోకెక్కింది.

ఎబోలా వైరస్ లక్షణాలు..

విపరీతమైన జ్వరం.. నిరసం ఎక్కువగా ఉండటం.. గొంతు నొప్పి, కండరాల నొప్పి.. తలనొప్పి, వికారం, వాంతులతో పాటు కొన్ని సందర్భాల్లో తీవ్రమైన రక్తస్రావం అవుతూ ఉంటుంది.

ఎబోలా వైరస్ ముందుగా కాంగోలోని మారుమూల మైనింగ్ ప్రాంతాల్లో వెలుగుచూసింది. ఇప్పుడది ప్రధాన నగరాలకు విస్తరించింది. ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. మే 16నాటికి కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ల్యాబ్‌లో ధృవీకరించిన అనుమానిత కేసులు 336. అనధికారికంగా ఈ సంఖ్య అంతకుమించే ఉంటుందని తెలుస్తోంది.

కాంగో- ఉగాండా సరిహద్దుల్లోని గోల్డ్ మైన్ సిటీ మోంగ్‌బ్వా కేంద్రంగా ఎబోలా వ్యాప్తి కొనసాగుతోంది. ఇక్కడి కార్మికులు నిరంతరం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తుంటారు. ఈ ప్రాంతాల్లో నెలకొన్న అంతర్యుద్ధం.. అభద్రతాభావం.. ప్రజల వలసలు.. అధికారులపై స్థానికులకు ఉన్న అసంతృప్తి.. అపనమ్మకం కారణంగా కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం కష్టంగా మారింది. అయితే.. సరిహద్దులు మూసివేయడం.. లేదంటే ప్రయాణాలపై ఆంక్షలు విధించొద్దని WHO దేశాలకు సూచించింది. ఆంక్షలు విధిస్తే ప్రజలు దొంగచాటుగా సరిహద్దులు దాటి వైరస్‌ను మరింతగా వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

శరవేగంగా విస్తరిస్తున్న ఎబోలా వైరస్‌పై WHO ఎమర్జెన్సీ ప్రకటించినా.. భారత్‌లో ఎలాంటి కేసులు నమోదు కాలేదంటోంది కేంద్రం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది. ఎబోలా దేశాల నుంచి ఇండియాకు వచ్చే వాళ్లపై పరిశీలన ఉంటుందని.. అన్ని ఎయిర్‌పోర్టుల్లో ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని స్పష్టం చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us