AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia: అంతర్జాతీయ సమాజం విన్నపాలను ఏ మాత్రం పట్టించుకోని పుతిన్‌.. రష్యా యుద్ధోన్మాదానికి బలవుతున్న పసిపిల్లలు

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్య కొనసాగి తీరుతుందని రష్యా అధినేత పుతిన్‌ మరోమారు స్పష్టం చేశాడు. అంతర్జాతీయ సమాజం ఎంతగా బెదిరించినా, ఎన్ని ఆంక్షలు విధించినా లెక్క చేయబోమన్నారు.

Russia: అంతర్జాతీయ సమాజం విన్నపాలను ఏ మాత్రం పట్టించుకోని పుతిన్‌.. రష్యా యుద్ధోన్మాదానికి బలవుతున్న పసిపిల్లలు
Russia Ukraine War
Balu
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Apr 13, 2022 | 12:40 PM

Share

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్య కొనసాగి తీరుతుందని రష్యా అధినేత పుతిన్‌ మరోమారు స్పష్టం చేశాడు. అంతర్జాతీయ సమాజం ఎంతగా బెదిరించినా, ఎన్ని ఆంక్షలు విధించినా లెక్క చేయబోమన్నారు. ఆంక్షల దాడిని తట్టుకుని నిలబడగలిగే శక్తి సామర్థ్యాలు తమకు ఉన్నాయన్నారు. రష్యాపై విధించిన ఆంక్షలు చివరాఖరికి బూమరాంగ్‌ అవుతాయని, నష్టపోయేది ప్రపంచ దేశాలేనని చెప్పుకొచ్చారు. రష్యా, బెలారస్‌ ఎరువుల ఎగుమతులపై నిషేధించం విధించడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వాటి ధరలు పెరుగుతాయని, పర్యవసానంగా అంతర్జాతీయ ఆహార కొరతకు, వలసలకు దారి తీస్తుందని పుతిన్‌ వివరించారు. ప్రపంచ దేశాలతో కలిసిమెలిసి ఉండాలన్నదే తమ అభిమతమని, కాకపోతే కొన్ని విదేశీ శక్తులు తమను ఏకాకిని చేయాలనుకుంటున్నాయని, వారి కోరిక ఏనాటికి నెరవేరబోదని పుతిన్‌ అన్నారు. రష్యా వంటి అతి పెద్ద దేశాన్ని ఒంటరి చేయడం దుర్లభమన్నారు. తమకు సహకరించే దేశాలతో కలిసి పని చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా పశ్చిమ దేశాలు వాస్తవ పరిస్థితులను తెలుసుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఉక్రెయిన్‌లో నయా నాజీయిజం, జాతీయ అతివాదం పెరిగిపోయాయని, ఈ కారణంగానే తమ దేశ భద్రత కోసమే ఉక్రెయిన్‌పై సైనిక చర్య తీసుకోవలసి వస్తున్నదని తెలిపారు. ఇంతకు మించి తమకు మరో ప్రత్యామ్నాయం లేదన్నారు.

అంతర్జాతీయ సమాజం ఎంతగా చెప్పిచూస్తున్నా పుతిన్‌ పట్టించుకోవడం లేదు. తన తప్పేమీ లేదంటున్నారు. ఉక్రెయిన్‌ వెనకడుగు వేయడం వల్లే చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందని అంటున్నారు. తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రజలకు ఆదుకోవడమే తమ లక్ష్యమని, అక్కడి ప్రజల సమస్యలకు శాంతియుత పరిష్కారం చూపేందుకు ఉక్రెయిన్‌ నిరాకరిస్తున్నదని పుతిన్‌ వివరించారు. అయితే పుతిన్‌ చెబుతున్నదంతా అవాస్తవమని అంటోంది ఉక్రెయిన్‌. తన యుద్ధోన్మాదంతో చెలరేగిపోతున్న పుతిన్‌ తన దుందడుగు చేష్టలను సమర్థించుకోవడానికి తప్పంతా అవతలివారి మీద నెట్టివేస్తున్నారని ఉక్రెయిన్‌ ఆరోపిస్తుంది. పశ్చిమ దేశాల అభిప్రాయం కూడా ఇలాగే ఉంది. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాయి. అమాయక ప్రజల ఉసురు తీసుకుంటున్నారని మండిపడుతున్నాయి. ఉక్రెయిన్‌ను మరుభూమిగా మార్చాలనుకుంటున్నారని తిట్టిపోస్తున్నాయి. యుద్ధం కారణంగా ఎంతో మంది ఉక్రెయిన్‌ను వదిలి పరాయి దేశాలలో తలదాచుకుంటున్నారని చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌లోని మేరియుపోల్ నగరంపై రష్‌యా రసాయిన దాడి జరిపించిదన్న వార్తలు ప్రపంచదేశాలను ఉలిక్కిపడేలా చేశాయి. మానవ రహిత విమానం ద్వారా విష పదార్థాన్ని రష్యా సైన్యం జారవిడిచిందని అమెరికాకు చెందిన సీఎన్‌ఎన్‌ చానెల్‌ పేర్కొంది. ఉక్రెయిన్‌ అధ్యక్ష్‌ఉడు జెలెన్‌స్కీ మాత్రం రసాయన దాడిపై పెదవి విప్పడం లేదు. ఒకవేళ రష్యా నిజంగానే రసాయనదాడికి పాల్పడితే మాత్రం తదుపరి ఏం చేయాలో తమకు తెలుసని ఇంగ్లాండ్‌ అంటోంది.

రష్యా అధినేత పుతిన్‌ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్‌ దాసోహమని అనేంత వరకు సైనిక చర్యను కొనసాగించాలనే అనుకుంటున్నారు. యుద్ధంపై చాలా సీరియస్‌గా ఉన్నారాయన. ఎంతగా అంటే యుద్ధ సమాచారాన్ని పాశ్చాత్య దేశాలకు అందించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న 150 మందికి పైగా సైనిక, నిఘా ఉన్నతాధికారులను అదుపులోకి తీసుకునేటంతగా! ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగిన కొద్ది గంటల్లోనే రష్యా యుద్ధ ప్రణాళికలను ఇంగ్లాండ్‌ ట్విట్‌ చేసింది. ఇంగ్లాండ్‌కు ఈ సమాచారం తెలియడం పుతిన్‌కు కోపం తెప్పించింది. అందుకే 150 మందిని అరెస్ట్‌ చేయించారు. వీరందరిని మాస్కోలో ని లెఫోర్టోవ్‌ జైలుకు తరలించారు. స్టాలిన్‌ కాలంలో నిర్మించిన ఈ జైలు అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. ఇందులోంచి తప్పించుకోవడం దాదాపుగా అసాధ్యం. ఈ వ్యవహారంపై మిలటరీ కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ విభాగం దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని పలు నగరాలు శిథిలాలుగా మారాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు చాలా మంది దేశం వదిలి వెళ్లిపోయారు. యుద్ధం ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపు 48 లక్షల మంది చిన్నారులు శరణార్ధులుగా మారిపోయారు. ఉక్రెయిన్‌లో సుమారు 75 లక్షల మంది చిన్నారులు ఉండి ఉంటారని, ఇందులో 48 లక్షల మంది చిన్నారులు చిన్నాభిన్నం అయ్యారని ఐక్యరాజ్యసమితి అంటోంది. ఉక్రెయిన్‌లో ఉన్న మూడో వంతు మంది చిన్నారులు తమ ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారని యూనిసెఫ్‌ అంటోంది. యుద్ధంలో 142 మంది పిల్లలు మరణించారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఉన్న 32 లక్షల మంది చిన్నారుల్లో సగం మందికి తిండి దొరకడం లేదు. మారియపోల్‌, ఖేర్సన్‌ నగరాలలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

Also Read:

ఇంకా ఎంత మంది రష్యా సైనికులు చనిపోవాలి?.. పుతిన్‌ను ప్రశ్నించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

Largest Comet: ముప్పు తప్పదా..! భూమి వైపు దూసుకొస్తున్న భారీ తోకచుక్క.. నాసా అలర్ట్..