Russia’s invasion of Ukraine: మరో నియంతగా మారుతున్న వ్లాదిమిర్ పుతిన్.. ఒళ్లు గగుర్పొడిచేలా అతని చర్యలు..!

Russia President Putin: వ్లాదిమిర్ పుతిన్.. రష్యా అధ్యక్షుడే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరు. ఆయన మాత్రమే స్ట్రాంగ్ కాదు.. ఆయన నిర్ణయాలు..

Russia’s invasion of Ukraine: మరో నియంతగా మారుతున్న వ్లాదిమిర్ పుతిన్.. ఒళ్లు గగుర్పొడిచేలా అతని చర్యలు..!
Putin
Follow us

|

Updated on: Feb 24, 2022 | 6:38 PM

Russia President Putin: వ్లాదిమిర్ పుతిన్.. రష్యా అధ్యక్షుడే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరు. ఆయన మాత్రమే స్ట్రాంగ్ కాదు.. ఆయన నిర్ణయాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తాయి. ఇందుకు నిదర్శనమైన ఘటనలు పూర్వం అనేకం ఉన్నప్పటికీ.. తాజాగా ఉక్రేయిన్‌పై దాడిని ఆయనను నియంతగా మార్చేస్తోంది. అవును.. రష్యా అధ్యక్షుడు పుతిన్ మరో నియంతగా పరిణమిస్తున్నారంటూ యావత్ ప్రపంచం నిందిస్తోంది. దానికి కారణం ఉక్రెయిన్‌పై యుద్ధమే అని ప్రాథమికంగా చెప్పవచ్చు. ప్రభుత్వ పాలనలోనే కాకుండా అన్ని అంశాల్లోనూ కఠినంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించే పుతిన్ గురించి కీలక వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…

పుతిన్ ప్రస్థానం.. వ్లాదిమిర్ పుతిన్ 7 అక్టోబర్ 1952లో జన్మించారు. 2012 మే 7 నుంచి రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతంలో 2000 నుంచి 2008 వరకు అధ్యక్షుడిగా, 2008 నుండి 2012 వరకు రష్యా ప్రధాన మంత్రిగా పనిచేశారు. అధ్యక్షుడు కాకముందు బోరిస్ యెల్ట్సిన్ హయంలో 1999 నుండి 2000 వరకు ప్రధానిగా పని చేశాడు పుతిన్.

చైనా బాటలోనే… నిజానికి రష్యా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవిలో రెండు పర్యాయాలకు మించి కొనసాగటానికి వీలులేదు. ఈ కారణంతో 2008లో అధ్యక్ష పదవి నుంచి దిగినప్పటికీ, ప్రధాన మంత్రి పదవి చేపట్టి తన చెప్పుచేతల్లో ఉండే మెద్వెదేవ్‌ను అధ్యక్షుడిగా ఎన్నియ్యేట్లు చక్రం తిప్పాడు పుతిన్. అలా తన హవా తగ్గకుండా చూసుకున్నాడు. అయితే, పదవీకాంక్షతో రగిలిపోయిన పుతిన్.. ఆ సమయంలో అధ్యక్షుడి పదవీకాలాన్ని నాలుగేళ్ల కాలం నుంచి ఆరేండ్లకు పెంచుతూ రాజ్యాంగ సవరణ తీసుకువచ్చారు. 2012 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో పుతిన్ మరోసారి అధ్యక్షుడు కాగా.. మెద్వెదేవ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. అనంతరం దేశంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో అధ్యక్షుడిగా పుతిన్‌ మరింతగా బలపడిపోయారు. 2021లో జరిగిన ఎన్నికల్లో పుతిన్‌కు చెందిన అధికార ‘యునైటెడ్ రష్యా పార్టీ’ భారీ విజయం సాధించింది.

450 స్థానాలున్న రష్యన్‌ డ్యూమా (పార్లమెంటు దిగువ సభ)లో పాలక పార్టీకి మూడింట రెండొంతుల మెజార్టీ లభించింది. మొత్తం పోలైన ఓట్లలో అధికార పార్టీ 49.8శాతం దక్కించుకోగా, 19 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది రష్యా కమ్యూనిస్ట్ పార్టీ. పుతిన్‌ అధ్యక్ష పదవీకాలం 2024కి ముగియనుంది, కానీ అధికారం నుంచి వైదొలగడానికి ఇష్టపడని పుతిన్‌, మరో 12ఏళ్లు తానే అధ్యక్షుడిగా కొనసాగేందుకు వీలుగా చేసిన రాజ్యాంగ సవరణను తీసుకొచ్చారు. 2020 మార్చిలోనే రష్యా పార్లమెంట్‌‌తో ఆమోద ముద్ర వేయించుకున్నారు. ఈ సవరణలకు 383 అనుకూల ఓట్లు రాగా, వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడకపోవడం గమనార్హం. 43 మంది పార్లమెంట్ సభ్యులు హాజరు కాలేదు. ఈ రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌తో పుతిన్ 2036 వ‌ర‌కు ర‌ష్యా అధ్యక్షుడి ప‌ద‌విలో కొన‌సాగే అవకాశం ఉంది. మొత్తానికి పుతిన్ కూడా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మార్గంలో తాను శాశ్వత అధ్యక్షుడిగా ఉండాలని భావిస్తున్నారు.

ప్రతిపక్షం ఉందా..? రాజకీయంగా తనకు అడ్డు ఉండొద్దనే ఉద్దేశంతో విపక్షాల పట్ల క్రూరంగా వ్యవహరించారు పుతిన్. దేశంలో ప్రతిపక్ష పార్టీలు బలపడకుండా అణచివేత విధానాలు అవలంబించాడు. గత ఎన్నికల్లో అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడినట్టు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేశాయి. కానీ, అవేవీ లెక్కకు రాలేదు. ప్రస్తుతం ‘రష్యా కమ్యూనిస్ట్ పార్టీ’ దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కానీ అనేక సందర్భాల్లో ఇది పుతిన్‌ కు మద్దతుగా నిలుస్తోంది. గత కొన్నేళ్లుగా దేశంలో పుతిన్‌పై వ్యతిరేకత పెరిగినట్లు సూచనలు కనిపిస్తున్నాయి. ‘రష్యా ఆఫ్ ద ఫ్యూచర్’ పార్టీకి చెందిన అలెక్సీ నావల్నీ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బలమైన ప్రత్యర్థిగా మారాడు. అన్‌ రిజిస్టర్డ్‌ పార్టీగా ఉండి పార్లమెంటులో ప్రాతినిథ్యం లేనప్పటికీ పుతిన్‌కు కంటిలో నలుసులా మారింది నావల్నీ పార్టీ. ఈ క్రమంలోనే 2020 అగస్టులో ప్రతిపక్ష నేత నావల్నీపై విషప్రయోగం జరిగినట్టుగా ఆరోపణలు వచ్చాయి. సైబీరియా నుంచి మాస్కోకి తిరిగివస్తుండగా, మార్గమధ్యంలో విమానంలో బాత్రూంకి వెళ్లి అపస్మారకస్థితిలో కింద పడిపోయాడు నావల్నీ. నావల్నీ ప్రయాణిస్తున్న విమానం ఓమ్స్క్ నగరంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. అపస్మారకస్థితిలో ఉన్న నావల్నీకి వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించారు వైద్యులు. నావల్నీ బోర్డింగ్ సమయంలో ఎయిర్‌పోర్టులో టీ తాగారని, ఆ టీలోనే విషం కలిపి ఉంటారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. నావల్నీపై నాడీ వ్యవస్థను దెబ్బ తీసే ‘నోవిచోక్’ విష ప్రయోగం కచ్చితంగా జరిగిందనీ, అతన్ని హతమార్చడానికి ప్రయత్నించారనీ, ఈ చర్యలను ఖండిస్తున్నామని జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ ప్రకటించారు.

బలమైన నేతగా ఎదిగిన అలెక్సీ నావల్నీ.. అవినీతి వ్యతిరేక ఉద్యమాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్లో బలమైన నేతగా ఎదిగారు అలెక్సీ నావల్నీ. అధ్యక్షుడు పుతిన్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ పలుమార్లు జైలుకు కూడా వెళ్ళాడు. ఇక ప్రత్యర్థులు నావల్నీపై పలుమార్లు దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో కూడా ఒకసారి నావల్నీపై విష ప్రయోగం జరిగింది. అధ్యక్షుడు పుతిన్‌ విష ప్రయోగం చేయించారని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. ఆ సమయంలో నావల్నీని జర్మనీకి తరలించి చికిత్స అందించారు అధికారులు. 17 జనవరి, 2012న మాస్కోకు తిరిగి వచ్చాడు అలెక్సీ నావల్నీ. అయితే, ఇటీవల ఉగ్రవాద, మనీ లాండరింగ్ కేసులలో అలెక్సీ నావల్నీని రష్యా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైలు జీవితం గడుపుతున్న నావల్నీ ఆరోగ్యం క్షీణించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

విమర్శకులపై విష ప్రయోగం.. గతంలో కూడా రష్యా ప్రభుత్వాన్ని విమర్శించిన కొందరిపై విష ప్రయోగాలు జరిగాయి. 2018 లో రష్యా గూఢచారి సెర్గై స్క్రిపల్, అతని కూతురిపై కూడా ఈ విష ప్రయోగం జరిగింది. అలాగే రష్యా ఇంటెలిజెన్స్ సేవలను తీవ్రంగా విమర్శించిన ప్యోటర్ వెర్జిలోవ్‌పై కూడా అదే సంవత్సరం ‘నోవిచోక్’ విష ప్రయోగం జరిగింది. వీరంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇదంతా పుతిన్ డైరెక్షన్‌లోనే జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటలన ఆధారంగా పుతిన్ ఒక నియంతగా పరిణమిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు.

Also read:

Gold Rates Hike: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. ఒక్కసారిగా జంప్ అయిన గోల్డ్ రేట్.. ప్రస్తుత ధర ఎంతంటే..!

Viral Video: ప్రపంచం మొత్తం చూపు ఆ జర్నలిస్ట్ పైనే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఆరు భాషల్లో న్యూస్..

Ajith’s Valimai : వలిమై థియటర్ వద్ద పెట్రోల్ బాంబు దాడి.. అజిత్ ఫ్యాన్స్‌కు తీవ్రగాయాలు