AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా విద్యార్థి వీసాల జాప్యం.. కోర్సులు ప్రారంభమయ్యే టైమ్‌కి అమెరికా చేరుకుంటారా?

రాబోయే 2026 ఫాల్ (Fall) సెమిస్టర్ ప్రారంభం కావడానికి కేవలం కొన్ని వారాల సమయం మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో, అమెరికా వీసా అపాయింట్‌మెంట్లు దొరక్క భారతీయ విద్యార్థులు ఆందోళన చెందడం పై 30 మంది సెనేటర్లు మార్కో రుబియోకు లేఖ రాసారు

అమెరికా విద్యార్థి వీసాల జాప్యం.. కోర్సులు ప్రారంభమయ్యే టైమ్‌కి అమెరికా చేరుకుంటారా?
Us Student Visa Delays
Sharada V
|

Updated on: Aug 22, 2026 | 8:21 PM

Share

లక్షలాది మంది భారతీయ విద్యార్థుల ‘అమెరికన్ డ్రీమ్’ ఇప్పుడు ఒక్కసారిగా ఊగిసలాటలో పడింది. డాలర్ కలలను నెరవేర్చుకోవడానికి, ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఊహించని షాక్ తగిలింది. రాబోయే 2026 ఫాల్ (Fall) సెమిస్టర్ ప్రారంభం కావడానికి కేవలం కొన్ని వారాల సమయం మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో, అమెరికా వీసా అపాయింట్‌మెంట్లు దొరక్క వేలాది మంది భారతీయ విద్యార్థులు ఆందోళనలో పడ్డారు!

30 మంది సెనేటర్లు ఆందోళన

భారతీయ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్‌ విజిటర్లు విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా అమెరికా చేరుకోలేకపోయే పరిస్థితి తలెత్తవచ్చని 30 మంది అమెరికా సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కాలిఫోర్నియాకు చెందిన సెనేటర్ అలెక్స్‌ పడిల్లా నేతృత్వంలో 29 మంది సహచర సెనేటర్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోకు లేఖ రాశారు. కొన్ని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో విద్యార్థులకు సమయానుకూలంగా వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లు లభించడం లేదని తమకు సమాచారం అందిందని లేఖలో రాశారు.

సోషల్‌ మీడియా వెట్టింగ్‌  కారణమా?

ఎఫ్‌, ఎం, జే వీసా దరఖాస్తుదారులపై ఆన్‌లైన్‌ ప్రెజెన్స్‌ సమీక్షను అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటికే అమలు చేస్తోంది. దరఖాస్తుదారులు తమ సోషల్‌ మీడియా ప్రొఫైళ్లను ‘పబ్లిక్‌’ లేదా ‘ఓపెన్‌’గా ఉంచాలని శాఖ సూచించింది. వీసా పరిశీలనలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి జాతీయ భద్రత, ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. వీసా వెట్టింగ్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన సిబ్బంది, వనరులను కేటాయించాలని సెనేటర్లు కోరుతున్నారు. ఆలస్యాలకు కారణాలు ఏమిటి, వాటిని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే విషయాలపై 30 రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని వారు రూబియోను కోరారు.

భారతీయ విద్యార్థులపై ప్రభావం

ఈ పరిణామం ముఖ్యంగా ఫాల్‌ 2026 అడ్మిషన్ల కోసం అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్న భారతీయ విద్యార్థుల్లో ఆందోళన పెంచుతోంది. 2024-25 విద్యా సంవత్సరంలో అమెరికాకి సుమారు 3.6 లక్షల మంది భారతీయ విద్యార్థులు వెళ్లారు. అంతర్జాతీయ విద్యార్థులు అమెరికా విశ్వవిద్యాలయాలకు మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా కీలకమని సెనేటర్లు అన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో అంతర్జాతీయ విద్యార్థుల ద్వారా అమెరికా స్థానిక ఆర్థిక వ్యవస్థలకు దాదాపు 43 బిలియన్‌ డాలర్ల ఆర్థిక ప్రయోజనం కలిగిందని, 3.55 లక్షలకు పైగా అమెరికన్‌ ఉద్యోగాలకు మద్దతు లభించిందని వారు తెలిపారు. వీసా అపాయింట్‌మెంట్లు, వెట్టింగ్‌, ప్రాసెసింగ్‌లో కొనసాగుతున్న సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే విద్యార్థులు మాత్రమే కాకుండా అమెరికా విశ్వవిద్యాలయాలు, పరిశోధనా రంగం, ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని సెనేటర్లు లేఖలో హెచ్చరించారు.

Follow Us