AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘గోల్డ్‌ బిస్కెట్’ మింగిన చిన్నారి.. ఆస్పత్రిలో అత్యవసర చికిత్స.. చైనాలో వింత ఘటన

చైనాలో బాలిక ఏకంగా అసలైన ప్యూర్ గోల్డ్ బార్‌ను మింగేసి తల్లితండ్రుల్ని పరుగులు పెట్టించింది. ఎక్స్-రే తీయగా బంగారు కడ్డీ కడుపు లోపల ఇరుక్కుపోయినట్లు తెలిసింది. ఈ ఘటన వైరల్‌గా కావడంతో అంత బంగారం పాపకు అందుబాటులో ఎందుకుంచారు అని నెట్టిజన్లు ప్రశ్నిస్తున్నారు!

'గోల్డ్‌ బిస్కెట్' మింగిన చిన్నారి.. ఆస్పత్రిలో అత్యవసర చికిత్స.. చైనాలో వింత ఘటన
Chinese Girl In Critical Condition After Swallowing Gold Bar
Sharada V
|

Updated on: Aug 22, 2026 | 4:40 PM

Share

పిల్లలు రూపాయి కాయిన్, గోళీలు వంటి చిన్న వస్తువులు మింగడం చూస్తాం. కానీ చైనాలో ఓ చిన్నారి ఏకంగా 50 గ్రాముల గోల్డ్ బిస్కెట్‌ని లంచ్ లాగా మింగేసింది! అసలైన ప్యూర్ గోల్డ్ బార్‌ను మింగేసి తల్లితండ్రుల్ని పరుగులు పెట్టించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా కావడంతో అంత బంగారం పాపకు అందుబాటులో ఎందుకుంచారు అని నెట్టింట చర్చించుకుంటున్నారు! అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఆస్పత్రికి తరలించగా వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు.

ఉత్తర చైనాలో ఐదేళ్ల బాలిక ఇంట్లో ఆడుకుంటూ 50 గ్రాముల బరువున్న చిన్న బంగారు కడ్డీని అకస్మాత్తుగా మింగేసింది. విషయం తెలిసిన వెంటనే కంగారుపడిన తల్లిదండ్రులు పాపను సమీపంలోని క్లినిక్‌కు తీసుకెళ్లారు. అయితే జీర్ణ కోశంలో చిక్కుకున్న వస్తువును ఎండోస్కోపీ ద్వారా బయటకు తీసే సదుపాయం లేకపోవడంతో బాలిక పరిస్థితి విషమించింది.  అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఆస్పత్రికి తరలించగా  పాపకు వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు.

‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ కథనం ప్రకారం… ఉత్తర చైనాకు చెందిన బాలిక తన ఇంట్లో సరదాగా ఆడుకుంటూ, 4 సెంటీమీటర్ల పొడవు, 50 గ్రాముల బరువున్న బంగారు కడ్డీని ప్రమాదవశాత్తూ మింగేసింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని క్లినిక్‌కు పరుగులు తీశారు. అయితే అత్యవసర వైద్య సౌకర్యాలు లేకపోవడంతో బాలికను 6 గంటలు ఆలస్యంగా ‘బీజింగ్ చిల్డ్రన్స్ హాస్పిటల్’కు తరలించారు.

వైద్యులు చిన్నారికి  ఎక్స్-రే తీయగా బంగారు కడ్డీ కడుపు లోపల ఇరుక్కుపోయినట్లు తెలిసింది. బంగారు కడ్డీ గట్టిగా, బరువుగా ఉండటం వల్ల జీర్ణాశయ పొరను గీరి, అంతర్గత రక్తస్రావం జరిగేందుకు అవకాశం ఉందని అదే జరిగితే అది అత్యంత ప్రమాదకర పరిస్థితికి దారి తీయవచ్చని అన్నారు. అంతేకాకుండా, శస్త్రచికిత్స చేయడానికి జీర్ణాశయంలోని ఆ ప్రాంతం ఇరుకుగా ఉందనీ చిన్న పొరపాటు జరిగినా అవయవాలు దెబ్బతినే రిస్క్‌ ఉందనీ తెలిపారు. అయితే వైద్యుల బృందం అత్యంత చాకచక్యంగా ఎండోస్కోపీ పరికరంతో కొద్ది నిమిషాల్లోనే బంగారు బిస్కెట్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకోవడంతో తల్లిదండ్రులు, వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ వింత ఘటన వైరల్‌ కావడంతో నెటిజన్లు కామెంట్లతో హోరెత్తించారు. ఐదేళ్ల చిన్నారి చేతికి 50 గ్రాముల బంగారాన్ని అంత సులభంగా అందేలా ఇంట్లో పెట్టారంటే ఆ కుటుంబం ఎంతటి శ్రీమంతులై ఉండాలి అని ఒక నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేసారు.  చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో విలువైన, ప్రమాదకరమైన వస్తువులను వారి చేతికి అందకుండా పెద్దలు ఎంతో బాధ్యతతో మెలగాలని మరికొందరు హితవు పలికారు. సాధారణంగా చైనాలో పిల్లల పెంపకానికి అయ్యే విపరీతమైన ఖర్చును ఉద్దేశించి సరదాగా  “బంగారాన్ని తినే రాక్షసులు” అని పిలుస్తుంటారు. చిన్నారి ఆ నానుడిని మరీ అంత సీరియస్‌గా తీసుకుని నిజంగానే బంగారం మింగేసిందేమిటని నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానించారు.

Follow Us