ఐస్‌క్రీమ్ కోన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా.. 120 ఏళ్ల క్రితం ఎలా పుట్టిందో తెలిస్తే అవాక్కే..
పిల్లల నుంచి పెద్దల దాకా అందరి ఫేవరెట్ డెజర్ట్ ఐస్‌క్రీమ్. కప్పులు, స్టిక్స్ కంటే చేతిలో కోన్ పట్టుకుని నడుస్తూ తినడంలో ఉండే మజాయే వేరు. కానీ ఒకప్పుడు ఐస్‌క్రీమ్‌ను కేవలం గాజు ప్లేట్లు, చెంచాలతోనే తినేవారని మీకు తెలుసా? నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఆకట్టుకుంటున్న ఐస్‌క్రీమ్ కోన్ ప్లాన్ చేసి కనిపెట్టింది కాదు.. ఒక ఎగ్జిబిషన్‌లో అనుకోకుండా పుట్టుకొచ్చిన ఒక అద్భుతమైన ఐడియా.

ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టంగా తినేది ఐస్‌క్రీమ్. అయితే ఒకప్పుడు ఇది సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేది కాదు. కేవలం రాజులు, నవాబులు, సంపన్నుల విందుల్లో మాత్రమే కనిపించే రాయల్ డెజర్ట్. మంచును ఎక్కువ కాలం నిల్వ చేయడం కష్టంగా ఉండటమే ఇందుకు కారణం. ఆ తర్వాత రిఫ్రిజిరేషన్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఐస్‌క్రీమ్ సామాన్యులకూ చేరువైంది. కానీ నేడు మనం ఎంతో ఇష్టంగా తినే ఐస్‌క్రీమ్ కోన్ ఎలా పుట్టిందో తెలుసా? ఒక ఎగ్జిబిషన్‌లో అనుకోకుండా జరిగిన చిన్న సమస్యే ప్రపంచవ్యాప్తంగా కోన్ విప్లవానికి నాంది పలికింది. 20వ శతాబ్దం ప్రారంభం వరకు ఐస్‌క్రీమ్‌ను గాజు ప్లేట్లు లేదా చిన్న చిన్న కప్పుల్లో పెట్టి స్పూన్లతో మాత్రమే వడ్డించేవారు. తిన్న తర్వాత ఆ పాత్రలను మళ్లీ కడిగి వాడాల్సి వచ్చేది. రోడ్డుపై నడుస్తూ ఐస్‌క్రీమ్ తినడం అప్పట్లో అస్సలు సాధ్యమయ్యేది కాదు. అయితే 1904లో జరిగిన ఒక సంఘటన ఐస్‌క్రీమ్ రూపురేఖలనే పూర్తిగా మార్చేసింది.
ప్లేట్లు అయిపోయాయి.. కోన్ పుట్టుకొచ్చింది
ఐస్‌క్రీమ్ కోన్ ఆవిర్భావానికి సంబంధించి అత్యంత ప్రాచుర్యం పొందిన కథ 1904 నాటి అమెరికాలోని సెయింట్ లూయిస్ వరల్డ్ ఫెయిర్‌తో ముడిపడి ఉంది. ఆ ఎగ్జిబిషన్‌కు దాదాపు 2 కోట్ల మంది ప్రజలు వచ్చారు. రద్దీ ఎక్కువై ఐస్‌క్రీమ్ విక్రేత దగ్గర వడ్డించడానికి ప్లేట్లు, పాత్రలు అయిపోయాయి. అతడి పక్కనే సిరియాకు చెందిన ఎర్నెస్ట్ హామ్వీ అనే వ్యాపారి సన్నని వేఫర్ పేస్ట్రీలను అమ్ముతున్నాడు. ఐస్‌క్రీమ్ వ్యాపారి ఇబ్బందిని గమనించిన హామ్వీ, తన వేఫర్‌ను శంకువు ఆకారంలో చుట్టి, అందులో ఐస్‌క్రీమ్ స్కూప్ వేసి కస్టమర్లకు ఇచ్చాడు. ఈ ఐడియాకు జనం ఫిదా అయ్యారు. తిన్న తర్వాత పారేయాల్సిన పనిలేకుండా పాత్రతో సహా తినేసేలా ఉండటంతో ఈ వేఫర్ కోన్ విపరీతమైన ఆదరణ పొందింది. అప్పట్లో దీనిని కార్నుకోపియా అని పిలిచేవారు. ఆ తర్వాత హామ్వీ స్వయంగా మిస్సౌరీ కోన్ కంపెనీని స్థాపించి పెద్ద వ్యాపారవేత్తగా మారారు.
ఇటాలో మార్చియోని పేటెంట్ వివాదం
కోన్ ఆవిష్కరణపై మరో వాదన కూడా ఉంది. ఇటలీకి చెందిన ఇటాలో మార్చియోని అనే వ్యక్తి 1903లోనే పిండితో తినదగిన చిన్న కప్పులను తయారు చేసే మెషీన్ కోసం పేటెంట్ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అవి ఇప్పటి కోన్లలా కాకుండా చిన్న చిన్న హ్యాండిల్స్ ఉన్న కప్పుల మాదిరిగా ఉండేవి. కోన్ ప్రజాదరణ పొందాక మార్చియోని న్యాయపోరాటం చేసినా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు మాత్రం హామ్వీ వేఫర్ కోన్‌కే దక్కింది.
అంతేకాకుండా 1900 కంటే ముందే ఫ్రాన్స్, జర్మనీలలో కాగితాలు, లోహాలతో పాటు కొన్ని రకాల పదార్థాలతో చేసిన కోన్లలో ఐస్‌క్రీమ్ అమ్మేవారని మరికొన్ని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా.. ఒక ప్రదర్శనలో ప్లేట్లు అయిపోవడంతో వచ్చిన చిన్న ఆలోచన, నేడు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్ల ఐస్‌క్రీమ్ కోన్ ఇండస్ట్రీగా అవతరించింది.
