నా దృష్టిలో హర్మూజ్ అమెరికా భూభాగమే: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఇరాన్ ఆర్థిక రంగాన్ని దెబ్బతీసే దిశగా వాషింగ్టన్ కఠిన కొత్త ఆర్థిక ఆంక్షలను ప్రకటించడానికి సిద్ధమవుతున్న తరుణంలో, ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అత్యంత వ్యూహాత్మకమైన 'హార్ముజ్ జలసంధి' ని ప్రస్తుతం తాను 'అమెరికా భూభాగం'గానే పరిగణిస్తున్నానని ఆయన ప్రకటించారు.

ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ సముద్ర మార్గంపై ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి! అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న వైరం మధ్య అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్యతో తీవ్ర అలజడి ప్రారంభమైంది! ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని తయారు చేయకుండా అమెరికా అడ్డుకుందని, ఆ దేశం ఇప్పుడు డీల్ కోసం ఆరాటపడుతోందని దక్షిణ కరోలినాలో జరిగిన ఓ ర్యాలీలో ట్రంప్ పాల్గొని కామెంట్ చేసారు. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో తాము విధించిన మిలిటరీ దిగ్బంధం వల్ల ఆ మార్గంపై తమకు “పూర్తి నియంత్రణ” ఉందని అన్నారు. “ప్రస్తుతం హార్ముజ్ జలసంధి అమెరికా సొంత భూభాగంగా మారింది… మా అనుమతి లేనిదే ఏ నౌకా అక్కడ కదలలేదు” అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
చైనాకు పడనున్న బిగ్ షాక్!
ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలను ప్రకటించడానికి వాషింగ్టన్ శరవేగంగా అడుగులు వేస్తోంది. అయితే ఈసారి ఆంక్షల కత్తి కేవలం ఇరాన్‌పైనే కాదు… ఆ దేశానికి ఆర్థికంగా కొండంత అండగా నిలుస్తున్న చైనా వంటి ప్రధాన భాగస్వామ్య దేశాలపై కూడా పడనుండటం తీవ్ర కలకలం రేపుతోంది! గత ఏడాది ఇరాన్ సముద్ర మార్గం గుండా ఎగుమతి చేసిన ముడి చమురులో 80 శాతానికి పైగా ఒక్క చైనానే కొనుగోలు చేసింది! చైనా కొనుగోళ్లు ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారంగా నిలుస్తోంది. ఇప్పుడు ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే మార్గాలను పూర్తిగా మూసివేసి, చైనాని కూడా ఇరుకున పెట్టాలని వాషింగ్టన్ వ్యూహాలు రచిస్తోంది.
ఒకవైపు ఇరాన్‌ను ఆర్థికంగా దిగ్బంధించడం, మరోవైపు చైనాతో ఆర్థిక యుద్ధానికి తెరలేపడం… అగ్రరాజ్యం అమెరికా వేస్తున్న ఈ పాచికలు గ్లోబల్ మార్కెట్‌లో ఎలాంటి అలజడిని సృష్టిస్తాయో వేచి చూడాలి! మరో వైపు ట్రంప్ ఆంక్షల ప్రకటనకు ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘయీ దీటుగా కౌంటర్ ఇచ్చారు . ‘ఒక దేశ పరిధిలో పనిచేస్తున్న బ్యాంకులు, సంస్థలు ఇతర దేశాలతో వ్యాపారం చేయకూడదని అడ్డుకునే హక్కు అమెరికాకు ఎక్కడిది? ఇది వలసవాదం కిందే వస్తుంద’ ని ఇస్మాయిల్ విమర్శించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం సెకండరీ ఆంక్షలు చెల్లవనీ అప్పడది అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణగా కాకుండా అన్ని దేశాలపై యుద్ధం ప్రకటించినట్లు అవుతుందని హెచ్చరించారు. అగ్రరాజ్యం ఆర్థిక ఆంక్షలకు దీటుగా బదులిస్తామన్నారు.