Indian Rupee: భారత కరెన్సీకి అరుదైన ఘనత.. అమెరికన్ డాలర్, యూరోలకు షాక్..!
భారత రూపాయి నోట్లు డాలర్, యూరోల కంటే గణనీయంగా అధిక సంఖ్యలో చలామణిలో ఉన్నాయి. ఇది వాటి విలువలో కాకుండా కేవలం సంఖ్యలో మాత్రమే ఆధిక్యత. భారతదేశంలో చిన్న విలువ నోట్ల వాడకం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నప్పటికీ, మొత్తం నగదు చలామణి తగ్గకుండా రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోంది – దీనిని 'క్యాష్ పారడాక్స్' అంటారు. ఆర్‌బీఐకి నోట్ల ముద్రణ, నిర్వహణ భారీ సవాలుగా మారింది.

భారత రూపాయి మరో ఆసక్తికరమైన ఘనత సాధించింది. అయితే ఇది రూపాయి విలువ పెరగడం గురించి కాదు. ప్రపంచవ్యాప్తంగా చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల సంఖ్యలో భారత రూపాయి అమెరికన్ డాలర్, యూరోను భారీగా అధిగమించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ శిరీష్ చంద్ర ముర్ము వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం భారత్‌లో సుమారు 176 బిలియన్ కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. అదే సమయంలో అమెరికా డాలర్ నోట్లు సుమారు 56 బిలియన్లు, యూరో నోట్లు దాదాపు 30 బిలియన్లుగా ఉన్నాయి. అంటే డాలర్ నోట్ల కంటే రూపాయి నోట్లు దాదాపు మూడు రెట్లు, యూరోతో పోలిస్తే దాదాపు ఆరు రెట్లు ఎక్కువ.
ఈ వివరాలను ముర్ము ఆగస్టు 13న జకార్తాలో బ్యాంక్ ఇండోనేషియా నిర్వహించిన గ్లోబల్ క్యాష్ మేనేజ్‌మెంట్ చర్చలో వెల్లడించారు. అయితే ఈ సంఖ్యను రూపాయి విలువలో డాలర్, యూరోను అధిగమించిందని అర్థం చేసుకోవద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నోట్ల సంఖ్య ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం భారతదేశంలో చిన్న విలువ కలిగిన నోట్ల వినియోగం అధికంగా ఉండటమే. ఒకే విలువైన లావాదేవీని నిర్వహించడానికి భారత్‌లో ఇతర దేశాల కంటే ఎక్కువ సంఖ్యలో నోట్లు అవసరమవుతాయి.
176 బిలియన్ నోట్ల వెనుక అసలు కథేంటి?
భారత్‌లో నగదు వ్యవస్థ ఎంత భారీ స్థాయిలో పనిచేస్తుందో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆర్‌బీఐ ప్రతి ఏడాది సుమారు 28 నుంచి 30 బిలియన్ కొత్త నోట్లను ఆరు డినామినేషన్లలో ముద్రిస్తోంది. అదే సమయంలో చిరిగిపోయిన, పాడైన, వినియోగానికి పనికిరాని సుమారు 21 బిలియన్ నోట్లను చలామణి నుంచి తొలగిస్తోంది. ఇంత భారీ స్థాయిలో ముద్రణ, పంపిణీ, సేకరణ, రీసైక్లింగ్ నిర్వహించడం కేంద్ర బ్యాంకుకు పెద్ద లాజిస్టిక్స్ సవాలుగా మారుతోంది. చలామణిలో ఉన్న నోట్లలో రూ.500 డినామినేషన్‌దే అత్యధిక వాటా. 2026, ఆగస్టు 7 నాటికి రూ.500 నోట్లు సుమారు 7.26 లక్షల లక్షల ముక్కలుగా ఉండగా, వాటి మొత్తం విలువ సుమారు రూ.36.29 లక్షల కోట్లుగా నమోదైంది.
డిజిటల్ చెల్లింపులు పెరిగినా.. నగదు ఎందుకు తగ్గడం లేదు?
భారత్‌లో యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, కార్డులు వంటి డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. వ్యక్తిగత లావాదేవీల్లో నగదు వాటా తగ్గుతున్నప్పటికీ.. చలామణిలో ఉన్న మొత్తం నగదు మాత్రం తగ్గడం లేదు. పైగా అది రెండంకెల వృద్ధి రేటుతో పెరుగుతోందని ముర్ము పేర్కొన్నారు. ఇదే పరిస్థితిని ఆయన ‘క్యాష్ పారడాక్స్’గా అభివర్ణించారు. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలు, తక్కువ ఆదాయ వర్గాలు, వృద్ధులు, చిన్న వ్యాపారాల్లో నగదుపై ఆధారపడటం ఇప్పటికీ ఎక్కువగా ఉంది. దీంతో డిజిటల్ చెల్లింపులు పెరిగినా.. నగదుకు డిమాండ్ కొనసాగుతోంది. భవిష్యత్తులో ఎంత నగదు అవసరమవుతుందో అంచనా వేయడం ఆర్‌బీఐకి మరింత క్లిష్టంగా మారుతోంది.
నోట్ల జీవితకాలంపై ఆర్‌బీఐ దృష్టి!
నోట్ల ముద్రణ, నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు ఆర్‌బీఐ కొత్త మార్గాలను పరిశీలిస్తోంది. నోట్లపై ప్రత్యేక సర్ఫేస్ కోటింగ్, తక్కువ డినామినేషన్లకు పాలిమర్ నోట్ల వినియోగం వంటి అంశాలపై పరిశీలన జరుగుతోంది. రూ.10, రూ.20 పాలిమర్ నోట్లకు సంబంధించి ఫీల్డ్ ట్రయల్స్ కోసం ఒక బిలియన్ నోట్ల ప్రవేశానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. అంటే.. డిజిటల్ ఇండియాగా వేగంగా మారుతున్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థలో క్యాష్ ఇంకా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచంలోని ప్రధాన కరెన్సీలతో పోలిస్తే అత్యధిక సంఖ్యలో నోట్లు చలామణిలో ఉండటం భారత నగదు వ్యవస్థ పరిమాణాన్ని మాత్రమే కాకుండా.. దాన్ని నిర్వహించడంలో ఆర్‌బీఐ ఎదుర్కొంటున్న భారీ బాధ్యతను కూడా స్పష్టంగా చూపిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
