AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫుజి పర్వతంపై కలకలం..చిన్నారిని ఒంటరిగా వదిలి వెళ్లిన తండ్రి..పోలీసుల ఎంట్రీతో షాక్

జపాన్‌లోని 'ఫుజి పర్వతం' చుట్టూ మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా వర్షం ధారాపాతంగా కురిసే అవకాశం ఉంది. ఒక వైపు ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోతున్నాయి. నడవలేకపోతున్నా నాన్నా అంటున్న కొడుకు మాటను లెక్కచేయకుండా 8,200 అడుగుల శిఖరాన్ని చేరుకోవాలనే మొండి పట్టుదలతో తండ్రి ముందుకెళ్లాడు.

ఫుజి పర్వతంపై కలకలం..చిన్నారిని ఒంటరిగా వదిలి వెళ్లిన తండ్రి..పోలీసుల ఎంట్రీతో షాక్
Father Leaves 7 Year Old Son Alone On Mount Fuji
Sharada V
|

Updated on: Aug 22, 2026 | 6:06 PM

Share

జపాన్‌లో ఓ 48 ఏళ్ల తండ్రి, ఇద్దరు కొడుకులతో కలిసి పర్వతారోహణకు వెళ్లాడు. 15 ఏళ్ల పెద్ద కొడుకు,  ఏడేళ్ల  చిన్న కొడుకుతో ఫుజి పర్వతం ఎక్కుతుండగా ఒక్కసారిగా ఆక్సిజన్ స్థాయిలు పడిపోయాయి. 6వ స్టేషన్ వద్ద  7 ఏళ్ల చిన్నారి అలసిపోయాడు. “నాన్నా.. ఇక ముందుకు రాలేను” అని అమాయకంగా తండ్రిని వేడుకున్నాడు. సాధారణంగా ఏ తండ్రైనా ఏం చేస్తాడు?  పర్యటనను మధ్యలో ఆపేసి బిడ్డను ఒడిలోకి తీసుకుంటాడు. కానీ ఆ తండ్రి మనసులో ఎవరూ ఊహించని ఆలోచన మెదిలింది! శిఖరాన్ని చేరుకోవాలనే మొండి పట్టుదలతో ముందుకు వెళ్లాలనే డిసైడయ్యాడు. ఆ క్షణం బిడ్డ భద్రత కంటే ముందుకు సాగడమే ముఖ్యమనుకున్నాడు.

ఎముకలు కొరికే చలిలో ఒంటరిగా ఆరుబయట.. !

7 ఏళ్ల బాలుడిని అక్కడే ఉన్న ఒక చెక్క బెంచ్ మీద కూర్చోబెట్టాడు. “మేం పైకి వెళ్లి శిఖరాన్ని చూసి వస్తాం. నువ్వు ఇక్కడే ఎక్కడికీ కదలకుండా ఉండు” అని చెప్పి, పెద్ద కొడుకుని తీసుకుని శిఖరం వైపు వేగంగా అడుగులు వేశాడు. సరిగ్గా అప్పుడే వర్షం మొదలైంది. దట్టమైన పొగమంచు పర్వతాన్ని చుట్టేసింది. కంటికి కానరాని చీకటి, తోడుగా వణుకు పుట్టించే చలి, వీచే ఈదురుగాలులు! చుట్టూ అంతా గుర్తుతెలియని పర్వత ప్రాంతం. భయంతో వణుకుతున్న ఆ చిన్నారి, ఏకంగా 8 గంటల పాటు తండ్రి వస్తాడేమోనని  ఆరుబయట బెంచ్ మీదే కన్నీళ్లతో వేచి చూశాడు.

వెలుగులోకి షాకింగ్ నిజం!

ఉదయం 7:40 గంటల సమయం. ఆ ప్రాంతంలో ఒక మౌంటెన్ హట్ (పర్వత విశ్రాంతి గది) వర్కర్ కిటికీలోంచి బయటకు చూశాడు. వర్షంలో, పొగమంచు నడుమ ఒక చిన్న బాబు ఒంటరిగా బెంచ్ మీద కూర్చుని ఏడుస్తూ కనిపించాడు. అది చూసి అతడు షాకయ్యాడు!

వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బాబును లోపలికి తీసుకెళ్లాడు. వేడి టీ, దుప్పటి ఇచ్చి, “మీ నాన్న ఎక్కడ?” అని ఆరా తీశాడు. ఆ చిన్నారి చెప్పిన సమాధానం విన్న అక్కడ వారందరి వెన్నులో వణుకు పుట్టింది. “మా నాన్న అన్నయ్యతో కలిసి కొండ పైకి వెళ్లాడు. నన్ను ఇక్కడే ఉండమన్నాడు” అని ఆ పసివాడు నీరసంగా చెప్పాడు.

సముద్ర మట్టానికి 2,500 మీటర్ల ఎత్తులో, అడవి జంతువులు తిరగాడే చోట,  చలి వాతావరణంలో చిన్నారిని ఒంటరిగా వదలడం అతని ప్రాణాలకే ప్రమాదం! వర్కర్ ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాడు.

అలర్ట్ అయిన పోలీసులు.. 8వ స్టేషన్ వద్ద తండ్రి లొకేషన్!

రంగంలోకి దిగిన జపాన్ పోలీసులు తక్షణమే సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. పర్వతం పైకి వెళ్తున్న ఇతర ట్రెక్కర్ల సహాయంతో తండ్రి సమాచారాన్ని సేకరించారు. ఆ సమయంలో ఆ తండ్రి, పెద్ద కొడుకుతో కలిసి ఇంకా పైకి.. అంటే 8వ స్టేషన్ వైపు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది! పోలీసులు తండ్రిని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి, తీవ్రంగా హెచ్చరించారు. తండ్రి హుటాహుటిన 6వ స్టేషన్‌కు తిరిగి వచ్చాడు. అప్పటికే సురక్షితంగా ఉన్న చిన్నారిని చూసి ఊపిరి పీల్చుకున్నప్పటికీ, అతని నిర్లక్ష్యానికి పోలీసులు క్లాస్ పీకారు.

పిల్లాడిని ఒంటరిగా వదిలి ఎందుకు ముందుకు వెళ్లారని ప్రశ్నించారు. పర్వతారోహణ ఒక సాహసమే కానీ అది ప్రాణాల కంటే ముఖ్యం కాదు. పిల్లలతో కలిసి ట్రెకింగ్ కి వెళ్లినప్పుడు, వారి శారీరక సామర్థ్యాన్ని బట్టి ప్లాన్ మార్చుకోవాలి అంటూ హెచ్చరించారు. అడ్వెంచర్ స్పోర్ట్ గా  ట్రెకింగ్ ఓకే కానీ.. పీక్‌ పాయింట్ కు చేరుకోవాలనే ఆతృతలో పిల్లల సేఫ్టీ విషయంలో రాజీపడకూడదు అంటూ  సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “శిఖరాన్ని చేరుకోవాలనే స్వార్థంతో కొడుకు సురక్షితాన్ని గాలికి వదిలేస్తారా?” అని మండిపడుతున్నారు.

Follow Us